రికార్డులతో చెడుగుడు చెపాక్ లో అశ్విన్ షో
హోం గ్రౌండ్ లో రవిచంద్రన్ అశ్విన్ దుమ్మురేపాడు. చెన్నై చెపాక్ స్టేడియంలో ఈ సారి బంతి కంటే ముందే బ్యాట్ తో అదరగొట్టాడు. కీలక సమయంలో సెంచరీ చేయడమే కాదు జట్టుకు భారీస్కోరు అందించాడు.
హోం గ్రౌండ్ లో రవిచంద్రన్ అశ్విన్ దుమ్మురేపాడు. చెన్నై చెపాక్ స్టేడియంలో ఈ సారి బంతి కంటే ముందే బ్యాట్ తో అదరగొట్టాడు. కీలక సమయంలో సెంచరీ చేయడమే కాదు జట్టుకు భారీస్కోరు అందించాడు. ఈ క్రమంలో రికార్డులతో చెడుగుడు ఆడేశాడు. టెస్టుల్లో అశ్విన్‌కు ఇది 6వసెంచరీ కాగా.. చెన్నైలో రెండోది. అంతర్జాతీయ క్రికెట్‌లో 30కిపైగా ఐదు వికెట్ల ఘనతలతో పాటు 6 శతకాలు సాధించిన ఏకైక ప్లేయర్‌గా అశ్విన్ రికార్డ్ సాధించాడు. ఇప్పటి వరకు 101 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన అశ్విన్.. 500 ప్లస్ వికెట్లతో పాటు 6 శతకాలు, 14 హాఫ్ సెంచరీలు సాధించాడు. 36 సార్లు ఐదు వికెట్లు, 8 సార్లు 10 వికెట్ల ఘనతను అందుకున్నాడు.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ చరిత్రలో 100 వికెట్లతో పాటు 1000 పరుగులు చేసిన తొలి ఆఫ్ స్పిన్నర్‌గా రికార్డులకెక్కాడు. ఓవరాల్‌గా రవీంద్ర జడేజా తర్వాత ఈ ఘనతను అందుకున్న రెండో క్రికెటర్‌గా నిలిచాడు. ఈ ఏడాది ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో జడేజా 100 వికెట్లతో పాటు 1000 పరుగులు చేసిన తొలి ప్లేయర్‌గా ఘనత సాధిస్తే.. తాజాగా అశ్విన్ కూడా ఈ జాబితాలో చేరాడు. డబ్ల్యూటీసీ తొలి సీజన్ నుంచి ఆడుతున్న అశ్విన్ 1000 ప్లస్ రన్స్‌తో పాటు 174 వికెట్లు తీసాడు. మరోవైపు రవీంద్ర జడేజా 1600 ప్లస్ పరుగులతో పాటు 102 వికెట్లు తీసాడు. ఇదిలా ఉంటే ఏడో వికెట్ కు 500కు పైగా పరుగుల్లో భాగస్వామిగా ఉన్న కపిల్ దేవ్, సయ్యద్ కిర్మాణీల సరసన అశ్విన్ కూడా చేరాడు. మొత్తం మీద కోహ్లీ, రోహిత్ , గిల్ వంటి బ్యాటర్లు విఫలమైన చోట అశ్విన్ సెంచరీ సాధించడంతో అతనిపై ప్రశంసల జల్లు కురుస్తోంది.