అంతరిక్ష కేంద్రం కూలిపోతుందా…? ఎక్కడ పడుతుంది..?
భారత సంతతి అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్ సహా నలుగురు వ్యోగాములు తొమ్మిది నెలల పాటు గడిపిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్) గడువు ముగిసిందా...?

భారత సంతతి అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్ సహా నలుగురు వ్యోగాములు తొమ్మిది నెలల పాటు గడిపిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్) గడువు ముగిసిందా…? అది ఎప్పుడు భూమి మీద పడిపోతుంది…? ఇప్పుడు ఈ ప్రశ్నలు నెటిజన్లను ఆలోచనలో పడేస్తున్నాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం 2031లో తన మిషన్‌ను ముగించనున్నట్టు నాసా వెల్లడించింది. 1998లో ఐఎస్‌ఎస్ ప్రారంభమైన ఈ స్టేషన్… కూలితే ఎక్కడ కూలిపోతుంది…? ఇప్పుడు ఇదే చాలా మందిలో ఉన్న ఆందోళన.
భూమి నుంచి దాదాపు 400-415 కి.మీ ఎత్తులో ఉన్న ఈ అంతరిక్ష కేంద్రం పొడవు 109 మీటర్లు. అంటే ఒక ఫుట్‌బాల్ మైదానం ఎంత ఉంటుందో.. అంత పరిమాణంలో ఇది ఉంటుంది. దీని బరువు 4 లక్షల కిలోలట. అంటే దాదాపు 80 ఆఫ్రికన్ ఏనుగుల బరువుతో సమానం. 40కి పైగా జరిగిన అంతరిక్ష కార్యక్రమాలు భూమి నుంచి తీసుకువెళ్లిన వస్తువులతో ఈ స్టేషన్ ను ఏర్పాటు చేసారు. ఈ స్పేస్ స్టేషన్… గంటకు 17,500 మైళ్ల వేగంతో అంతరిక్షంలో భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ప్రతి 90 నిమిషాలకు ఒకసారి భూమి చుట్టూ తిరుగుతుంది. అంటే 24 గంటల్లో 16 సార్లు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది.
ఇంత వేగంగా తిరిగే ఈ భారీ నిర్మాణం భూమి మీద పడితే.. మనుషులకు ఇబ్బందే. అందుకే నాసా ఒక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని 2031లో మూసేయాలనే నిర్ణయించారు. ఆ సమయానికి ఈ అంతరిక్ష కేంద్రం కాల పరిమితి ముగిసిపోతుంది. దీనిని 1998లో రష్యా, అమెరికా, కెనడా, జపాన్, ఇతర యూరప్ దేశాలు కలిసి నిర్మించాయి. ఆ తర్వాత ఎన్నో మెరుగులు దిద్దిన శాస్త్రవేత్తలు… ముందు 15 ఏళ్ల పాటు మాత్రమే పని చేసే విధంగా తయారు చేసారు. కానీ శాస్త్రీయ పరిశోధనల్లో, అంతరిక్ష పరిశ్రమలో అంతర్జాతీయ సహకారం వంటి అంశాల్లో ఐఎస్‌ఎస్ సాధించిన నిరంతర విజయాల కారణంగా అనేకసార్లు దీన్ని అక్కడే ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. డీకమిషనింగ్ వ్యవధిని పొడిగిస్తూ వచ్చారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ స్పేస్ స్టేషన్ పదవి కాలాన్ని… 2021లో 2030 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతరిక్ష కేంద్రానికి సంబంధించి 2021లోనే రష్యా ఓ వార్నింగ్ ఇచ్చింది. హార్డ్ వేర్, సామగ్రి కారణంగా అంతరిక్ష కేంద్రంలో రిపేర్ చేయలేని సమస్యలు వచ్చాయని.. అది ఇబ్బందికరమని హెచ్చరించింది. అంతరిక్ష కేంద్రంలోని రష్యా భాగానికి చెందిన 80 శాతం ఇన్‌స్ట్రుమెంటేషన్ వ్యవస్థల గడువు ముగిసిందని రష్యా మాజీ కాస్మోనాట్ వ్లాదిమిర్ సోలోవ్యోవ్ వెల్లడించారు. వాటిల్లో చిన్న చీలికలు కూడా కనిపిస్తున్నాయి. అవి రోజు రోజుకు పెద్దగా మారే అవకాశం కూడా ఉండవచ్చు. అయితే దీనిపై స్పేస్ ఎక్స్ అధినేత.. ఎలాన్ మస్క్.. 2030 వరకు స్పేస్ స్టేషన్ కు గడువు ఇవ్వవద్దని… రెండేళ్లలోపు దాన్ని మూసేస్తే మంచిది అని ఒక ట్వీట్ చేసారు. ట్రంప్ నిర్ణయం తీసుకోవాలని కోరారు.
ఇక భూభ్రమణ సమయంలో కాలానుగుణంగా దాని కక్ష్య, అట్మాస్పిరిక్ డ్రాగ్ ద్వారా ప్రభావితమై.. సూర్యుడి ప్రభావం కారణంగా ఒకటి లేదా రెండేళ్లలో తన కక్ష్య నుంచి పూర్తిగా వైదొలిగి భూమి మీద పడిపోయే అవకాశం ఉంది. ఇది ప్రమాదం కాబట్టి… అంతరిక్ష కేంద్రాన్ని కార్యాచరణలో ఉంచే ‘రీ బూస్ట్’ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఇక ఐఎస్‌ఎస్‌ను మూసివేసే పని త్వరలో మొదలుపెడతామని చెప్పింది. ఇందులో భాగంగా, తొలి దశలో అట్మాస్పిరిక్ డ్రాగ్ ప్రభావంతో ఐఎస్ఎస్ తనంతట తాను ధ్వంసం అయ్యే విధంగా చేస్తారు. అంటే రీబూస్ట్ ప్రక్రియను తగ్గిస్తూ వెళ్తారు.
ఇక ఐఎస్‌ఎస్ వేగాన్ని తగ్గించే ప్రక్రియ సైతం ప్రారంభమవుతుంది. ఇందుకోసం అంతరిక్ష నౌక, అంతరిక్ష స్టేషన్‌లో ఉన్న ప్రోగ్రెస్ వంటి ఇతర ప్రొపల్షన్ మాడ్యూళ్లను ఉపయోగిస్తుంది నాసా. అనవసరమైన మాడ్యూళ్లను వేరు చేసి ఒక్కొక్కటిగా కక్ష్య నుంచి తప్పిస్తారు. ఈ వ్యవధిలో 2026-2030 వరకు స్పేస్ స్టేషన్ ఎత్తు ఎత్తు 415 కి. మీ నుంచి క్రమంగా 280 కి.మీ వరకు తగ్గనుంది. ఒక ప్రత్యేక అంతరిక్ష నౌక సహాయంతో దాని దూరాన్ని 120 కి.మీ వరకు తగ్గించడానికి చివరి బూస్ట్ అందిస్తుంది నాసా. అనుకున్నట్లుగా ఈ ప్రయత్నం సక్సెస్ అయితే… స్పేస్ స్టేషన్ భూమికి 120 కి.మీ ఎత్తుకు సమీపిస్తుందని నాసా భావిస్తోంది.
ఐఎస్‌ఎస్ 120 కి.మీ వరకు చేరుకుంటే, గంటకు 29,000 కి.మీల భయంకరమైన వేగంతో భూ వాతావరణాన్ని ఢీకొనే అవకాశం ఉంటుంది. భూవాతావరణంలోకి ప్రవేశించే సమయంలో విపరీతమైన వేడి కారణంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని అధిక భాగాలు కాలిపోయి నాశనం అయిపోతాయని… మిగిలిన భాగాలు పసిఫిక్ సముద్రంలోని ‘పాయింట్ నెమో’ ప్రాంతంలో పడేలా చేస్తారు. ఈ ప్రాంతాన్ని దీనిని అంతరిక్ష వ్యర్థాల వాటికగా చెప్తూ ఉంటారు. ఇక్కడ మనుషులు ఉండరు కాబట్టి ఏ సమస్య ఉండదు. అంతరిక్ష నౌకలు అన్నీ ఇక్కడే కూల్చేస్తారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ డీకమిషనింగ్‌కు నాసా గతేడాది జూన్‌లో ఎలాన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ ను సెలెక్ట్ చేసింది. ఇందుకోసం స్పేస్ ఎక్స్‌తో 843 మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని కూడా చేసుకుంది.