WhatsApp: వాట్సాప్ నమ్మదగ్గ యాప్ కాదా? తాజా వివాదం ఏంటి?
ఇంతకీ వివాదం ఏంటంటే.. వాట్సాప్ వాడకపోయినప్పటికీ మైక్రో ఫోన్ పని చేస్తోంది. అంటే మైక్రోఫోన్ ద్వారా సౌండ్ వాట్సాప్ సర్వర్‌లో రికార్డవుతుంది. దీన్ని వాట్సాప్ సంస్థ వినే అవకాశం ఉంటుంది. ఇది యూజర్ల ప్రైవసీకి భంగం కలిగించడమే. సాధారణంగా యూజర్లు వాట్సాప్ వాడినప్పుడు మాత్రమే మైక్రోఫోన్ పని చేయాలి.
WhatsApp: సోషల్ మెసేజింగ్ యాప్ వాట్పాప్ తాజాగా ప్రైవసీ వివాదంలో ఇరుక్కుంది. ట్విట్టర్‌లో ఒక యూజర్ వెల్లడించిన వివరాల ద్వారా ఈ అంశం వివాదాస్పదమైంది. దీనిపై ట్విట్టర్ సీఈవో ఎలన్ మస్క్ సహా పలువురు నిపుణులు స్పందిస్తున్నారు. చివరకు ప్రభుత్వం కూడా స్పందించింది. ఇంతకీ వివాదం ఏంటంటే.. వాట్సాప్ వాడకపోయినప్పటికీ మైక్రో ఫోన్ పని చేస్తోంది. అంటే మైక్రోఫోన్ ద్వారా సౌండ్ వాట్సాప్ సర్వర్‌లో రికార్డవుతుంది. దీన్ని వాట్సాప్ సంస్థ వినే అవకాశం ఉంటుంది. ఇది యూజర్ల ప్రైవసీకి భంగం కలిగించడమే.
సాధారణంగా యూజర్లు వాట్సాప్ వాడినప్పుడు మాత్రమే మైక్రోఫోన్ పని చేయాలి. అది కూడా కాల్స్ లేదా వాయిస్ మెసేజెస్ వంటివి చేసినప్పుడే. కానీ, పోన్ వాడకపోయినప్పటికీ మైక్రోఫోన్ పని చేస్తున్నట్లు ఫోడ్ డబిరి అనే ఇంజనీర్ గుర్తించాడు. దీనికి సంబంధించిన ఆధారాల్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు. తను రాత్రి నిద్రపోతున్నప్పుడూ కూడా వాట్సాప్ మైక్రోఫోన్ ఆన్‌లో ఉన్నట్లు అతడు గుర్తించాడు. డబిరి చేసిన ట్వీట్ వైరల్ కావడంతో ట్విట్టర్ సీఈవో ఎలన్ మస్క్ కూడా స్పందించాడు. వాట్సాప్ నమ్మదగిన యాప్ కాదని మస్క్ ట్వీట్ చేశాడు. అసలు దేన్నీ నమ్మొద్దని మరో ట్వీట్ కూడా చేశాడు. దీంతో వాట్సాప్ మైక్రోఫోన్ అంశం మరింత ప్రచారమందుకుంది. చివరకు దీనిపై వాట్సాప్ సంస్థ కూడా స్పందించింది. ఈ ప్రచారంలో నిజం లేదని చెప్పింది.
ఈ అంశంపై ఫిర్యాదు చేసిన ఇంజనీర్‌తో టచ్‌లో ఉన్నట్లు వాట్సాప్ చెప్పింది. ఈ యూజర్ వాడుతున్న పిక్సెల్ ఫోన్‌లోని ఆండ్రాయిడ్ ఓఎస్‌లోనే సమస్య ఉండొచ్చని వాట్సాప్ చెప్పింది. ఆండ్రాయిడ్ ఓఎస్‌లోని బగ్ వల్లే అతడి డ్యాష్ బోర్డులో ఇలా తప్పుగా చూపిస్తోందని వాట్సాప్ తెలిపింది. ఈ అంశాన్ని పరిశీలించాల్సిందిగా గూగుల్ సంస్థను కోరినట్లు కూడా వాట్సాప్ వెల్లడించింది. యూజర్లకు తమ మైక్ విషయంలో పూర్తి కంట్రోల్ ఉంటుందని, ఒకసారి పర్మిషన్ ఇచ్చిన తర్వాత వాట్సాప్ వాడుతున్నప్పుడు మాత్రమే మైక్ పని చేస్తుందని వివరించింది. అది కూడా ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఫాలో అవుతున్నామని, వాట్సాప్ ఎవరి మాటలూ వినడం లేదని చెప్పింది. వాట్సాప్ ఎంతగా వివరణ ఇచ్చినప్పటికీ ఈ విషయంలో యూజర్ల నుంచి అనేక సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. వినియోగదారులు తమ ప్రైవసీ గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా స్పందించింది.
తీవ్రంగా స్పందించిన ప్రభుత్వం
వాట్సాప్ ప్రైవసీ వివాదంపై భారత ప్రభుత్వం స్పందించింది. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపింది. కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందిస్తూ.. ‘ప్రైవసీ విషయంలో నిబంధనలు ఉల్లంఘించడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. దీనిపై వెంటనే పరిశీలన జరుపుతాం. ప్రైవసీకి సంబంధించిన నిబంధనలు ఉల్లంఘిస్తే తగిన చర్యలు తీసుకుంటాం. ఇంకా డిజిటల్ పర్సనల్ డాటా ప్రొటెక్షన్ బిల్ అమలుకాకపోయినప్పటికీ చర్యలు తీసుకుంటాం’ అన్నారు. ఇప్పటికే వాట్సాప్ అంతర్జాతీయ ఫేక్ కాల్స్ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ అంశంలోనే వాట్సాప్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ మైక్రోఫోన్ అంశం ఆ కంపెనీని మరిన్ని ఇబ్బందుల్లోకి నెట్టింది. ఇలాంటి వివాదాల మధ్యలో వాట్సాప్ వాడటం ఎంత శ్రేయస్కరం అనే అనుమానం వినియోగదారుల్లో కలుగుతోంది.