WHO: కరోనాను మించిన ముప్పు.. ఎదుర్కొనేందుకు ప్రపంచం సిద్ధం కావాలన్న డబ్ల్యూహెచ్ఓ
కోవిడ్ ముప్పు పూర్తిగా తొలగిపోయినట్లు కాదని, ఇంతకంటే ప్రాణాంతక మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముట్టే అవకాశం ఉందని, దీన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచం సిద్ధంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది.
WHO: మూడేళ్ల క్రితం కోవిడ్ సృష్టించిన విపత్తును ఎవరూ మర్చిపోలేరు. కోవిడ్ నుంచి ప్రపంచం నెమ్మదిగా కోలుకుంది. అయినప్పటికీ కోవిడ్ ముప్పు పూర్తిగా తొలగిపోయినట్లు కాదు. ఇంతకంటే ప్రాణాంతక మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముట్టే అవకాశం ఉందని, దీన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచం సిద్ధంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది.
కరోనా/కోవిడ్-19 ప్రపంచానికి చేసిన చేటు అంతా.. ఇంతా కాదు.
మూడేళ్లలో అధికారికంగా ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల మందికిపైగా కోవిడ్ బారిన పడి మరణించారు. అనధికారికంగా అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువ మందే మరణించి ఉంటుందని అంచనా. ఆర్థికంగానూ ప్రపంచ దేశాల్ని కరోనా దెబ్బతీసింది. దీంతో అనేక దేశాల్లో ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి ప్రపంచం కోలుకుంటోంది. కోవిడ్ వల్ల ప్రస్తుతం అత్యవసర పరిస్థితి లేనప్పటికీ, దీని ప్రభావం పూర్తిగా ముగిసిపోయినట్లు కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. జెనీవాలో జరిగిన 76వ అంతర్జాతీయ ఆరోగ్య సమావేశాల సందర్భంగా ఈ విషయాల్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధినేత టెడ్రోస్ అధనోమ్ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ మరోసారి కరోనా తీవ్రంగా వ్యాపించేందుకు కారణమయ్యే వేరియెంట్ రావొచ్చన్నారు.
“మరో ప్రమాదకర కరోనా వేరియెంట్ రావొచ్చు. మరణాలు కూడా సంభవించవచ్చు. ప్రాణాంతక వైరస్ అంటుకునే అవకాశం ఉంది. ప్రపంచానికి ఇలాంటి మరిన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మరో కరోనా మహమ్మారి వ్యాప్తి ప్రారంభమైన వెంటనే అందరూ కలిసి సమష్టిగా, నిర్ణయాత్మకంగా ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు సిద్ధంగా ఉండాలి” అని టెడ్రోస్ అన్నారు. భవిష్యత్తులో రాబోయే వైరస్‌ను ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలపై చర్చించేందుకు, ప్రణాళికలు రూపొందించేందుకు ఇదే సరైన సమయం అని ఆయన అన్నారు. ప్రస్తుతం ప్రపంచానికి తొమ్మిది రకాల వ్యాధులు ప్రాణాంతకంగా మారాయని, వాటికి సరైన చికిత్స లేకపోవడం లేదా ఈ వైరస్‌ను ఎదుర్కొనే సరైన సామర్ధ్యం లేకపోవడమే దీనికి కారణమని ఆయన చెప్పారు. 2030 లక్ష్యంగా ఇలాంటి వైరస్‌లను ఎదుర్కొనేలా పని చేయాలని సూచించారు.