ఐపీఎల్ మెగా వేలం చెన్నై రిటైన్ చేసుకునేది వీరినే
ఐపీఎల్ ఆటగాళ్ళ వేలం డిసెంబర్ లో జరిగే అవకాశాలున్నాయి. ఈ సారి మెగా వేలం కావడంతో దాదాపు అన్ని జట్ల కూర్పు మారిపోవడం ఖాయం. అయితే ప్రతీ ఫ్రాంచైజీ తమ రిటెన్షన్ జాబితాపై కసరత్తు చేస్తోంది. దీనిలో భాగంగా మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ రిటైన్ చేసుకునే ఆటగాళ్ళపై దాదాపు క్లారిటీ వచ్చేసినట్టే కనిపిస్తోంది. ముగ్గురు కీలక ఆటగాళ్ళను తమతో పాటే కొనసాగించాలని దాదాపుగా డిసైడయింది. చెన్నై రిటైన్ చేసుకునే మొదటి ప్లేయర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అనడంలో సందేహం లేదు. ధోనీ నుంచి పగ్గాలు అందుకున్న రుతురాజ్ సారథిగా ఇంకా నిరూపించుకోవాల్సి ఉండగా… బ్యాటర్ గా మాత్రం చెన్నైకి కీలకమనే చెప్పాలి.
2024 ఐపీఎల్ సీజన్ లో 14 మ్యాచ్ లు ఆడిన రుతురాజ్ 53 యావరేజ్ తో 583 పరుగులు చేశాడు. అలాగే శ్రీలంక సంచలన పేసర్ మతీషా పతిరణను కూడా చెన్నై వేలంలోకి వదిలే అవకాశం లేదు. మలింగా స్టైల్ బౌలింగ్ తో అదరగొడుతున్న పతిరణ గత సీజన్ లో ఆకట్టుకున్నాడు. ఆరు మ్యాచ్ లే ఆడినప్పటకీ 7.68 సగటుతో 13 వికెట్లు తీశాడు. ముఖ్యంగా డెత్ ఓవర్స్ లో అతని బౌలింగ్ చెన్నైకి మేజర్ అడ్వాంటేజ్. ఇక చెన్నై రిటైన్ చేసుకోబోయే మూడో ప్లేయర్ రవీంద్ర జడేజానే. ఐపీఎల్ లో ధోనీ, సురేష్ రైనా తర్వాత చెన్నైకు సుదీర్ఘకాలంగా ఆడుతున్న జడేజా ఎన్నోసార్లు తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో విజయాలను అందించాడు. ముఖ్యంగా 2023 ఐపీఎల్ ఫైనల్లో ఓడిపోయే స్థితిని నుంచి చెన్నై సూపర్ కింగ్స్ ను ఛాంపియన్ గా నిలిపాడు. ఈ ముగ్గురితో పాటు మాజీ కెప్టెన్ ధోనీని అన్ క్యాప్డ్ ప్లేయర్స్ కేటగిరీలో సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.