పంత్ కు అరుదైన గౌరవం, లారెస్ అవార్డ్స్‌కు నామినేట్
భారత యువ క్రికెటర్ రిషబ్ పంత్ క్రికెట్ జర్నీ చాలామందికి స్పూర్తిదాయకమనే చెప్పాలి... కారు ప్రమాదంలో దాదాపు చావు అంచుల వరకూ వెళ్ళాడు..

భారత యువ క్రికెటర్ రిషబ్ పంత్ క్రికెట్ జర్నీ చాలామందికి స్పూర్తిదాయకమనే చెప్పాలి… కారు ప్రమాదంలో దాదాపు చావు అంచుల వరకూ వెళ్ళాడు..అసలు మళ్ళీ నడవగలడా అన్న అనుమానాల మధ్య పట్టుదలతో కోలుకుని క్రికెట్ లోకి రీఎంట్రీ ఇచ్చాడు. రీఎంట్రీ ఇవ్వడమే కాదు మునుపటి పంత్ ను అభిమానులకు చూపించాడు. అందుకే పంత్ రీఎంట్రీ ఎపిసోడ్ ఖచ్చితంగా ప్రశంసించదగినదే. కాగా పంత్ ప్రతిష్టాత్మక లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్‌కు నామినేట్ అయ్యాడు.
బెస్ట్ కమ్ బ్యాక్ ఆఫ్ ది ఇయర్’ కేటగిరీ అవార్డు రేసులో నిలిచాడు.డిసెంబర్ 2022లో పంత్ కారు ప్రమాదానికి గురైన ఈ యువ కీపర్ దాదాపు 14 నెలల తర్వాత కోలుకుని తిరిగి మైదానంలోకి అడుగుపెట్టాడు. గతేడాది ఐపీఎల్‌తో పునరాగమనం చేసిన అతను ఆ తర్వాత జాతీయ జట్టులోకి కూడా రీఎంట్రీ ఇచ్చాడు. కారు ప్రమాదం నుంచి కోలుకుని తిరిగి క్రికెట్ ఆడటాన్ని గుర్తించిన లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అకాడమీ పంత్‌ను బెస్ట్ కమ్ బ్యాక్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు నామినేట్ చేసింది. పంత్‌తోపాటు వివిధ దేశాలకు చెందిన మరో ఐదుగురు ఈ అవార్డుకు పోటీపడుతున్నారు.
బ్రెజిలియన్ జిమ్నాస్ట్ రెబెకా ఆండ్రేడ్, స్విమ్మర్లు అరియార్నే టిట్మస్, కేలెబ్ డ్రెస్సెల్, బైక్ సైకిల్ రేసర్ మార్క్ మార్క్వెజ్, ఆల్పైన్ స్కీ రేసర్ లారా గట్-బెహ్రామి అవార్డు రేసులో ఉన్నారు. ఓటింగ్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. ఏప్రిల్ 21న స్పెయిన్‌లోని మాడ్రిడ్ వేదికగా అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తర్వాత లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్‌కు నామినేట్ అయిన రెండో భారత క్రికెటర్ గా పంత్ ఘనత సాధించాడు. ప్రస్తుతం చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన భారత జట్టులో పంత్ సభ్యుడు. సీనియర్ ప్లేయర్ కేఎల్ రాహుల్ వికెట్ కీపర్ బ్యాటర్ గా రాణిస్తుండడంతో పంత్ రిజర్వ్ బెంచ్ కే పరిమితం కావాల్సి వచ్చింది.