Naa Anveshana: ఈ తెలుగు యూట్యూబర్ సంపాదన నెలకు రూ.30 లక్షలా..? సంచలనం సృష్టించిన అన్వేష్..
తెలుగులో వేలాది మంది యూట్యూబర్లు తమ కంటెంట్‌తో దూసుకెళ్తున్నారు. వీళ్లందరిలోకి ప్రత్యేక చెప్పుకోవాల్సింది అన్వేష్ గురించి. ఎందుకంటే.. ఇతడు తాజాగా యూట్యూబ్ ద్వారా ఏకంగా రూ.30 లక్షలు సంపాదించినట్లు చెప్పాడు.
Naa Anveshana: యూట్యూబ్‌లో వీక్షకులకు నచ్చే కంటెంట్ పెట్టాలే కానీ.. లక్షల్లో వ్యూస్.. లక్షల్లో ఆదాయం. ఎందరో సామాన్యులు యూట్యూబర్లుగా మారి, సెలబ్రిటీలుగా ఎదుగుతున్నారు. భారీ ఆదాయం పొందుతూ సక్సెస్ అవుతున్నారు. తెలుగులో వేలాది మంది యూట్యూబర్లు తమ కంటెంట్‌తో దూసుకెళ్తున్నారు. వీళ్లందరిలోకి ప్రత్యేక చెప్పుకోవాల్సింది అన్వేష్ గురించి. ఎందుకంటే.. ఇతడు తాజాగా యూట్యూబ్ ద్వారా ఏకంగా రూ.30 లక్షలు సంపాదించినట్లు చెప్పాడు. తన యూట్యూబ్ ఛానెల్ ద్వారానే ఈ విషయం వెల్లడించాడు.
అన్వేష్.. యూట్యూబ్ చూసే తెలుగువాళ్లకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఇతడి ఛానెల్ పేరు నా అన్వేషణ. ఇదో ట్రావెల్ ఛానెల్. వివిధ దేశాలు పర్యటిస్తూ, అక్కడి ప్రత్యేకతలు, విశేషాలతో వీడియోలు రూపొందిస్తాడు. వీడియోల్లో అక్కడి విశేషాల్ని అతడు వివరించే తీరు ఆసక్తికరంగా ఉంటుంది. ప్రతి ఒక్కరికీ సులభంగా అర్థమయ్యేలా తన వ్యాఖ్యానం సాగుతుంది. స్థానికులతో మమేకమవుతూ, ఎన్నో కొత్త విషయాల్ని, చారిత్రక అంశాల్ని శోధించి అందిస్తుంటాడు. అందుకే అతడి యూట్యూబ్ ఛానెల్‌కు మిలియన్‌పైగా సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. ప్రతి వీడియోకు లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి. తెలుగులో టాప్ ట్రావెల్ యూట్యూబర్స్‌లో ఒకడిగా కొనసాగుతున్నాడు. గతంలో అనేక వీడియోలకు లక్షల్లో ఆదాయం వచ్చినా.. ఈసారి మాత్రం ఏకంగా రూ.30 లక్షలు ఆదాయం సంపాదించాడు. ప్రస్తుతం అన్వేష్ చైనాలో పర్యటిస్తున్నాడు. అక్కడి వీడియోలకు మంచి ఆదరణ దక్కుతోంది. దీంతో భారీ ఆదాయం వచ్చినట్లు అన్వేష్ చెప్పాడు. నెల రోజులకుగాను రూ.30 లక్షలు వచ్చాయన్నాడు. ఈ విషయంలో తెలుగువాళ్లు తనను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పాడు. అలాగే వివిధ దేశాల్లో స్థిరపడిన భారతీయులు కూడా తనను ఎంతగానో ఆదరిస్తున్నట్లు వెల్లడించాడు.
2019లో మొదలై
విశాఖ ప్రాంతానికి చెందిన అన్వేష్ తన యూట్యూబ్ ఛానెల్‌ను 2019లో ప్రారంభించాడు. దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన అన్వేష్ ట్రావెలింగ్‌పై మక్కువతో ఈ యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేశాడు. అప్పట్లో వ్యూస్ చాలా తక్కువగానే ఉండేవి. మొదటి సంపాదన రూ.10 వేలు మాత్రమే. ఆ తర్వాత కూడా పెద్దగా ఆదరణ దక్కలేదు. అంతంతమాత్రంగానే వ్యూస్ వచ్చాయి. అయినా పట్టువదలకుండా తనకు ఇష్టమైన ట్రావెలింగ్ చేస్తూ, వీడియోలు రూపొందిస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో సహారా, ఆఫ్గనిస్తాన్ సిరీస్‌లు మంచి సక్సెస్ అయ్యాయి. వీటి ద్వారా కూడా భారీ ఆదాయమే దక్కింది. అలా వరుసగా అనేక దేశాలు సందర్శిస్తూ, వీడియోలతో ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటివరకు 85 దేశాలు సందర్శించినట్లు అన్వేష్ చెప్పాడు. నెమ్మదిగా ఎదుగుతూ నాలుగేళ్లలో నెలకు రూ.30 లక్షలు ఆదాయం సంపాదించుకునే స్థాయికి చేరుకున్నాడు.
ఇబ్బందుల్ని దాటి
ఇంతటి విజయం వెనుక అతడి కృషి ఎంతో ఉంది. దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన అన్వేష్ ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాడు. ప్రారంభంలో తక్కువ ఆదాయం వచ్చినప్పటికీ వెనుకడుగు వేయలేదు. ట్రావెల్ వీడియోలు రూపొందిస్తూనే ఉన్నాడు. యూట్యూబ్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని ట్రావెలింగ్ కోసమే ఖర్చు పెట్టాడు. కంటెంట్ అందించే విధానంలోనూ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. తెలుగువాళ్లు ఎప్పుడూ సందర్శించని ప్రదేశాలకు వెళ్తూ, ఎవరికీ తెలియని విషయాల్ని వీడియోలో చూపిస్తుంటాడు. ఇతర ట్రావెల్ వ్లాగర్లకు భిన్నమైన, ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ అందిస్తూ వ్యూయర్స్‌ను ఆకట్టుకుంటున్నాడు. తెలుగులో ఒక నెలలో అత్యధిక ఆదాయం పొందిన యూట్యూబర్‌గా చరిత్ర సృష్టించాడు.
ఒక్క ప్రమోషన్ కూడా చేయకుండానే
యూట్యూబర్లలో అన్వేష్‌కు ఒక ప్రత్యేకత ఉంది. అదే ఇప్పటివరకూ ఒక్క ప్రమోషన్ కూడా చేయకపోవడం. సాధారణంగా యూట్యూబర్లు ఎవరైనా తమ వీడియోల ద్వారా ఏదో ఒక ప్రమోషన్ చేస్తుంటారు. ఆన్‌లైన్ గేమ్స్, ఇన్వెస్ట్‌మెంట్ యాప్స్, రియల్ ఎస్టేట్ సంస్థలు, ఫుడ్ కంపెనీస్.. ఇలా ఎన్నో సంస్థలు యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లతో ప్రమోట్ చేయిస్తుంటాయి. తమ ఉత్పత్తుల్ని కొనాలి అని, వాడాలి అని ప్రచారం చేయిస్తుంటాయి. కంపెనీలు చెప్పినట్లే యూట్యూబర్లు తమ వీడియోల మధ్యలో వాటిని ప్రమోట్ చేస్తుంటారు. ఇలా చెప్పినందుకు వారికి భారీగా ముట్టజెబుతుంటాయి. యూట్యూబర్ల వ్యూస్, సబ్‌స్క్రైబర్లను బట్టి ఒక్కో ప్రమోషన్‌కు వేల రూపాయల నుంచి లక్షల రూపాయల వరకు చెల్లిస్తుంటాయి. ఇది మంచి ఆదాయ వనరుగా ఉండటంతో యూట్యూబర్లు కూడా వాటిని ప్రమోట్ చేస్తుంటారు. అయితే, ఇలాంటి భారీ ఆదాయం వచ్చే అవకాశం ఉన్నప్పటికీ అన్వేష్ ఒక్క ప్రచారం కూడా చేయకపోవడం గమనార్హం. తాను ప్రమోట్ చేసిన వాటి ద్వారా తన వ్యూయర్స్‌లో ఎవరైనా నష్టపోవడం తనకు నచ్చదని, దానివల్ల తనను తిట్టుకుంటారని, అందువల్ల తన వ్యూయర్స్‌కు నష్టం కలిగించకూదన్న ఉద్దేశంతో ప్రమోషన్స్ చేయడం లేదని చెప్పాడు అన్వేష్. ఇది నిజంగా మంచి విషయమే. చాలా మంది యూట్యూబర్లు అనేక తప్పుడు కంపెనీలకు ప్రమోట్ చేస్తున్నారు. వాళ్లు చెప్పినవి నిజమని నమ్మి, కొందరు వ్యూయర్స్ డబ్బులు పెట్టుబడి పెట్టి లక్షల్లో నష్టపోతున్నారు. కానీ, తన వ్యూయర్స్ విషయంలో అలా జరగకూడదని గట్టి నిర్ణయం తీసుకున్నట్లు అన్వేష్ చెప్పాడు. దీని ద్వారా అతడు లక్షల్లో ఆదాయం కోల్పోతున్నా తన సిద్ధాంతానికే కట్టుబడి ఉండటం విశేషం.