Chinese Graduates: డిగ్రీలా… చిత్తు కాగితాలా…! చైనా యూత్ ఆ ఫోటోలనే ఎందుకు షేర్ చేస్తోంది…?

డిగ్రీ పట్టా తీసుకున్న వ్యక్తికి మంచి ఉద్యోగం వచ్చి జీవితంలో స్థిరపడితే అంతకంటే ఏం కావాలి. కానీ చైనాలో ఎంత ఉన్నత విద్యను అభ్యసించినా... సరైన ఉద్యోగమే లభించడం లేదు. గతానికి భిన్నంగా చైనా యూత్ యూనివర్శిటీ ఎడ్యుకేషన్‌పై ఎక్కువగా దృష్టిపెట్టింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 26, 2023 | 12:03 PMLast Updated on: Jun 26, 2023 | 12:03 PM

Why Chinese Students Are Taking Graduation Photos Looking More Dead Than Alive

సాధారణంగా యూనివర్శిటీల్లో గ్రాడ్యుయేషన్ సెర్మనీ అంటే స్టూడెంట్స్ ఎగిరి గంతేస్తారు..! నల్లకోటు… నల్లటోపీ ధరించి పట్టా తీసుకునే సందర్భం కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తారు. ఉన్నత విద్యను పూర్తి చేసుకుని పట్టాలు తీసుకుని తమకు ఇష్టమైన కెరీర్‌ను మొదలు పెట్టడానికి అడుగు దూరంలో ఉన్నామన్న ఆనందం వాళ్ల కళ్లల్లో కనిపిస్తుంది. ఇక గ్రాడ్యుయేషన్ సెర్మనీ రోజు స్టూడెంట్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఉన్నత విద్యావంతులుగా మారేందుకు నిద్రాహారాలు మారి.. కొన్నేళ్ల పాటు వాళ్లు పడిన కష్టమంతా పట్టా పుట్టుకునే రోజు మర్చిపోతారు. టోపీలు పైకి ఎగరేస్తూ స్టూడెంట్స్ దిగే సెల్ఫీలు వాళ్ల జాయ్‌ఫుల్‌నెస్‌కు అద్దం పడతాయ్. చైనాలో కూడా అనేక యూనివర్శిటీలు, కాలేజీల్లో గ్రాడ్యుయేషన్ సెర్మనీలు జరుగుతున్నాయి. వేలాది మంది విద్యార్థులు తమ హైయ్యర్ ఎడ్యుకేషన్‌ను పూర్తి చేసుకుని పట్టాలు పొందుతున్నారు. అయితే మిగతా దేశాల్లో లాగా చైనా విద్యార్థుల్లో జోష్ కనిపించడం లేదు.. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యింది.. ఇక ఉద్యోగ బాధ్యతలు చేపట్టబోతున్నామన్నా ఆనందం ఒక్కరిలోనూ కనిపించడం లేదు. పట్టాలు పొందేటప్పుడు వాళ్లలో ఉత్సాహం ఇసుమంతైనా కనిపించడం లేదు.
చైనా స్టూడెంట్స్ ఫోటోలు ఎందుకిలా దిగుతున్నారు ?


ఒక్కసారి ఈ ఫోటోలను నిశితంగా గమనించండి. వీళ్లంతా డ్రామా ఆర్టిస్టులు కారు.. సరదాగా కోసం ఇలా ఫోటోలు దిగడం లేదు. మేమంతా బతికున్న శవాలతో సమానం అన్న అర్థం వచ్చేలా ఈ ఫోటోలు ఉన్నాయి. డిగ్రీ పట్టాలు తీసుకుని… ఆ పట్టాలతోనే ఇలా ఒక్కొక్కరు ఒక్కో ఫోజులో ఫోటో దిగారు. పార్క్ లో బెంచ్‌పై చచ్చిన శవంలా ఒకరు ఫోటో దిగితే… యూనివర్సిటీ మెట్లపై బోర్లా పడుకుని మరొకరు ఫోటో దిగారు. మరో యువతి అయితే తాను పొందిన డిగ్రీ పట్టాను చేత్తో పట్టుకుని డస్ట్ బిన్‌లో కూర్చుంది. మరో స్టూడెంట్ నడిరోడ్డుపై పడుకుని ముఖానికి గ్రాడ్యుయేషన్ టోపీ అడ్డంపెట్టుకుని కనిపించారు. మరో అమ్మాయైతే.. నేరుగా తాను తీసుకున్న డిగ్రీ పట్టాను డస్ట్ బిన్‌లో వేస్తూ ఫోటో దిగింది.. ఒకటి కాదు..రెండు కాదు.. గత కొంతకాలంగా చైనా సోషల్ మీడియాలో ఈ తరహా ఫోటోలు వైరల్‌గా మారుతున్నాయి. చైనా వ్యాప్తంగా ఏ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ సెర్మనీ జరిగినా…వెంటనే సోషల్ మీడియాలో ఈ తరహా ఫోటోలే ప్రత్యక్షమవుతున్నాయి.
చైనా విద్యార్థులు ఎందుకు డీలా పడిపోయారు ?
డిగ్రీ పట్టా తీసుకున్న వ్యక్తికి మంచి ఉద్యోగం వచ్చి జీవితంలో స్థిరపడితే అంతకంటే ఏం కావాలి. కానీ చైనాలో ఎంత ఉన్నత విద్యను అభ్యసించినా… సరైన ఉద్యోగమే లభించడం లేదు. గతానికి భిన్నంగా చైనా యూత్ యూనివర్శిటీ ఎడ్యుకేషన్‌పై ఎక్కువగా దృష్టిపెట్టింది. పోటీ ప్రపంచంలో మంచి ఉద్యోగం కావాలంటే యూనివర్సిటీ డిగ్రీ పక్కా అని గ్రహించిన చైనా యూత్ గతానికి భిన్నంగా… విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్ల కోసం క్యూ కట్టడం మొదలుపెట్టారు. 2012-22 మధ్యలో యూనివర్శిటీ ఎన్‌రోల్‌మెంట్ రేటు…దాదాపు 60 శాతానికి పెరిగింది. దీని కారణంగా ప్రతియేటా లక్షలాది మంది గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని జాబ్ మార్కెట్‌లోకి అడుగుపెడుతుంటే… వాళ్లలో ఉద్యోగాలు దొరికేది వందల మందికి మాత్రమే. చైనా బయట ప్రపంచానికి సూపర్ ఎకనమిక్ పవర్‌గా కనిపించినా… ఆదేశాన్ని నిరుద్యోగ సమస్య తీవ్రంగా వెంటాడుతుంది. ఈ సమ్మర్ సీజన్‌లోనే 11.6 మిలయన్ల కాలేజీ విద్యార్థులు చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాల వేట మొదలుపెట్టారు. అయితే అర్బన్ యూత్ అన్‌ఎంప్లాయిమెంట్ తీవ్రంగా ఉండటం కారణంగా వీళ్లకు ఉద్యోగాలు దొరకడం లేదు. ప్రస్తుతం అర్బన్ ఏరియాల్లో నిరుద్యోగ శాతం 20కి పైగానే ఉంది. చైనా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగా ప్రైవేటు సెక్టార్‌పై కూడా నిత్యం వేధింపుల కత్తి వేలాడుతోంది. దీంతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న ప్రైవేటు సంస్థలు చైనాలో తమ మార్కెట్‌ను విస్తరించుకోవడానికి అస్సలు ఇష్టపడటం లేదు. దీంతో నిరుద్యోగ సమస్య పెరిగిపోతోంది. సాధారణ డిగ్రీలు చదివితే ఉద్యోగాలు రావడం లేదు అనుకుంటే ఓ అర్థం ఉంది. కానీ పీహెచ్‌డీ చదివిన వాళ్లకు కూడా చైనాలో ఉద్యోగాలు రావడం లేదు. గడిచిన దశాబ్దాల్లో ఎప్పుడూ లేని విధంగా చైనా యూత్ ఎడ్యుకేటర్స్ గా మారుతున్నారు. కాలేజీలు, ఒకేషనల్ స్కూల్స్ నుంచి పట్టాలు పొందేవారి సంఖ్య గతంలో పోల్చుకుంటే గడిచిన కొన్నేళ్లుగా పెరిగిపోయింది. వీళ్లందరికీ ఉద్యోగాలు చూపించే స్థాయిలో చైనా జాబ్ మార్కెట్ ప్రస్తుతం లేదు. దీంతో డిగ్రీలు సాధించినా.. ఉపాధి అవకాశాలు లేక యూత్ మొత్తం డీలా పడిపోతోంది. మార్కెట్ లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఉద్యోగాలకు.. విద్యార్థులు చదువుకున్న చదువులకు కూడా వ్యత్యాసం ఉండటంతో స్కిల్డ్ మ్యాన్ పవర్ లేక చాలా మంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు.
చైనాలో ఎందుకు ఈ పరిస్థితి దాపురించింది ?
ఒక్క చైనాలోనే కాదు.. అనేక దేశాల్లో ఈ పరిస్థితి ఉంది. కాకపోతే చైనాలో మిగతా వాటితో పోల్చితే ఎక్కువగా ఉంది. గ్రాడ్యుయేట్స్ నిరసన రూపంలో అది బయట ప్రపంచానికి తెలుస్తోంది. యూరోపియన్ దేశాల్లో కూడా నిరుద్యోగ శాతం గతంతో పోల్చితే ఎక్కువగా ఉంది. యూత్‌కు ఉపాధి కల్పించే విషయంలో చైనా భిన్నమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది. చైనా ఆర్థిక వ్యవస్థకు ఒకరంగా యూత్ పునాదులు లాంటి వాళ్లు. ఉద్యోగాలు చేస్తూ ఎకానమీకి వినియోగదారులుగా మారినప్పుడు మాత్రమే చైనా ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. ఏదేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండాలన్నా.. ప్రజల కొనుగోలు శక్తి బలంగా ఉండాలి. చైనా యూత్‌ను బిగ్ స్పెండర్స్‌గా చెప్పుకోవచ్చు. రెంట్ నుంచి ట్రాన్స్‌ పోర్టు వరకు, కమ్యూనికేషన్స్ నుంచి కల్చర్ వరకు వివిధ అవసరాల కోసం వాళ్లు చేసే ఖర్చులు ఆర్థిక వ్యవస్థకు అండగా ఉంటాయి. అయితే ఇదంతా వాళ్లు సంపాదనాపరులైతేనే సాధ్యమవుతుంది. అన్ని అర్హతలు ఉన్నా.. నిరుద్యోగులుగా మిగిలిపోతున్న యూత్..ఇప్పుడు ఖర్చులు పెట్టే పొజిషన్‌లో లేదు. కొన్ని దశాబ్దాలుగా చైనా అనుసరిస్తూ వచ్చిన విధానాలే ఈ పరిస్థితికి కారణంగా కనిపిస్తున్నాయి. వన్ చైల్డ్ పాలసీని అమలు చేయడం వల్ల చైనా జనాభా గణనీయంగా తగ్గిపోయింది. దానికి తోడు వృద్ధతరం పెరిగిపోయింది. కోవిడ్ టైమ్‌లో చైనా విధించిన ఆంక్షల కారణంగా.. ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిపోయింది. ఓవైపు నిరుద్యోగ శాతం పెరుగుతుంటే.. కొత్తగా యూనివర్శిటీల నుంచి పట్టాలు పట్టుకుని వచ్చేవాళ్లు జీవితాన్ని ఎలా ప్రారంభించాలో అర్థంకాని దుస్థితిలో ఉన్నారు. ఒకరంగా చెప్పాలంటే చైనా యూత్ మొత్తం తీవ్రమైన ఫ్రస్టేషన్‌లో ఉంది. అందుకే ఈ డిగ్రీ పట్టాలు.. కాన్వకేషన్లు ఎందుకు.. నాలుక గీసుకోవడానికా అన్నట్టు తమ అసంతృప్తిని సోషల్ మీడియాలో వెళ్లగక్కుతున్నారు. దేశానికి చోదకశక్తిగా మారి ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించాల్సిన యువత సేవలను వినియోగించుకోవడంలో జిన్‌పింగ్ ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోంది.