Using Mobile Apps: శాపంగా మారిన సోషల్ మీడియా శకం – అసలు తప్పు ఎవరిది..?
ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సప్, యూట్యూబ్, ఇన్ స్ట్రాగామ్, షేర్ చాట్, టెలిగ్రామ్ ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే వీటి లిస్ట్ చాలా ఎక్కువనే ఉంటుంది. ఒకప్పుడు ఒకరితో ఒకరు సంభాషించుకోవాలంటే ఉత్తరాలు రాసుకునే వారు. ఆ ట్రెండ్ క్రమక్రమంగా ఫోన్ లో మెసేజ్ లు పంపించుకోవడం వరకూ వచ్చింది. అలాగే వాట్సప్ అనే చాటింగ్ యాప్ తో ప్రారంభమై నేడు పలికేందుకు కూడా నోరు తిరగని వింతపేర్లతో సరికొత్త యాప్ లు వెలుగులోకి వస్తున్నాయి.
అలవాటు కాస్త పిచ్చిగా మారింది:
సోషల్ మీడియా ఒకప్పుడు అలవాటు.. అది కాస్త వ్యసనంగా మారింది. అదే వ్యసనం ఇప్పుడు పిచ్చిగా మారిపోయింది. ఒక్కనిమిషం దీనిని విడిచి ఉండాలంటే మనసు రావడం లేదు. తాజాగా ఓ సర్వే “ఆఫ్ కమ్” లెక్కల ప్రకారం పాశ్చాత్య దేశాల్లో 98శాతం మంది యువతరం రోజులో ఎక్కువ కాలం ఆన్ లైన్లో గడుపుతున్నట్లు తెలిపింది. ఇలా గడిపేవారి వయసును కూడా ప్రకటించింది. కేవలం 16 నుంచి 24 సంవత్సరాల వయస్సు కలిగిన వారు ఇందులో ఎక్కువ ఉన్నట్లు తెలిపారు. రోజులో ప్రతి 30నిమిషాల్లో కనీసం మూడు యాప్ లలో ఏదో ఒక దానినైనా ఓపెన్ చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లు ఈ నివేదిక తెలిపింది. ఇదాంతా ప్రాశ్చాత్య దేశలకు సంబంధించిన సమాచారం.
ఎక్కడా తగ్గని భారత్:
ఇక మన దేశంలో కూడా మొబైల్ ఫోన్ వాడకం అమాంతం పెరిగింది. ఒకప్పుడు ప్రతిజేబులో రంగుంది అనే ట్యాగ్ లైన్ తో నోకియా ఫోన్ సంస్థ ప్రకటనను అప్పట్లో ప్రసారం చేసేది. అలా ఇప్పుడు ప్రతి జేబులో రంగేమి కర్మ ప్రపంచమే ఉంది. ఉదయం లేచిన మోదలు సుప్రభాతం వినడం దగ్గర నుంచి బయటకు వెళ్లేందుకు గూగుల్ మ్యాప్ ద్వారా లోకేషన్ సర్చ్ చేసేంత వరకూ.. అలాగే మధ్యాహ్నం వంట వండేందుకు యూట్యూబ్ రెసిపీ దగ్గర నుంచి వాటిని ఎలా చేసానో చూపించేందుకు వాట్సప్ లో స్టేటన్ పెట్టుకునేంతగా పరాకాష్టకు చేరింది. ఇక సాయంత్రం సరదాగా పాటలు వినాలనుకునే కోరిక నుంచి రాత్రి పడుకునే ముందు ఇంట్లో వాళ్లతో వీడియో కాల్ మాట్లాడుకునేంత వరకూ ఇలా సాంకేతికత దినదినాభివృద్ది చెందినట్లు వీటి వినియోగం మాత్రం గడియగడియాభివృద్ది చెందింది.
సాహసాలు, విన్యాసాలు:
ఇంతలా వినియోగిస్తున్న మన దేశంలో దీని ప్రభావం 33.07 శాతం ఉన్నట్లు ఆ నివేదికలో తెలిపారు. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి ఫోన్ చూసుకునేందుకు తారసపడుతున్నట్లు వివరించారు. మొబైల్ తో ఏపని లేకున్నా అదేపనిగా ఓపెన్ చేసి చూడటం పరిపాటిగా మారింది. కాస్త తీరిక సమయం దొరికితే చాలు నెట్ ఆన్ చేసి చాట్ చేయడం లేదా యూట్యూబ్ లో రీల్స్ చూడటం చేస్తూ ఉంటారు. ఇంకా బాత్ రూం లో కూడా మోబైల్ తీసుకొని వెళ్లేవారు ఉన్నారు. ఇంకొంత మందైతే రీల్స్ లో షూట్ చేయడం కోసం పలు సాహసాలు, విన్యాసాలు చేస్తారు. ఇలా చేసి ప్రాణం మీదకు తెచ్చుకున్న వారు చాలా మందే ఉన్నారు. ఇలా చేసిన వాటిని రకరకాలా యాప్స్ లో అప్లోడ్ చేసి వాటికి లైకులు, షేర్లు, కామెంట్లు ఎన్నివస్తున్నాయో చూసేందుకు ఉబలాటపడుతున్నారు. వీరు చేసిన వీడియోలు పోస్ట్ చేసేందుకు, వేరొకరు చేసినవి చూసేందుకు తగ సంబరపడిపోతున్నారు.
త్వరలో UK ను దాటేయనున్న ఇండియా:
రోజుకు 5 గంటల కంటే ఎక్కువ సేపు ఆన్ లైన్ లో ఉండే వారిని వ్యసనపరులుగా చెబుతున్నారు. ఇటీవలే విడుదలైన తాజా సర్వేలో యూకే లో 10శాతం మంది ఉండగా మన దేశంలో 4.7 శాతం ఉన్నట్లు ప్రకటించారు. రానున్న అతికొద్ది రోజుల్లో ఇది 12శాతం పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. వైద్యులు ఇలాంటి సోషల్ మీడియా అడిక్షన్ అనేది చాలా ప్రమాదం అని చెబుతున్నారు. ఇష్టమైన యాప్స్ ఒపెన్ చేసినప్పుడల్లా మన మెదడులో ఆనందాన్ని కలిగించే డోపమైన్స్ ఉత్పత్తి అవుతాయని వీటి స్థాయి పెరిగే కొద్ది న్యూరో ట్రాన్స్ మీటర్లు ఆనందంతో కదిలికలకు గురవుతాయని చెబుతున్నారు. ఇలా తదేకంగా చూడటం వల్ల చూపు మందగించి, తలనొప్పి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని అంటున్నారు. వీటి ప్రభావం భవిష్యత్తులో సంతానోత్పత్తి మీద కూడా పడతాయని వివరిస్తున్నారు.
అడిక్షన్ లక్షణాలు:
మనకు సోషల్ మీడియా అడిక్షన్ ఉందో లేదో గుర్తించేందుకు చికాగో యూనివర్సిటీ ఒక అధ్యయనం చేసింది. ఇందులో కొన్ని లక్షణాలను వెల్లడించింది. అందులో ముఖ్యమైనవి తెలుసుకుందాం. ఈ లక్షణాలు మీకు ఉంటే సరిచేసుకోండి. ఇప్పుడు సరదాగానే ఉంటుంది. భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించక తప్పదు.
సామాజిక మాధ్యమాల్లో అధికంగా ఉండటం వల్ల ఉద్యోగం, చదువు, పనులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలిపింది.
ఫోన్ చూడటం కొంత వరకూ దుష్పరిణామాలకు దారితీసినా యాప్ లను ఓపెన్ చేయడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురి అవుతారని చెబుతోంది.
సాధారణంగా ఫెండ్స్, ఫ్యామిలీతో గడిపేటప్పుడు, భోజనం చేసేటప్పుడు స్మార్ట్ ఫోన్ లను వినియోగిస్తుంటే మీరు వీటికి బానిసైనట్లు చెప్పవచ్చు.
మీకు అవసరమైన చిన్న సమాచారానికి కూడా మొబైల్ ఫోన్స్ పై పడటం కూడా ఒక రకమైన వ్యసనంగా చెప్పాలి.
ఫోన్ లో డేటా ఉండి కాసేపు ఇంటర్నెట్ రాకుంటే ఏదో ప్రపంచం మునిగిపోయినంత చికాకు, కోపం, చాలా విలువైనవి ఏవో పోగొట్టుకున్నట్లు అనిపించడం ఇలాంటివన్నీ సోషల్ మీడియా అడిక్షన్ కిందకే వస్తాయి.
పూర్తి మొబైల్ వినియోగం ఇలా:
ఈ సర్వే ప్రకారం ఫోన్ అస్సలు స్విచ్ ఆఫ్ చేయనివారు 50శాతం మంది. బాత్ రూంలోనూ సెల్ ఫోన్ ఉపయోగించే వారి శాతం 40 గా ఉంది. డ్రైవింగ్ లో ఒక్కసారైనా మెసేజ్ చేసే వారు 75శాతంగా ఉన్నారు. పడుకునే ముందు నిద్రలేవంగానే ఫోన్ దర్శనం చేసుకునే వారు 87శాతం మంది ఉన్నారట. రోజుకు 150 సార్లు ఫోన్ అన్ లాక్ చేస్తారట. ఫోన్ పక్కన పెట్టుకొని నిద్రపోయేవారు 71శాతం మంది ఉన్నారని ఈ సర్వే చెబుతోంది. అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్లు ఏదైనా మితంగా ఉపయోగిస్తే ప్రయోజనం ఉంటుంది. అదే విచ్చలవిడిగా వాడితే అనార్థాలకు కారణం అవుతుంది.