అంతరిక్షంలో ఎక్కువ రోజులు ఉన్నది వీళ్ళే.?

అంతరిక్షంలో 9 నెలలు గడిపిన సునీత విలియమ్స్ సహా నలుగురు వ్యోమగాములు.. తిరిగి భూమి మీదకు వచ్చారు. దీనితో అంతరిక్షంలో ఎక్కువ కాలం గడిపిన వారు ఎవరు అనే ఆసక్తి జనాల్లో పెరిగిపోయింది. అమెరికాలోని ఫుట్‌బాల్ మైదానమంత పరిమాణంలో ఉండే… అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో నాసా శాస్త్రవేత్త ఫ్రాంక్ రుబియో ఎక్కువ రోజులు గడిపారు. 371 రోజులు గడిపిన వ్యోమగామిగా ఆయన పేరిట రికార్డు ఉంది.
గతంలో ఈ రికార్డు 355 రోజులుగా ఉండగా.. ఆయన, తన సిబ్బంది తిరిగివచ్చే టైం లో వ్యోమ నౌక కూలెంట్ లీక్ కావడంతో, మార్చి 2023లో అంతరిక్షంలో వారు ఉండే కాలాన్ని కొన్నాళ్ళ పాటు పొడిగించారు. చివరికి ఆయన 2023 అక్టోబర్‌లో తిరిగి వచ్చారు. అంతరిక్షంలో ఆయన అదనంగా ఉన్న రోజులు భూమి చుట్టూ మొత్తం.. 5,963 కక్ష్యలు ఎక్కువగా తిరిగినట్టు నాసా వెల్లడించింది. అంతే కాకుండా 157.4 మిలియన్ మైళ్లు (253.3 మిలియన్ కి.మీలు) ఆయన ప్రయాణం చేసారు.
కాని.. ఆయన కంటే రష్యా శాస్త్రవేత్త… ఎక్కువ కాలం గడిపినట్టు లెక్కలు చెప్తున్నాయి. ఫ్రాంక్ అంతరిక్షంలో ఎక్కువ కాలం గడిపిన అమెరికన్ మాత్రమే. రష్యన్ కాస్మోనాట్ వాలెరి పాలియకోవ్‌తో పోలిస్తే ఫ్రాంక్ రెండు నెలలు తక్కువగానే అంతరిక్షంలో ఉన్నారట. 1990ల్లో మిర్ స్పేస్ స్టేషన్ లో వాలెరి పాలియకోవ్ 437 రోజులు ఉన్నారు. దీనితో ప్రపంచ వ్యాప్తంగా ఈ రికార్డ్ రష్యా పేరిట ఉంది.
2024 సెప్టెంబర్‌లో ఇద్దరు రష్యన్ కాస్మోనాట్స్ ఓలెగ్ కోనోనెంకో, నికోలాయ్ చుబ్‌లు 374 రోజుల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉండి.. భూమి మీదకు వచ్చారు. ఆరు నెలలు పాటు అక్కడే ఉన్న అమెరికా వ్యోమగామి ట్రేసీ డైసన్‌తో కలిసి సోయెజ్ ఎంఎస్-25 స్పేస్‌క్రాఫ్ట్ లో తిరిగి భూమి మీదకు వచ్చారు. ఓలెగ్ కోనోనెంకో ఐదుసార్లు అంతరిక్ష కేంద్రానికి వెళ్ళారు. మొత్తం 1,111 రోజులు అక్కడే ఉన్నారు ఆయన. ఆయన 158 మిలియన్ మైళ్లకు పైగా ప్రయాణం చేసారు. కోనోనెంకో, చుబ్. అంతరిక్ష కేంద్రంలో ఎక్కువగా కాలం గడపడం ద్వారా తక్కువ గురుత్వాకర్షణ శక్తితో వారి శరీరాలు బాగా దెబ్బ తినడంతో రికవరీ టీమ్‌లు వారిని క్యాపుల్స్ నుంచి పైకి ఎత్తుకుని తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది.