Tomato Prices: హమ్మయ్య.. నెమ్మదిగా దిగొస్తున్న టమాటా ధరలు..!
జూన్ చివరి నుంచి జులై నెల మొత్తం టమాటా ధరలు సామాన్యుల్ని వణికించాయి. తెలుగు రాష్ట్రాలు అనే కాదు.. ఇండియా మొత్తం ఇదే పరిస్థితి నెలకొంది. చాలా చోట్ల టమాటాలు కేజీ రూ.150 నుంచి రూ.200 వరకు ధర పలికితే.. ఇంకొన్ని చోట్ల రూ.250 వరకు చేరుకున్నాయి.
Tomato Prices: పెరుగుతున్న టమాటా ధరల నుంచి సామాన్యుడికి కాస్త ఉపశమనం లభించనుంది. నాలుగైదు రోజులుగా కొన్ని చోట్ల టమటా ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో చాలా మంది మళ్లీ టమాటా రుచి చూసేందుకు సిద్ధమవుతున్నారు.
రెండు నెలలుగా భారంగా మారిన టమాటా ధరలు ఇప్పుడిప్పుడే తగ్గుతున్నాయి. మార్కెట్లో టమాటా లభ్యత కాస్త పెరగడంతో ధరలు నెమ్మదిగా దిగొస్తున్నాయి. గత వారం వరకు కేజీ రూ.150 నుంచి రూ.200 వరకు ధర పలికిన టమాటాలు ఇప్పుడు రూ.100 లోపే దొరుకుతున్నాయి. చాలా చోట్ల టమాటాలు కేజీ రూ.80 నుంచి రూ.100 వరకు మాత్రమే ధర పలుకుతున్నాయి. ధరలు తగ్గుతుండటంపై సామాన్యులు హర్షం వ్యక్తం చేస్తుంటే.. రైతులు ఆందోళన చెందుతున్నారు. ధరల పెరుగుదలతో లాభాలు చవిచూసిన రైతులు.. మళ్లీ ధరల తగ్గుదలతో నష్టాలబాట పట్టాల్సి వస్తుందేమోనని ఆందోళన పడుతున్నారు.
జూన్ చివరి నుంచి జులై నెల మొత్తం టమాటా ధరలు సామాన్యుల్ని వణికించాయి. తెలుగు రాష్ట్రాలు అనే కాదు.. ఇండియా మొత్తం ఇదే పరిస్థితి నెలకొంది. చాలా చోట్ల టమాటాలు కేజీ రూ.150 నుంచి రూ.200 వరకు ధర పలికితే.. ఇంకొన్ని చోట్ల రూ.250 వరకు చేరుకున్నాయి. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు టమాటాలు కొనడమే మానేశారు. గత సీజన్‌లో అకాల వర్షాలు, వాతావరణ మార్పుల కారణంగా టమాటా దిగుబడి తగ్గింది. పైగా ఇటీవలి వర్షాలకు టమాటా పంట నాశనం అయింది. ఈ కారణంగా టమాటాల లభ్యత అట్టడుగుస్థాయికి పడిపోయింది. దీంతో వీటి ధరలకు రెక్కలొచ్చాయి. చివరకు ప్రభుత్వాలే కొన్నిచోట్ల స్పెషల్ కౌంటర్లు ఏర్పాటు చేసి, తక్కువ ధరలో టమాటాలు ఇవ్వాల్సి వచ్చింది. ధరల పెరుగుదల వల్ల సామాన్యులు ఇబ్బందులు పడితే.. కొందరు రైతులు మాత్రం పండుగ చేసుకున్నారు. తమ జీవితంలో ఎప్పుడూ చూడనన్ని లాభాలు అందుకున్నారు. కొందరు కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. చాలా మంది రైతులు లక్షల్లో అర్జించారు. టమాటాల కోసం కొన్ని చోట్ల దొంగతనాలు, దోపిడీలు కూడా జరిగాయి. అంతటి చర్చకు కారణమైన వీటి ధరలు ఇప్పుడు దిగొస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో టమాటాల సరఫరా పెరుగుతుందని, దీంతో మార్కెట్లో ఇంకా ధరలు తగ్గుతాయని వ్యాపారులు అంటున్నారు.
ఉల్లి ధరలు పైపైకి
టమాటా ధరలు దిగొస్తుంటే.. ఉల్లి ధరలు పైకి ఎగబాకుతున్నాయి. ఈ నెలఖారులోపు ఉల్లి సరఫరా తగ్గుతుంది. ఆ తర్వాత సెప్టెంబర్, అక్టోబర్‌లో విపరీతంగా ఉల్లి ధర పెరుగుతుందని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. వీటితోపాటు ఇతర కూరగాయల ధరలు కూడా పెరుగుతున్నాయి. టమాటా ధరలు తగ్గినప్పటికీ మిగతా వాటి విషయంలో కాస్త ఖర్చు పెట్టక తప్పదు.