అద్భుతం జరగాల్సిందే, ప్లే ఆఫ్ రేస్ నుంచి సన్ రైజర్స్ ఔట్
ఐపీఎల్ లో ఇక సన్ రైజర్స్ కథ ముగిసినట్టే...హాట్ ఫేవరేట్‌గా.. డిఫెండింగ్ రన్నరప్‌గా ఈ సీజన్ బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్..

ఐపీఎల్ లో ఇక సన్ రైజర్స్ కథ ముగిసినట్టే…హాట్ ఫేవరేట్‌గా.. డిఫెండింగ్ రన్నరప్‌గా ఈ సీజన్ బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. చెత్త ప్రదర్శనతో దాదాపుగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. అద్భుతం జరిగితే తప్పా ఆరెంజ్ ఆర్మీ ప్లే ఆఫ్స్ చేరలేదు. నిజానికి ఈ సీజన్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ ఘనంగానే ఆరంభించింది.రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 286 పరుగుల రికార్డ్ స్కోర్ నమోదు చేసి భారీ విజయాన్ని అందుకుంది. కానీ ఆ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, గుజరాత్ టైటాన్స్ చేతిలో ఘోర పరాజయాలను చవిచూసింది.
పంజాబ్ కింగ్స్‌తో 246 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి రెండో విజయాన్ని ఖాతాలో వేసుకున్న ఆరెంజ్ ఆర్మీ..మళ్ళీ ముంబై ఇండియన్స్‌తో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. సన్‌రైజర్స్ ప్రధాన బలమైన బ్యాటింగే బలహీనంగా మారింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి ఘోర వైఫల్యం సన్‌రైజర్స్ విజయవకాశాలను దెబ్బతీస్తోంది. పరిస్థితులతో సంబంధం లేకుండా బ్యాట్‌ను ఊపుతూ సన్‌రైజర్స్ బ్యాటర్లు మూల్యం చెల్లించుకుంటున్నారు. జట్టులో ఒక్క స్ట్రోక్ మేకింగ్ బ్యాటర్ లేకపోవడం బలహీనతగా మారింది.
ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడి 6 పరాజయాలతో పాయింట్స్ టేబుల్‌లో 9వ స్థానంలో కొనసాగుతోంది.లీగ్ దశలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఇంకా 6 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ప్లే ఆఫ్స్ చేరాలంటే సన్‌రైజర్స్ ఈ 6 మ్యాచ్‌లకు 6 గెలవాలి. అప్పుడే 16 పాయింట్లతో టోర్నీలో ముందడుగు వేయగలదు. ఈ 6 మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్ ఓడినా.. ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారుతాయి. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.
సన్‌రైజర్స్ నెట్ రన్‌రేట్ కూడా దారుణంగా ఉంది. దీంతో మిగిలిన 6 మ్యాచ్‌ల్లో విజయం సాధించడమే కాకుండా నెట్ రన్‌రేట్ కూడా మెరుగుపర్చుకోవాలి. మరో రెండు మ్యాచ్‌ల్లో ఓడితే మాత్రం సన్‌రైజర్స్ హైదరాబాద్ అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది.
హైదరాబాద్ తమ తదుపరి మ్యాచ్‌ల్లో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ , ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, ఆర్‌సీబీ, లక్నో సూపర్ జెయింట్స్ తో ఆడనుంది.దీనిలో రెండు మ్యాచ్‌లు మాత్రమే ఉప్పల్ మైదానంలో ఉన్నాయి. ఈ 6 మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ విజయం సాధించాలంటే అద్భుతంగా ఆడాల్సిందే.