Sehwag: ఆ అమ్మాయి ఆకట్టుకుంది సెహ్వాగ్ మెచ్చిన ట్రైలర్
మాజీ ఇండియన్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఓ బాలీవుడ్ సినిమా ట్రైలర్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Abhishek Bachchan reacts to Virender Sehwag's tweet on Ghoomar movie trailer
అంతర్జాతీయ క్రికెట్‌లో దూకుడుకు మారుపేరుగా నిలిచిన భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. ఆటకు వీడ్కోలు పలికిన అనంతరం సోషల్ మీడియాలో తన చెనుకులతో కట్టిపడేస్తున్నాడు. విభిన్న అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ.. నవ్వులు పూయించడంతో పాటు.. ఆలోచింపచేసేలా ట్వీట్లు చేసే మన వీరేంద్రుడు.. తాజాగా ఓ బాలీవుడ్ సినిమా ట్రైలర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు అటు పేసర్లు, ఇటు స్పిన్నర్లు ఉతికి ఆరేసిన వీరూ.. ఏనాడు ప్రత్యర్థి బౌలర్లకు జడిసిన దాఖలాలు లేవు. సెహ్వాగ్ పరుగుల ప్రవాహానికి పలువురు బౌలర్ల అంతర్జాతీయ క్రికెట్‌కు ఫుల్‌స్టాప్ పడిన సందర్భాలు కూడా ఉన్నాయి.
తాజాగా అభిషేక్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ మూవీ ‘ఘూమర్’ ట్రైలర్ విడుదలైంది. ఇది చూసిన అనంతరం వీరూ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ‘సాధారణంగా నేను స్పిన్నర్లు పెద్దగా సీరియస్‌గా తీసుకోను.. కానీ ఇది కాస్త భిన్నంగా ఉన్నట్లుంది. ఘూమర్ చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని ట్వీట్ చేశాడు. దీనికి అభిషేక్ సమాధానమిస్తూ.. ‘ఒక్కసారి ఈ అమ్మాయిని ఎదుర్కొంటే సీరియస్‌గా తీసుకోక తప్పదు. ఇది ముమ్మాటికీ నిజం. ధన్యవాదాలు. ఈ ట్రైలర్ మీకు నచ్చినందుకు సంతోషిస్తున్నా’ అని రీట్వీట్ చేశాడు. ఆర్. బల్కీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్, సయామీ ఖేర్, అమితాబ్ బచ్చన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్ర ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేయగా.. సర్వత్ర ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.