Sudan War: సూడాన్ తగలబడుతుంటే చలి కాచుకుందామా? పొరుగు దేశాలు ఏం చేస్తున్నాయి ?
దేశం తగలబడుతోంది..రాజధాని రణరంగంగా మారింది.. జన సంచారంతో సందడిగా కనిపించాల్సిన వీధులు శవాలతో శ్మశానాన్ని తలపిస్తున్నాయి. జన్మనిచ్చిన భూమిలో రక్తం ఏరులై పారుతుంటే రేపు తమ తల కూడా తెగిపోతుందేమోనన్న ప్రాణభయంతో ప్రజలు వలసబాట పట్టారు.
దేశం సంక్షోభంలో చిక్కుకుని ప్రజలు తిండీతిప్పలు లేక నానా అవస్థలు పడుతుంటే వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన పాలకులు ఆధిపత్య ధోరణితో అగ్గికి ఆజ్ఞం పోస్తున్నారు. ఇదీ స్థూలంగా సూడాన్ ప్రస్తుత ముఖ చిత్రం. శత్రువులపై తుపాకి ఎక్కుపెట్టాల్సిన మిలటరీ పాలకులు తమలో తామే ఘర్షణకు దిగి చివరకు దేశాన్ని రోడ్డున పడేశారు. రెండు మిలటరీ వర్గాల మధ్య జరుగుతున్న ఆధిపత్యపోరుకు సూడాన్ సర్వనాశనమైపోతోంది. అయితే ఈ సంక్షోభం సూడాన్‌కు మాత్రమే పరిమితమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. ఆఫ్రికా ఖండమే పెను సంక్షోభంలో చిక్కుకునే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది.
నైలు నది తీరంలో ఏం జరుగుతోంది ?
ఆఫ్రికా ఖండంలోనే మూడో అతిపెద్ద దేశంగా ఉన్న సూడాన్.. భౌగోళిక, రాజకీయ ముఖ చిత్రాన్ని గమనిస్తే ఆ దేశ సంక్షోభ ప్రభావం కేవలం సూడాన్ వరకే పరిమితమవుతుందనికోలేం. ప్రపంచంలోనే అతి పెద్ద నదిగా చెప్పుకునే నైలు నది పరివాహక ప్రాంతంలో ఉన్న సూడాన్ ఏడు దేశాలతో సరిహద్దులను పంచుకుంటోంది. అయితే ఈ ఏడు దేశాలు కూడా వివిధ సంక్షోభాలతో సతమతమవుతున్నాయి. ఆయా దేశాల్లో సంక్షోభాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా సూడాన్ కూడా కారణం కావడం మరో విషాదం.
చాద్ పారిపోతున్న సైన్యం
ఉత్తర, మధ్య ఆఫ్రికా కలిసే ప్రాంతంలో ఉన్న చిన్న దేశం చాద్. సూడాన్‌కు ఇది సరిహద్దు దేశం. రెండు దేశాలు 1400 కి.మీ సరిహద్దును పంచుకుంటున్నాయి. సూడాన్ రాజధాని కార్టోమ్‌లో సైనిక వర్గాల మధ్య ఘర్షణ మొదలవగానే.. సైన్యం చూపు చాద్‌పై పడింది. సైన్యానికి, పారామిలటరీ దళానికి మధ్య జరుగుతున్న ఘర్షణలో తాము ప్రాణాలు కోల్పోతామేమోనన్న భయంతో చాలా మంది సైనికులు దేశం దాటి చాద్ పారిపోయారు. గత శనివారం రాజధానిలో ఘర్షణ మొదలవగానే..Ch దాదాపు 320 మంది సూడాన్ సైనికులు సరిహద్దులు దాటి తమ శంలోకి వచ్చినట్టు చాద్ ప్రకటించింది.
సూడాన్‌లో సంక్షోభాన్ని గమనించిన చాద్ ప్రభుత్వం..తమ దేశంలోకి చొరబడ్డ సూడాన్ సైనికులను బంధించింది. వాళ్ల నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకుంది. వెంటనే సూడాన్ సరిహద్దులను మూసేసింది. పారామిలటరీ దళం… రాపిడ్ సపోర్ట్ ఫోర్స్ ( RSF) చేతిలో చనిపోతామని భయపడ్డ సూడాన్ ఆర్మీ సైనికులు ఇలా పొరుగుదేశాల్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే చాద్ సూడాన్ విషయంలో మరో కీలక సమస్య కూడా ఉంది. చాద్‌లో కూడా సూడాన్ తరహా పరిస్థితులే ఉన్నాయి. చాద్ -సూడాన్ సరిహద్దులు రెండు దేశాలకు చెందిన రెబల్ గ్రూపులకు అడ్డాగా ఉంటాయి. రెబల్ గ్రూపులు సరిహద్దులు దాటడం, ఘర్షణలకు దిగడం అక్కడ నిత్యకృత్యం.
తాజాగా చోటుచేసుకున్న సైనిక వర్గాల ఘర్షణ సరిహద్దుల్లో మరింత అగ్గిరాజేసింది. ఓవైపు భయంతో పారిపోయే సైన్యం…మరోవైపు అల్లకల్లోలం సృష్టంచేందుకు సిద్ధంగా ఉన్న రెబల్ గ్రూప్స్… చాద్- సూడాన్ సరిహద్దుల్లో టెన్షన్‌కు కారణమవుతున్నాయి. ప్రస్తుతానికి చాద్ పాలకులు సూడాన్ లో ఎవరిపక్షం తీసుకోకుండా తటస్థంగానే ఉన్నారు. పరిస్థితి ముదిరితే… సూడాన్ మిలటరీకి గానీ, రాపిడ్ సపోర్ట్ ఫోర్స్ కు గానీ మద్దతివ్వాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. అప్పుడు పరిణామాలు ఇంకాదారుణంగా మారుతాయి. ఇక చాద్‌కు ఆనుకుని సూడాన్‌తో బోర్డర్ షేర్ చేసుకుంటున్న లిబియా విషయంలోనూ ఇదే జరుగుతుంది. లిబియా కూడా అంతర్యుద్ధానికి పెట్టింది పేరు. ఇక సరిహద్దు సమస్యలు సరేసరి.
సూడాన్ ఉత్తరం సంక్షోభ నిలయం
ఇంట్లో సమస్యలు.. ఇంటి బయట సమస్యలు అన్నట్టు ఉంటుంది సూడాన్ పరిస్థితి. మిలటరీ వర్గాలు సృష్టించే ఘర్షణలతో సతమతమవుతున్న సూడాన్ పొరుగు దేశాల నుంచి కూడా పోరే. గెరిల్లా సంఘర్షణలతో నిత్యం రగులుతూ ఉండే మరో ఆఫ్రికా దేశం ఇథియోఫియా సూడాన్‌ను ఆనుకునే ఉంటుంది. ఇథియోఫియాలో ఎప్పుడూ రాజకీయ అనిశ్చితే. ఇది ఏదో రూపంలో సూడాన్ పై ప్రభావం చూపిస్తూనే ఉంటుంది. గెరిల్లా ఘర్షణలతో రెబల్ గ్రూపులు ఇథియోఫియాను అట్టుడికిస్తూ ఉంటాయి. సూడాన్ సరిహద్దులపై ఆ ప్రభావం రోజూ కనిపిస్తూనే ఉంటుంది. ఇథియోఫియాకు ఆనుకునే ఉన్న ఎరిట్రియా దేశం కూడా సూడాన్‌తో బోర్డర్‌ను షేర్ చేసుకుంటుంది. ఎరిట్రియా మిలటరీ నియంతృత్వంలో ఉంది. అక్కడ సైన్యం చెప్పిందే వేదం. సూడాన్‌లో సైన్యం, పారామిలటరీ దళాల్లో ఎవరైనా ఎరిట్రియాలో మిలటరీ మద్దతు తీసుకుంటే ఘర్షణ వాతావరణ తారా స్థాయికి చేరుతుంది.
సూడాన్‌ను ముంచేసిన సౌత్ సూడాన్
సూడాన్ నుంచి స్వాతంత్య్రం పొందిన సౌత్ సూడాన్ మాతృదేశానికే గుదిబండగా మారింది. ఆఫ్రికాలోనే సుధీర్ఘంగా సాగిన సివిల్ వార్ తర్వాత సౌత్ సూడాన్ దేశం ఆవిర్భవించింది. సూడాన్ దక్షిణ ప్రాంతంలో ఉన్న 10 రాష్ట్రాలతో దక్షిణ సూడాన్ అవతరించింది. ప్రత్యేక దేశం ఏర్పడినా ఇప్పటికీ సౌత్ సూడన్‌లో ప్రచ్ఛన్న యుద్ధం మాత్రం ముగియలేదు. సౌత్ సూడాన్ ఏర్పడే వరకు సూడాన్‌లో అంతర్భాగంగా ఉన్న ఎంతో విలువైన ఆయిల్ ఫీల్డ్స్ అన్నీ సౌత్ సూడాన్ పరిధిలోకి వెళ్లిపోయాయి. దేశానికి ఆదాయం తెచ్చిపెట్టే ప్రధాన సహజవనరైన ఆయిల్ ఫీల్డ్స్ సౌత్ సూడాన్‌లో వెళ్లిపోవడంతో సూడాన్ కరవు దేశంగా మారిపోయింది. దేశానికి ఆర్థిక పరిపుష్టిని అందించే వ్యవసాయం, బంగారం తవ్వకాలు వంటి వాటిపై ఆధిపత్యం కోసం ప్రస్తుతం సూడాన్ మిలటరీ రైవల్స్ మధ్య పెద్ద యుద్ధమే సాగుతోంది.
సూడాన్ సంక్షోభం- విదేశీ శక్తుల హస్తం
దేశాన్ని సర్వనాశనం చేస్తున్న సూడాన్ మిలటరీ ప్రత్యర్థులు ఆ దేశానికి భవిష్యత్తు లేకుండా చేస్తున్నారు. తమ స్వార్థం కోసం విదేశీ పెట్టుబడిదారులకు దేశ సహజ సంపదను దోచి పెట్టి చివరకు దేశాన్ని ఆగమాగం చేస్తున్నారు. పూర్తిస్థాయిలో అవినీతిలో కూరుకుపోయిన మిలటరీ పాలకులు స్థానిక ఆర్థిక వ్యవస్థలను దారుణంగా దెబ్బతీస్తున్నారు. నైలు నది తీరంలో సారవంతమైన భూములను వ్యవసాయం పేరుతో గల్ఫ్ దేశాలకు కట్టపెట్టారు.
సూడాన్ సంక్షోభం వెనుక రష్యా ఉందా ?
సూడాన్‌కు ఉన్న ఎర్ర సముద్రం ఆ దేశానికి పెద్ద వరం. ఎందుకంటే పోర్టు సూడాన్ ద్వారా ఇతర దేశాలతో వ్యాపారాలు జరుగుతున్నాయి. అయితే పోర్టు సూడాన్‌పై రష్యా కొన్ని సంవత్సరాల క్రితమే కన్నేసింది. అక్కడ మిలటరీ బేస్ ఏర్పాటు చేయాలని పుతిన్ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి అధికారంలోకి వచ్చిన మిలటరీ పాలకులతో రష్యా 2021లోనే ఒప్పందం చేసుకునేందుకు ప్రయత్నించింది. ఓవైపు రష్యా తమ ప్రయోజనాల కోసం సూడాన్ భూభాగాన్ని వాడుకునేందుకు ప్రయత్నిస్తుంటే.. మరోవైపు రష్యాకు చెందిన బడా కంపెనీలు సూడాన్‌లో బంగారాన్ని కొల్లగొడుతున్నాయి. రష్యాకు చెందిన ప్రైవేటు మిలటరీ సంస్థ Wagner group సూడాన్ నుంచి బంగారాన్ని ఇతర దేశాలకు స్మగ్లింగ్ చేస్తున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటోంది.
రాపిడ్ సపోర్ట్ ఫోర్స్ కు రష్యా ఆయుధాలు
సూడాన్‌లో మిలటరీ వర్సెస్ పారామిలటరీ సంక్షోభానికి రష్యా ప్రభుత్వంతో పాటు అక్కడి వ్యాపార సంస్థలు ప్రత్యక్షంగా పరోక్షంగా సాయం అందిస్తున్నాయి. Sudan Rapid Support Forcesకు రష్యా సంస్థ Wagner group ఆయుధాలు సరఫరా చేస్తోంది. సూడాన్ రాపిడ్ ఫోర్స్ ప్రయోగిస్తున్న మిల్సైల్స్ అన్నీ ఆ సంస్థ అందించివే. లిబియాలో మిలటరీ జనరల్‌కు మద్దతిచ్చి అక్కడి భూభాగంపై కబ్జా చేసిన Wagner group…ఇప్పుడు సూడాన్ సంక్షోభంలోనూ తమ ప్రయోజనాలను చూసుకుంటోంది.
ప్రపంచ దేశాలు ఏం చేయాలి ?
సూడాన్ సంక్షోభాన్ని కేవలం అంతర్గత సమస్యగా మాత్రమే చూస్తే త్వరలోనే ఆ దేశం పూర్తిగా సర్వనాశనం అయిపోయే ప్రమాదముంది. సూడాన్‌తో భూభాగాన్ని పంచుకుంటున్న దేశాలు సంక్షోభ నివారణకు తక్షణం చొరవ తీసుకోవాలి. సూడాన్ సంక్షోభాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్న రెబల్ గ్రూపులను అణచివేయాలి. ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకుని సూడాన్ మిలటరీ పాలకులతో చర్చలు జరపాలి. తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటనలు సూడాన్ తలరాతను మార్చలేవు.