ఇండియా దగ్గరలోకి వచ్చేసిన మంకీపాక్స్.. ఈ వ్యాధి అంత డేంజరా.. శవాల గుట్టలు చూస్తామా ?
రోనా భయాల నుంచి బయటకు రాకముందే.. ఇప్పుడు ప్రపంచాన్ని మరో మహమ్మారి భయపెడుతోంది. ఆఫ్రికాలో వ్యాపించిన మంకీపాక్స్… ఇప్పుడు భారత్ పొరుగు దేశమైన పాకిస్థాన్‌కు చేరింది. ఇప్పటికే దీనిని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ అత్యయిక స్థితిని ప్రకటించింది. మంకీపాక్స్ వ్యాధిని 1958లో తొలిసారి గుర్తించారు. 1970లో మొదటిసారిగా ఓ మనిషికి ఇది సోకింది. ఆఫ్రికా దేశాల్లోని మారుమూల గ్రామాల్లో మాత్రమే ఎక్కువగా కనిపించేది. దీంతో ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, ఆరోగ్య విభాగాలు దీనిని నిర్లక్ష్యం చేశాయి. తొలిసారి 2022లో భారీస్థాయిలో మంకీపాక్స్ వ్యాపించింది. దీంతో ఉలిక్కిపడిన ప్రపంచ దేశాలు… దీనిపై పరిశోధనలకు నిధులను పెంచాయి. దీంతో గత 60 ఏళ్లలో జరిగిన పరిశోధనల కంటే ఈ రెండు సంవత్సరాల్లో చేసినవే ఎక్కువగా ఉన్నాయి. మంకీపాక్స్ గుర్తింపు, చికిత్స, నివారణకు సంబంధించి వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలని ఆఫ్రికా దేశాల నుంచి పలుమార్లు ప్రపంచ దేశాలకు హెచ్చరికలు వచ్చాయి. 2022-23లో తొలిసారి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మంకీపాక్స్ కేసులు వెలుగు చూశాయి. ప్రస్తుతం మధ్య ఆఫ్రికాలో తీవ్రస్థాయిలో ఈ వ్యాధి వ్యాపిస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ అత్యయిక స్థితిని ప్రకటించింది. మంకీపాక్స్‌లో రెండు వేరియంట్లు ఉన్నాయి. వీటిని క్లాడ్-1 , క్లాడ్-2గా డివైడ్ చేశారు. క్లాడ్ 1 తీవ్రమైన ఆరోగ్య సమస్యలను సృష్టిస్తుంది. న్యూమోనియా, బ్యాక్టిరియల్ ఇన్ఫెక్షన్లు, శ్వాసకోశ సమస్యలు కూడా వస్తాయ్. దీనిలో మరణాల రేటు ఒకటి నుంచి 10శాతం వరకు ఉంది. క్లాడ్ 2 కొంత తక్కువ ప్రమాదకరం. దీనిలో శరీరంపై పొక్కులు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మరణాల రేటు 1 శాతం కంటే తక్కువే. ఐతే వాల్డ్‌వైడ్‌గా క్లాడ్ 1 ఐబీ వేరియంట్ వేగంగా వ్యాపించడమే ఇప్పుడు భయాలు సృష్టిస్తోంది. లైంగిక సంబంధాల కారణంగా ఈ వేరియంట్ వేగంగా వ్యాపిస్తుంది. నేరుగా తాకడం వల్ల మంకీపాక్స్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. నోరు, ఇతర అవయవాల నుంచి వచ్చే స్రవాల వల్ల కూడా సోకే అవకాశం ఉంది. ఈ వైరస్ మనిషి శరీరం లోపలికి ప్రవేశించిన తర్వాత 1 నుంచి 21 రోజుల్లో ఎప్పుడైనా లక్షణాలు బయటపడవచ్చు. పొక్కులు, జ్వరం, గొంతు ఎండిపోవడం, తల, కండరాల నొప్పులు, వెన్ను నొప్పి, నిస్సత్తువ వంటివి ఉంటాయి. ఇవి దాదాపు 2 నుంచి 4 వారాలపాటు కొనసాగవచ్చు. ఇది సదరు వ్యక్తి రోగ నిరోధక శక్తిపై ఆధారపడి ఉంటుంది. మంకీపాక్స్ నివారణకు రెండు టీకాలు వినియోగంలో ఉన్నాయి.