గురూజీ మీరు చెప్పినట్టే కొట్టా అభిషేక్ శర్మ కామెంట్స్ వైరల్
టీ ట్వంటీ క్రికెట్ లో ఇప్పుడు అభిషేక్ శర్మ పేరు మారుమోగిపోతోంది. పొట్టి క్రికెట్ లో ఫిఫ్టీ కొడితేనే గొప్ప విషయం అనుకుంటే అభిషేక్ శర్మ సెంచరీలను అలవోకగా బాదేస్తున్నాడు. మధ్యలో కొన్ని మ్యాచ్ లు విఫలమైనా ఆడినప్పుడు మాత్రం భారీ ఇన్నింగ్స్ లతో చెలరేగిపోతున్నాడు.
టీ ట్వంటీ క్రికెట్ లో ఇప్పుడు అభిషేక్ శర్మ పేరు మారుమోగిపోతోంది. పొట్టి క్రికెట్ లో ఫిఫ్టీ కొడితేనే గొప్ప విషయం అనుకుంటే అభిషేక్ శర్మ సెంచరీలను అలవోకగా బాదేస్తున్నాడు. మధ్యలో కొన్ని మ్యాచ్ లు విఫలమైనా ఆడినప్పుడు మాత్రం భారీ ఇన్నింగ్స్ లతో చెలరేగిపోతున్నాడు. తాజాగా ఇంగ్లాండ్ తో జరిగిన చివరి టీ ట్వంటీలో దుమ్మురేపాడు. కేవలం 37 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఆరంభం నుంచే ఇంగ్లాండ్ బౌలర్లను ఉతికారేశాడు. అభిషేక్ ధాటికి ఇంగ్లాండ్ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్ వంటి స్టార్ బౌలర్లు సైతం అభిషేక్ విధ్వంసానికి బలయ్యారు. 7 ఫోర్లు, 13 సిక్స్ లతో 54 బంతుల్లో 135 పరుగులు చేశాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా 9 వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసింది. ఈ నేపథ్యంలో తన మెంటార్ యువరాజ్ సింగ్ ను ఉద్దేశించి మాట్లాడాడు అభిషేక్ శర్మ. ప్రత్యర్థి బౌలర్లు 140-150 కన్నా వేగంగా బౌలింగ్ చేస్తున్నప్పుడు, తన వ్యూహం ఎలా ఉంటుందో తెలిపాడు.
ప్రపంచ స్థాయి బౌలర్ల పై షాట్లు కొట్టడం ప్రత్యేకంగా నిలిచిందన్నాడు. రషీద్ బౌలింగ్ లో బాదిన సిక్స్ లు తనకు ఎంతో స్పెషల్ గా చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా స్ట్రెయిట్ డ్రైవ్ బాగా గుర్తుండి పోతుందన్నాడు. తన మెంటార్ యువరాజ్ సింగ్ ఈ ప్రత్యేక షాట్ గురించే మాట్లాడారనీ గుర్తు చేసుకున్నాడు. ఇప్పుడు తన బ్యాటింగ్ చూసి ఆయన చాలా సంతోషించి ఉంటారంటూ వ్యాఖ్యానించాడు. నేను ఎప్పుడూ 15-20 ఓవర్ల వరకు బ్యాటింగ్ చేయాలని ఆయన కోరుకుంటాడనీ చెప్పుకొచ్చాడు. దేశం కోసం ఇలాంటి ప్రదర్శన చేయడం ఎప్పుడు గొప్ప అనుభూతిని ఇస్తుందన్నాడు. తాను తొలి బంతి నుంచే దూకుడుగా ఆడేందుకు ప్రయత్నిస్తాననీ చెప్పాడు. తన కెప్టెన్ సూర్య కుమార్, కోచ్ గంభీర్ సార్ తన నుంచి ఇదే కోరుకున్నారంటూ అభిషేక్ శర్మ చెప్పాడు. తొలి రోజు నుంచే ఎంతో మద్దతుగా నిలిచారన్నాడు..140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసే వారి వేగానికి తగ్గట్టే తాను షాట్లు ఆడతానని చెప్పాడు.
మరోవైపు యువరాజ్ సింగ్ కూడా అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ పై స్పందించాడు. అద్భుతంగా ఆడావ్ అంటూ కితాబిచ్చాడు. ..నిన్ను ఈ విధంగా చూడాలని అనుకున్నాననీ, ఎంతో గర్వంగా ఉందంటూ వ్యాఖ్యానించాడు. అభిషేక్ శర్మ చాలారోజులు యువరాజ్ దగ్గర కోచింగ్ తీసుకున్నాడు. వైఫల్యాల బాటలో ఉన్నప్పుడు యువీ అతనికి అండగా నిలిచాడు. మెంటార్ గా యువరాజ్ ఉండడం తన అదృష్టమంటూ గతంలోనే పలు సందర్భాల్లో అభిషేక్ శర్మ చెప్పుకొచ్చాడు. ప్రస్తుత క్రికెట్ లో యువీ తరహాలోనే సిక్సర్లు బాదుతున్న ఈ యువ ఓపెనర్ రానున్న రోజుల్లో మరిన్ని రికార్డులు అందుకుంటాడని అంచనా వేస్తున్నారు.