China: జిన్‌పింగ్ చేతికి కొత్త అస్త్రం.. ! అమెరికా ఆంక్షలను ఎదుర్కొనేందుకు డ్రాగన్ గుణపం
యుద్ధం చేయాలంటే ఆయుధాలే అవసరం లేదు..యుద్ధ విమానాలను రంగంలోకి దింపాల్సిన అవసరం లేదు. పదునైన చట్టాలు ఉంటే ప్రత్యర్థి దేశాలపై వాటినే ఆయుధాలుగా ప్రయోగించి యుద్ధం చేయవచ్చు. రెండు శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థలుగా ప్రపంచాన్ని శాసిస్తున్న అమెరికా చైనా మధ్య ప్రస్తుతం ఇలాంటి యుద్ధమే సాగుతోంది.
ప్రస్తుతం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనా..నెంబర్ వన్ స్థానానికి ఎదిగి అమెరికాకు సవాల్ విసరాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది. అటు అమెరికా కూడా చైనా ఆర్థికంగా బలపడకుండా ఉండేందుకు వివిధ రకాల ఆంక్షల అస్త్రాలను డ్రాగన్ దేశంపై ప్రయోగిస్తోంది. అమెరికా వ్యూహాలు అమెరికాకు ఉంటే..సూపర్ పవర్‌గా మారడానికి చైనా వ్యూహాలు చైనాకున్నాయి. తమ ఎదుగుదలను అడ్డుకునేందుకు ఇతర దేశాలు ఆంక్షల అస్త్రాలను ప్రయోగిస్తే..వాటిని ఎదుర్కొనేందుకు చైనా కొత్త వెపన్స్ తో ముందుకొచ్చింది. విదేశాంగ విధానానికి పదును పెట్టి కొత్త చట్టాన్ని రూపొందించిన చైనా అమెరికాతో పాటు పశ్చిమ దేశాలకు ఈ చట్టంతోనే సమాధానం చెప్పాలని భావిస్తోంది.
చైనా తెచ్చిన కొత్త చట్టంలో ఏముంది ?
చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా చైనా అత్యంత సమర్థవంతమైన విదేశాంగ చట్టాన్ని రూపొందించింది. అమెరికా సహా ఇతర దేశాలు చైనాతో అనుసరిస్తున్న విధానాలకు తగ్గట్టుగా.. చైనా కఠినమైన నిర్ణయాలను అమలు చేసేలా ఈ చట్టంతో అవకాశం కల్పించారు. విదేశీ వ్యవహారాలకు సంబంధించి చైనా ప్రభుత్వం ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న అన్ని రకాల సవాళ్లకు ఈ చట్టం సమాధానం చెప్పేలా ఉంటుంది. చైనా అంతర్గత వ్యవహారాల్లో ఇతర దేశాలు తలదూర్చడం మొదలు..ఆంక్షల పేరుతో పశ్చిమ దేశాలు విధించే ఆర్థిక నిర్భందాల వరకు ప్రతి అంశానికి గట్టి సమాధానం చెప్పేలా ఈ చట్టం ఉండబోతోందని చైనా కమ్యూనిస్టు పార్టీ అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ ప్రకటించింది. నేషనల్ సెక్యూరిటీకి విఘాతం కల్గించేలా చైనా ప్రజలు వ్యవహరించినా.. ఇతర దేశాలు , ఆ దేశాలకు సంబంధంచిన సంస్థలతో చేతులు కలిపినా..తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ చట్టం హెచ్చరిస్తోంది.
ఎకానమీ వార్ చేస్తున్నదెవరు ?
సూపర్ పవర్‌గా ఎదిగే క్రమంలో బలమైన ఆర్థిక వ్యవస్థల మధ్య కచ్చితంగా పోటీ ఉంటుంది. చైనా అమెరికా మధ్య కూడా కొన్నేళ్ల క్రితం వరకు ఈ తరహా ఆరోగ్యకరమైన పోటీనే ఉండేది. కానీ డొనాల్డ్ ట్రంప్ హయాంలో రెండు దేశాల మధ్య ట్రేడ్ రిలేషన్స్ దారుణంగా దెబ్బతిన్నాయి. అమెరికా డాలర్‌ను దెబ్బతీసేలా చైనా వాణిజ్య విధానాలను అమలు చేస్తోందని అగ్రరాజ్యం ఆరోపించడం మొదలు పెట్టింది. చైనా నుంచి దిగుమతి చేసుకునే కీలకమైన వస్తువులపైనా నిషేధం విధిచింది. ఐదేళ్ల నుంచి కొనసాగుతున్న ట్రేడ్ వార్ రెండు దేశాల సంబంధాలను పాతాళానికి తీసుకెళ్లాయి. చైనా ఉత్పత్తులపై నిషేధం విధించడం, చైనాలో వ్యాపారం చేస్తున్న అమెరికన్ కంపెనీలను తమ దారికి తెచ్చుకోవడం వంటి చర్యలు డ్రాగన్ కు ఆగ్రహం తెప్పించాయి. వాణిజ్య విధానాల విషయంలో రెండు దేశాలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ యుద్ధక్షేత్రంలో దిగకుండానే కొన్నేళ్లుగా యుద్ధం చేస్తున్నాయి. రెండు దేశాల ఆంక్షల వలయంలో చిక్కుకున్న సెమీ కండక్టర్ల పరిశ్రమ భారత్ లాంటి ఎన్నో దేశాలకు సవాళ్లను విసిరిసింది. ఉక్రెయన్ పై సాగుతున్న దురాక్రమణలో రష్యాకు చైనా సహకరిస్తోందని నమ్ముతున్న అగ్రరాజ్యం ఆదేశంపై వరుస పెట్టి ఆంక్షలు విధించడం మొదలు పెట్టింది. ఇంకో వైపు చైనా తమ దేశంపై గూఢచర్యం చేస్తుందన్న అనుమానాలు పెంచుకున్న అమెరికా.. ఆ దేశానికి చెందిన ఎన్నో కంపెనీలను బ్లాక్ లిస్టులో పెట్టింది. అమరికా సహా పశ్చిమ దేశాలన్నీ కలిసి తమ దేశ ఎదుగుదలను అడ్డుకునేందుకే ఆంక్షల అస్త్రాలను ప్రయోగిస్తున్నాయని చైనా వాదిస్తోంది. అమెరికా కోరుకున్నట్టు, అమెరికాకు నచ్చినట్టు తమ విదేశాంగ విధానం ఉండబోదని..తమ దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే ఎలాంటి చర్యలను సహించబోమని హెచ్చరిస్తోంది.
కొత్త చట్టంతో జిన్‌పింగ్ ఏం చేయబోతున్నారు ?
చైనాతో పేచీ ఉన్న దేశాలు, సంస్థలు భారత్‌ను ప్రత్యామ్నాయంగా చూస్తున్నాయి. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న ట్రేడ్ వార్ తో పాటు రోజురోజుకి పెరుగుతున్న ఆంక్షలు యాపిల్, టెస్లా లాంటి సంస్థలను భారత్ వైపు ఆకర్షిస్తున్నాయి. మనదేశంతో నిత్యం కయ్యానికి కాలుదువ్వే చైనాకు ఈ పరిణామాలు సహజంగానే రుచించడం లేదు. అందుకే తమ దేశంపై ఆర్థిక ఆంక్షలు విధిస్తున్న దేశాలతో కఠినంగా ఉండాలని జిన్‌పింగ్ భావిస్తున్నారు. తమ విధానాలను ప్రశ్నించినందుకు జాక్ మా లాంటి వాళ్లకు కూడా చుక్కలు చూపించిన చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం తమ దారికి అడ్డొచ్చే వాళ్లు ఎవరైనా సరే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనంటోంది. ఆర్థిక ఆంక్షల నుంచి గూఢచర్యం వరకు ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడినా.. సహించబోమని హెచ్చరిస్తున్నారు జిన్‌పింగ్. అమెరికా సహా ఏ దేశమైనా అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలని.. వాటిని ఏ దేశం తుంగలో తొక్కినా ఆయా దేశాలపై దౌత్య యుద్ధం చేసేలా ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. దీంతో రానున్న కాలంలో అమెరికా విషయంలో జిన్‌పింగ్ మరింత కఠినంగా వ్యవహరించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
అమెరికా రియాక్షన్ ఏంటి ?
పశ్చిమ దేశాలు తమను అణగదొక్కేందుకు కుట్రలు చేస్తున్నాయని చైనా ఆరోపిస్తుంటే.. అమెరికా కూడా అంతే ఘాటుగా ప్రతిస్పందిస్తోంది. తమ దేశం రూపొందించిన సాంకేతిక రహస్యాలను చైనా దొంగింలించిందని.. ఆరోపిస్తోంది. చైనాకు వార్నింగ్ ఇస్తూ ఈమధ్యే అధ్యక్షుడు బైడెన్ కొన్ని కొత్త ఆంక్షలను కూడా విధించారు. అత్యాధునిక మైక్రో చిప్‌లు, వాటికి సంబంధించిన ఇతర వస్తువులను కొనడానికి వీలు లేకుండా చైనా కంపెనీలపై బ్యాన్ విధించింది.
ట్రేడ్ వార్ మరింత తీవ్రంగా కాబోతోందా ?
కొత్త చట్టం ద్వారా అమల్లోకి వచ్చిన విదేశాంగ విధానం పశ్చిమ దేశాలకు, చైనాకు మధ్య అగాధాన్ని పెద్దది చేయబోతోంది. ఉక్రెయన్‌తో జరుగుతున్న యుద్ధం విషయంలో రష్యాకు చైనా పూర్తి స్థాయి మద్దతివ్వడం కూడా దేశాల మధ్య సంబంధాలను మరింత జఠిలం చేయబోతున్నాయి. జిన్ పింగ్ చేతిలో ఉన్న కొత్త అస్త్రం అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశముందన్నది విశ్లేషకుల మాట.