US Student Visas: అమెరికాకు క్యూ కట్టిన భారతీయ విద్యార్థులు.. మూడు నెలల్లో 90 వేల వీసాలు జారీ..!

అమెరికా విద్యాసంస్థల్లో చేరిన భారతీయ విద్యార్థుల సంఖ్య రెండు లక్షలు దాటింది. అంతేకాదు.. గత మూడు నెలల్లోనే 90 వేల మంది భారతీయ విద్యార్థులకు అమెరికా వీసాలు జారీ చేసింది. జూన్, జూలై, ఆగష్టులోనే ఈ స్థాయిలో వీసాలు జారీ అయ్యాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 25, 2023 | 03:36 PMLast Updated on: Sep 25, 2023 | 3:36 PM

Us Issues Record 90000 Visas To Indian Students In Last Three Months

US Student Visas: అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించేందుకు భారతీయ విద్యార్థులు క్యూ కడుతున్నారు. ఈ ఏడాది అక్కడి విద్యాసంస్థల్లో చేరిన భారతీయ విద్యార్థుల సంఖ్య రెండు లక్షలు దాటింది. అంతేకాదు.. గత మూడు నెలల్లోనే 90 వేల మంది భారతీయ విద్యార్థులకు అమెరికా వీసాలు జారీ చేసింది. జూన్, జూలై, ఆగష్టులోనే ఈ స్థాయిలో వీసాలు జారీ అయ్యాయి. ఈ వేసవి కాలం నుంచి విద్యార్థులు అమెరికా ఎక్కువగా వెళ్తున్నారు. మరోవైపు కొందరు అమెరికా విద్యార్థులు కూడా ఇండియాకు వస్తున్నారు.

ఇలా పరస్పరం విద్యార్థుల విషయంలో సహకరించుకోవాలనే ఇండియా, అమెరికా ఒప్పందంలో భాగంగానే ఇండియాకు అధిక వీసాలు మంజూరు చేస్తోంది. ఈ అంశంపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా అమెరికా రాయబార కార్యాలయం స్పందించింది. అమెరికా జారీ చేసిన ప్రతి నాలుగు వీసాల్లో ఒకటి ఇండియాదేనని పేర్కొంది. అర్హులైన వారికి తగిన అవకాశాలు దక్కుతాయని తెలిపింది. ఎంపికైన భారతీయ విద్యార్థులకు అభినందనలు తెలిపింది. అమెరికాలో ఉన్నత విద్య కోసం ఎక్కువగా వెళ్తోంది భారతీయులే. గత ఏడాది మొత్తంగా 1.25 లక్షల మంది భారతీయులకు విద్యార్థి వీసాలు మంజూరు చేసింది. గత వేసవిలో 82 వేల మందికి వీసాలు జారీ చేసింది. ఈ ఏడాది మరింత ఎక్కువగా భారతీయ విద్యార్థులకు వీసాలు జారీ చేసే అవకాశం ఉందని ఇండియాలో అమెరికా ప్రతినిధి బ్రెండన్ ముల్లార్కే అన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి అమెరికాలో విదేశీ విద్యార్థుల సంఖ్య 20 శాతం పెరిగిందన్నారు. ఇరు దేశాల మధ్య విద్యా సంబంధాలు మెరుగుపడుతున్న తరుణంలో మరో కొత్త ముందడుగుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.

ఇరు దేశాల మధ్య ఒక వర్చువల్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేయనున్నట్లు బ్రెండన్ తెలిపారు. ఇటీవల జీ20 సదస్సు సందర్భంగా ఇండియా, అమెరికా మధ్య దీనిపై ఒక అవగాహనా ఒప్పందం కుదిరినట్లు ఆయన తెలిపారు. ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్ దీనిపై సంతకాలు చేశారన్నారు. అమెరికాలో చదువుకోవాలని ఆశపడే విద్యార్థులకు సలహాలు, సూచనలు ఇవ్వడానికి, సహాయం చేయడానికి ఎడ్యుకేషన్ యూఎస్‌ఏ పేరుతో ఒక కార్యక్రమం కూడా నిర్వహిస్తోంది ప్రభుత్వం. అవసరమైన విద్యార్థులు దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.