సీనియర్ క్రికెటర్ తో గొడవ ? ముంబైకి జైశ్వాల్ గుడ్ బై అందుకే
టీమిండియా ఓపెనర్ యశస్వి జైశ్వాల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన సొంత జట్టు ముంబైకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నాడు. వచ్చే సీజన్ నుంచి గోవా తరపున ప్రాతినిథ్యం వహించేందుకు రెడీ అయ్యాడు.

టీమిండియా ఓపెనర్ యశస్వి జైశ్వాల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన సొంత జట్టు ముంబైకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నాడు. వచ్చే సీజన్ నుంచి గోవా తరపున ప్రాతినిథ్యం వహించేందుకు రెడీ అయ్యాడు. ఈ మేరకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కోసం ముంబై క్రికెట్ అసోసియేషన్ కు మెయిల్ చేశాడు. జైశ్వాల్ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ముంబై లాంటి టాప్ టీమ్ ను వదిలి వేరే జట్టుకు ఆడాలని ఎవ్వరూ అనుకోరు. ముంబై జట్టుకి ఆడే ప్లేయర్లకు టీమిండియాలో త్వరగా చోటు దక్కుతుందనే అభిప్రాయం కూడా చాలా మందిలో ఉంది. సునీల్ గవాస్కర్‌తో పాటు సచిన్ టెండూల్కర్, టీమిండియా ప్రస్తుత వన్డే, టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మ, టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, టెస్టు వైస్ కెప్టెన్ జస్ప్రిత్ బుమ్రా, అజింకా రహానే, ధవల్ కుల్‌కర్ణి, విజయ్ మర్చంట్, దిలీప్ వెంగ్‌సర్కార్ వంటి ఎందరో ముంబై క్రికెటర్లు, టీమిండియాకి ఆడారు. పైగా జైశ్వాల్ రెగ్యులర్ ప్లేయర్ గానే కొనసాగుతున్నాడు. ఇలాంటి అనుకూల పరిస్థితులను వదులుకుని ముంబై జట్టును ఎందుకు వీడుతున్నాడన్న ప్రశ్న అందరినీ వేధిస్తోంది.
గోవా జట్టు నుంచి తనకు మంచి ఆఫర్ రావడమే దీనికి కారణమని చెప్పాడు. ఈ నిర్ణయం తీసుకోవడం తనకు ఎంతో కష్టమైనది చెప్పుకొచ్చాడు. తాను ఇవాళ ఈ స్థాయిలో ఉండటానికి అసలు కారణం ముంబయినేనని స్పష్టం చేశాడు. తన జీవితాంతం ముంబయి క్రికెట్ అసోసియేషన్‌కు రుణపడి ఉంటానన్న జైశ్వాల్ గోవా తనకు ఓ కొత్త అవకాశాన్ని ఇచ్చిందన్నాడు. కెప్టెన్సీ తీసుకోవాలని కోరిందన్నాడు. తానీ తన తొలి ప్రాధాన్యత ఎప్పుడూ టీమిండియానేననీ, జాతీయ జట్టు తరఫున మ్యాచులు ఆడనప్పుడు మాత్రం గోవాకు ఆడతానని తెలిపాడు. అవసరమైతే టోర్నీ మొత్తం ఆడేందుకు ప్రయత్నిస్తాననీ, ఇది తనకు వచ్చిన ముఖ్యమైన అవకాశంగా భావిస్తున్నట్టు చెప్పుకొచ్చాడు.
అయితే జైశ్వాల్ ముంబై జట్టును వీడడానికి కారణం మాత్రం వేరే ఉందని వార్తలు వస్తున్నాయి. రంజీ సీజన్ లో జమ్మూ కాశ్మీర్ తో మ్యాచ్ జరిగినప్పుడు జైశ్వాల్ షాట్ సెలక్షన్ పై జట్టులోని సీనియర్ క్రికెటర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. దీనిపై జైశ్వాల్ కూ, సదరు సీనియర్ క్రికెటర్ కూ వాగ్వాదం జరిగినట్టు కూడా తెలుస్తోంది. తర్వాత ముంబై క్రికెట్ అసోసియేషన్ పెద్దలతోనూ ఇదే విషయంపై జైశ్వాల్ గొడవ పడినట్టు వార్తలు వచ్చాయి. ఈ కారణంగానే ముంబై జట్టుకు అతను గుడ్ బై చెప్పాడని పలువురు చెబుతున్నారు. జమ్మూకశ్మీర్‌తో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో చివరిసారిగా ముంబయి తరఫున ఆడిన యశస్వి 4, 26 పరుగులు చేశాడు. జైశ్వాల్ కంటే ముందై అర్జున్ తెందుల్కర్, సిద్ధేష్ లాడ్ కూడా ముంబయి జట్టు నుంచి గోవా జట్టులోకి వెళ్ళారు.
మరోవైపు యశస్వి జైస్వాల్‌తో పాటు ముంబై జట్టులోని ఇతర ఆటగాళ్లతో కూడా గోవా క్రికెట్ అసోసియేషన్ టచ్‌లో ఉందని ఓ మీడియా కథనాన్ని ప్రచురించింది. అందులో సూర్యకుమార్ యాదవ్ కూడా ముంబై జట్టును వీడేందుకు సిద్దమయ్యాడని పేర్కొంది. ఈ కథనంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సూర్యకుమార్ యాదవ్.. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను షేర్ చేస్తూ సదరు జర్నలిస్ట్‌పై మండిపడ్డాడు. కామెడీ సినిమాలు చూడటం మానేసి ఇలాంటి వార్తలు చదవడం మొదలుపెడుతానని సెటైర్లు పేల్చాడు. ఇవన్నీ అవాస్తమని కొట్టిపారేశాడు. ఎవరూ నమ్మకండి అని చెప్పుకొచ్చాడు.