Cluster Bomb: ఉక్రెయిన్‌కు నిషేధిత క్లస్టర్ బాంబులిస్తున్న అమెరికా.. వీటిని ఎందుకు బ్యాన్ చేశారు..?

అనేక దేశాలు నిషేధించిన క్లస్టర్ బాంబుల్ని అమెరికా సిద్ధం చేసి, ఉక్రెయిన్‌కు అందిస్తోంది. ఈ విషయంలో రష్యా సహా అనేక దేశాలు అమెరికాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇంతకీ క్లస్టర్ బాంబులంటే ఏంటి..? వీటిని అనేక దేశాలు ఎందుకు నిషేధించాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 8, 2023 | 03:27 PMLast Updated on: Jul 08, 2023 | 3:27 PM

What Are Cluster Bombs Why Are They So Controversial

Cluster Bomb: యుద్ధరంగంలో చిక్కుకున్న ఉక్రెయిన్‌కు అమెరికా, యూరప్ దేశాలు ఆయుధ సాయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్ వాడుతున్న ఆయుధాలన్నీ దాదాపు పాశ్చాత్య దేశాలు సమకూర్చినవే. ఆయా దేశాలు ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తున్నాయి. ఇందులో సమస్యేమీ లేదు కానీ.. అమెరికా సరఫరా చేస్తున్న క్లస్టర్ బాంబులే ఇప్పుడు వివాదాస్పదమవుతున్నాయి. కారణం.. వీటిని అనేక దేశాల ఇప్పటికే నిషేధించాయి. అలాంటి నిషేధిత క్లస్టర్ బాంబులను ఉక్రెయిన్‌కు అమెరికా సరఫరా చేయడాన్ని రష్యా తప్పుబడుతోంది. ఇంతకీ క్లస్టర్ బాంబులంటే ఏంటి..? వీటిని అనేక దేశాలు ఎందుకు నిషేధించాయి.
యుద్ధ రంగంలో ఏ దేశమైనా తమ అవసరాన్ని బట్టి ప్రమాదకర ఆయుధాలు వాడుతుంటుంది. అలాగని అన్ని ఆయుధాల్ని వాడటానికి నిబంధనలు అంగీకరించవు. అందువల్లే చాలా దేశాల వద్ద అణ్వాయుధాలున్నా.. ఆయా దేశాలు వాటిని వాడలేదు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒక్క అణుబాంబు ప్రయోగం కూడా జరగలేదంటే దానికి కారణం ఆయా నిబంధనలే. ఒకవేళ ఏ దేశమైనానిబంధనలు ఉల్లంఘించి ఆయుధాలు వాడినా, దాడులకు దిగినా ప్రపంచ దేశాలు స్పందిస్తుంటాయి. ఆ దేశంపై ఆంక్షలు విధిస్తుంటాయి. ఈ విషయంలో ఎక్కువగా బలయ్యేది చిన్న, అభివృద్ధి చెందుతున్న దేశాలే. అందువల్ల బాంబుల వాడకంలోనూ కొన్ని నిబంధనల్ని పాటించాలి. అయితే, ప్రస్తుతం అమెరికా ఈ నిబంధనల్ని పాటించడం లేదనిపిస్తోంది. అనేక దేశాలు నిషేధించిన క్లస్టర్ బాంబుల్ని అమెరికా సిద్ధం చేసి, ఉక్రెయిన్‌కు అందిస్తోంది. ఈ విషయంలో రష్యా సహా అనేక దేశాలు అమెరికాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
క్లస్టర్ బాంబులంటే ఏంటి..? నిషేధం ఎందుకు..?
వీటిని క్లస్టర్ మ్యునిషన్స్ లేదా క్లస్టర్ బాంబులు అని కూడా అంటారు. ఇది ఒక్క బాంబు కాదు. దీనిలోపల పదుల సంఖ్యలో అనేక చిన్న బాంబులు ఉంటాయి. ఈ చిన్న బాంబులను సబ్ మ్యునిషన్స్ అంటారు. వీటిని యుద్ధ విమానాల నుంచి, సముద్ర తలం నుంచి, భూ ఉపరితలం నుంచి మిస్సైల్స్, రాకెట్ లాంఛర్ల ద్వారా ప్రయోగించవచ్చు. ఇవి నిర్దేశిత లక్ష్యంలోని ఉపరితలంపైకి చేరుకున్న తర్వాత, కొంత ఎత్తులో ఓపెన్ అవుతాయి. వీటి నుంచి అనేక చిన్న బాంబులు బయటకు వచ్చి, వేటికవి కొంత దూరం వరకు వెళ్లిపోతాయి. అంటే ప్రతి క్లస్టర్ బాంబు నుంచి బయటకు వచ్చిన చిన్న బాంబులన్నీ కలిసి ఒక ఫుట్ బాల్ స్టేడియం అంత విస్తీర్ణంలో అంతటా వ్యాపిస్తాయి. తర్వాత ఇవి కొంత నిర్ణీత సమయం తర్వాత పేలుతాయి.

ఇవి ప్రయోగించిన ఒక లక్ష్యంపైకి కాకుండా.. చుట్టూ పేలిపోతాయి. వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందువల్లే వీటిపై అనేక దేశాలు నిషేధం విధించాయి. సాధారణంగా శతృసైన్యంపై మాత్రమే వీటిని ప్రయోగించాలి. కానీ, ఇవి శతృ సైనికులు ఉన్న ప్రదేశంలోనే కాకుండా చుట్టుపక్కల ఉన్న సామాన్య ప్రజలపైకి కూడా వెళ్లిపోతాయి. పైగా కొంతసేపటి తర్వాత పేలుతాయి. అందువల్ల సామాన్య ప్రజలు వీటికి బలవుతుంటారు. అందులోనూ కొన్ని బాంబులు పేలకుండా ఉండిపోతాయి. ఇవి చాలా కాలం తర్వాత కూడా పేలొచ్చు. యుద్దం ముగిసిన తర్వాత కూడా అలా ఎక్కడో పడిపోయి, మిగిలిపోయిన బాంబులు మళ్లీ పేలుతాయి. కొన్ని సంవత్సరాల తరబడి పేలిపోకుండా కూడా ఉంటాయి. ఈ బాంబు పేలుళ్లలో మరణించిన వారిలో 94 శాతం మంది సామాన్య ప్రజలే ఉన్నారు. అందులో 40 శాతం మంది పిల్లలే. ఈ బాంబుల్లో 10-40 శాతం వరకు పేలకుండా ఉన్నవే.
సైన్యంపైనే దాడులు.. కానీ..
సాధారణంగా యుద్ధంలో సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని మాత్రమే బాంబుల్ని ప్రయోగించాలి. సైనికుల విమానాలు, స్థావరాలు, సైనిక వాహనాలపైనే దాడి చేయాలి. సామాన్యులపై దాడి చేయకూడదు. అది యుద్ధ నేరం కూడా. అయితే, క్లస్టర్ బాంబులతో సామాన్యులకే ప్రమాదం ఎక్కువ. ఈ కారణంగానే 123 దేశాలు వీటిని నిషేధించాయి. అయితే, అందులో అమెరికా, రష్యా, ఉక్రెయిన్ లేకపోవడం గమనార్హం. దీంతో ఈ దేశాలు ఇప్పుడు క్లస్టర్ బాంబులు వాడుతున్నాయి. ఇప్పటికే ఉక్రెయిన్‌పై రష్యా ఈ తరహా బాంబులు ప్రయోగిస్తోందనే విమర్శ ఉంది. అనేక దేశాల అంగీకార ఒప్పందం ప్రకారం.. ఆయా దేశాలు క్లస్టర్ బాంబులు తయారు చేయడం, నిల్వ చేయడం, ప్రయోగించడం చేయకూడదు. అలా చేస్తే యుద్ధ నేరంగా పరిగణించాల్సి వస్తుంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇప్పటివరకు అనేక దేశాలు 30సార్లకుపైగా క్లస్టర్ బాంబుల్ని ప్రయోగించాయి.
అమెరికా బాంబుల ప్రభావం ఎంత..?
అమెరికా చివరిసారిగా 2003-2006 మధ్య కాలంలో ఈ బాంబుల్ని ప్రయోగించింది. 2016 నుంచి వీటిని తగ్గిస్తూ వచ్చింది. కొత్తగా ఉత్పత్తి చేయడం లేదు. సాధారణ పౌరులకు ప్రమాదకరంగా మారినందువల్ల వీటిని పక్కనబెట్టినట్లు 2017లో అమెరికా ప్రకటించింది. అయితే, గతంలో తయారు చేసిన వాటిని ఉక్రెయిన్‌కు ఇచ్చేందుకు అమెరికా సిద్ధమైంది. రష్యాతో యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ వద్ద ఆయుధాలు లేవని, ఆ దేశాన్ని అలా వదిలేయలేమని, అందువల్లే క్లస్టర్ బాంబులు ఇచ్చి అండగా నిలవాలనుకుంటున్నామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. ప్రస్తుతం అమెరికా అందిస్తున్న బాంబులు కూడా ప్రమాదకరమైనవే. ప్రతి క్లస్టర్ బాంబులో 88 బాంబ్లెట్స్ ఉంటాయి. ప్రతి బాంబ్లెట్ పది చదరపు మీటర్ల వరకు ప్రభావం చూపుతుంది. ఒక క్లస్టర్ బాంబ్ 7.5 ఎకరాలు (30 వేల చదరపు మీటర్లు) వరకు ప్రభావం కలిగి ఉంటుంది. ఒక ఆర్మీ వాహనాన్ని పది బాంబ్లెట్స్ ధ్వంసం చేయగలవు.