Kapil Dev: 1983 చరిత్రకు 40 ఏళ్ళు
భారత్‌లో క్రికెట్‌ను ఓ మతంగా భావిస్తారు. ఒకరకంగా ఆ మతానికి నాంది పడి క్రికెటర్లను ఆరాధ్య దైవంగా, క్రికెట్‌ను తమ జీవితంలో ఓ భాగంగా భావించడానికి పునాది వేసింది 1983 వన్డే వరల్డ్ కప్ విజయం.
అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగిన ‘కపిల్ డెవిల్స్’.. అప్పటికీ వరల్డ్ క్రికెట్‌లో మోస్ట్ డేంజరస్ టీమ్‌గా ఉన్న వెస్టిండీస్‌ను చిత్తు చేసి దేశానికి తొలి వన్డే వరల్డ్ కప్‌ను అందించింది. ఆ అద్భుతం జరిగి నేటికి సరిగ్గా 40 ఏళ్లు. అప్పటికీ భారత జట్టు సారథిగా సునీల్ గవాస్కర్‌కు మంచి రికార్డే ఉన్నా వరల్డ్ కప్‌కు ముందు వైఫల్యాల నేపథ్యంలో బీసీసీఐ.. అతడిని తప్పించి హర్యానా హరికేన్ కపిల్ దేవ్‌కు సారథ్య పగ్గాలు అప్పగించింది. ఆడేది ఇంగ్లాండ్‌లో. మనోడికేమో పొట్ట కోస్తే ఇంగ్లీషు అక్షరం ముక్క రాదు. టీమ్‌లో చాలామందికి ఇంగ్లాండ్ లో ఆడిన అనుభవమూ అంతంతమాత్రమే.. ‘అసలు వీళ్లు ఏం నెగ్గుతార్లే.. ప్రయాణ ఖర్చులు దండుగ’ అన్న విమర్శలతోనే ఇంగ్లాండ్‌లో అడుగుపెట్టింది టీమిండియా.
ఇప్పటిలాగా టీమిండియా ఎక్కడికెళ్తే అక్కడ సకల సౌకర్యాలు లేవు. బీసీసీఐ అప్పటికీ ధనవంతమైన బోర్డుగా కాదు కదా.. ఆటగాళ్లకు జీతాలు కూడా ఇచ్చుకోలేని పరిస్థితి. అంచనాలే లేకుండా ఇంగ్లాండ్ లో అడుగుపెట్టిన కపిల్ సేన, మొత్తానికి ఫైనల్స్ కి చేరింది. క్రికెట్ మక్కా లార్డ్స్‌లో ఫైనల్. కలలో కూడా భయపెట్టే విండీస్ బౌలర్లు ఆండీ రాబర్ట్స్, గార్నర్, మాల్కమ్ మార్షల్, మైఖేల్ హోల్డింగ్‌ల దెబ్బకు టీమిండియా బ్యాటింగ్ కకావికలమైంది. 54.4 ఓవర్లలో భారత్ 183 రన్స్‌కు ఆలౌట్.
కృష్ణమచారి శ్రీకాంత్ (38) టాప్ స్కోరర్. అమర్‌నాథ్ (26) ఫర్వాలేదనిపించాడు. విండీస్ బ్యాటింగ్ లైనప్‌ను చూస్తే భారత బౌలర్లకు ఆదిలోనే గుండెల్లో వణుకుపుట్టింది. ప్రపంచంలో ఎంతటి బౌలర్ ను అయినా చితకబాదే గ్రీనిడ్జ్, వివ్ రిచర్డ్స్, క్లైవ్ లాయిడ్ వంటి దిగ్గజాలు ఆ జట్టు సొంతం. కానీ బ్యాటింగ్ లో విఫలమైన భారత్.. బౌలింగ్‌లో అద్భుతం చేసింది. మదన్ లాల్, మోహిందర్ అమర్‌నాథ్ లు విండీస్ బ్యాటింగ్ వెన్ను విరిచారు. ఈ ఇద్దరూ తలా మూడు వికెట్లతో చెలరేగారు. బల్విందర్ సింగ్ సాధుకు రెండు వికెట్లు దక్కాయి.
184 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత బౌలర్ల ధాటికి విండీస్.. 52 ఓవర్లలో 140 పరుగులకే ఆలౌట్ అయింది. అంతే.. భారత్‌లో సంబురాలు వేడుకలా జరిగాయి. సరిగ్గా ఇదే ప్రపంచకప్ ఫైనల్ జరుగుతున్న సమయంలో ముంబైలోని ఓ ఇంట్లో తొమ్మిదేండ్ల పిల్లాడు టీవీ ముందు ఆసక్తికరంగా మ్యాచ్ చూస్తున్నాడు. ఆ విజయం ఇచ్చిన స్ఫూర్తితో ఆ బాలుడు ‘ఇక క్రికెటే నా కెరీర్’ అని నిర్దేశించుకున్నాడు. ఆ ఆలోచన భారత క్రికెట్ తో పాటు ప్రపంచ క్రికెట్‌కూ ఓ దిగ్గజాన్ని అందించింది. ‘నేను అంతర్జాతీయ క్రికెట్‌లో వంద సెంచరీలు చేస్తానని’ ఆ సమయంలో ఆ బాలుడు అస్సలు ఊహించి ఉండడు. ఆ బాలుడెవరో కాదు.. భారత క్రికెట్ అభిమానులకు ఆరాధ్య దైవం సచిన్ టెండూల్కర్. సచిన్ వంటి ఎంతో మంది నాటి కుర్రాళ్లకు ఆదర్శంగా నిలిచిన 1983 వరల్డ్ కప్ విజయానికి నేటికి 40 ఏండ్లు పూర్తయ్యాయి.