Shivam Dube Vs Deepak Chahar: చెన్నై ఆటగాళ్ల మాటల యుద్ధం
చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ శివమ్ దూబె, పేసర్ దీపక్ చాహర్ మధ్య మాటల యుద్ధం జరిగింది! ఎవరిది పైచేయో ఒక్కో ఓవర్ బౌలింగ్ చేసి తేల్చుకుందామంటూ దూబేకు చాహర్ సవాలు విసిరాడు.

A war of words broke out between Chennai Super Kings all-rounder Shivam Dube and pacer Deepak Chahar
అయితే ఇదంతా సరదా కోసమే. తన ఆల్‌టైమ్ సీఎస్కే తుది జట్టును దూబె చెబుతున్న వీడియోను ఆ ఫ్రాంఛైజీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. సీఎస్కేకు మాజీ, తాజా ఆటగాళ్లలో 11 మందిని ఎవరిని ఎంపిక చేయాలని ఆలోచిస్తూ.. దూబె పేర్లు చెబుతూ కనిపించాడు. మొదట ఓపెనర్లుగా హేడెన్, మైకెల్ హస్సీలను ఎంచుకున్నాడు. ఆ తర్వాత వరుసగా రైనా, అంబటి రాయుడు, ధోని, జడేజా, అల్బీ మోర్కెల్, డ్వేన్ బ్రావో, హర్భజన్, లక్ష్మీపతి బాలాజీ పేర్లు చెప్పాడు.
ధోనీని కెప్టెన్‌గా ఎంచుకున్న దూబె.. చివరికి పదకొండో ఆటగాడిగా తన పేరు చెప్పుకున్నాడు. ఈ వీడియోపై సరదాగా స్పందిస్తూ.. ‘‘వచ్చే ఏడాది నువ్వు బౌలర్‌గా ఆడితే మేమెక్కడికి వెళ్లాలి’’ అని చాహర్ కామెంట్ చేశాడు. ‘‘వచ్చే ఏడాది ముందుగా మనిద్దరం ఒక్కో ఓవర్ పోరులో తలపడదాం. నేను నీకో ఓవర్ బౌలింగ్ చేస్తా. నువ్వు నాకో ఓవర్ బౌలింగ్ చెయ్. ఎవరు గెలిచి, జట్టులో స్థానం దక్కించుకుంటారో అప్పుడు చూద్దాం’’ అని చాహర్ మరో కామెంట్ చేశాడు. ‘‘నీ కోసం ఇప్పుడే చోటు ఖాళీ చేస్తున్నా’’ అని దూబె సమాధానమిచ్చాడు. చోటు వద్దు, మ్యాచే కావాలని చాహర్ మళ్లీ కామెంట్ పెట్టగా.. సరే అలాగే కానివ్వు అని దూబె సరదాగా బదులిచ్చాడు.