Afghanistan Team: కన్నీళ్ల దేశంలో సంతోషాన్నిస్తున్న క్రికెట్.. ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్తాన్ సంచలనం..

వరల్డ్‌ కప్‌లో అఫ్ఘనిస్తాన్‌ ఆటగాళ్ల ప్రతిభ అందరిని అబ్బురపరుస్తోంది. ఇప్పటి వరకు ఆరు మ్యాచులు ఆడిన ఆ జట్టు.. మూడు విజయాలతో దుమ్మురేపింది. వరల్డ్‌కప్ ఛాంపియన్స్‌ని వెనక్కి నెట్టి పాయింట్ల పట్టికలో ఏకంగా ఐదో స్థానానికి ఎగబాకింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 2, 2023 | 12:32 PMLast Updated on: Nov 03, 2023 | 6:49 PM

Afghanistan Team Creating History In Icc World Cup 2023

Afghanistan Team: మొన్నటి వరకు ప్రపంచ క్రికెట్‌లో అదో పసికూన. కానీ ఇప్పుడు గట్టి పిండం. మహా మహా జట్లకే ముచ్చెమటలు పట్టిస్తూ వరల్డ్‌కప్‌లో దూసుకెళ్తోంది. ఆ జట్టే అప్ఘనిస్థాన్. ఆట ఆడేందుకు కనీస సౌకర్యాలుండవు. ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహం కూడా ఉండదు. నిత్యం ఏదో ఒక సంక్షోభం. యుద్ధ వాతావారణం. వీటన్నింటి నుంచి అప్ఘన్ క్రికెట్ టీమ్ అత్యత్తమ ప్రదర్శన ఎలా చేస్తోంది..? ఈ విజయాల వెనుక ఉన్న ఆ కన్నీటి గాథలేంటి..? వరల్డ్ కప్‌లో ఆఫ్గానిస్తాన్‌ సంచలనాలకు మారు పేరుగా మారింది. బాహుబలి లాంటి టీమ్స్‌ను ఢీకొడుతూ విజయాలను సొంతం చేసుకుంటోంది.

వరల్డ్‌ కప్‌లో అఫ్ఘనిస్తాన్‌ ఆటగాళ్ల ప్రతిభ అందరిని అబ్బురపరుస్తోంది. ఇప్పటి వరకు ఆరు మ్యాచులు ఆడిన ఆ జట్టు.. మూడు విజయాలతో దుమ్మురేపింది. వరల్డ్‌కప్ ఛాంపియన్స్‌ని వెనక్కి నెట్టి పాయింట్ల పట్టికలో ఏకంగా ఐదో స్థానానికి ఎగబాకింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌ చిట్టచివరన పదో స్థానంలో ఉంటే పాకిస్థాన్ ఏడో స్థానంలో , శ్రీలంక ఆరో క్థానంలో ఉన్నాయి. ఈ మూడు జట్లు కూడా ఒకప్పుడు వరల్డ్ కప్ గెలిచినవే. అయినా వీటన్నింటిని వెనక్కి నెట్టి.. క్రికెట్‌ ప్రపంచాన్నే నివ్వెరపరుస్తూ అయిదో స్థానంలోకి దూసుకొచ్చింది అఫ్గానిస్తాన్‌. ఆ టీం జైత్రయాత్ర ఇలాగే కొనసాగితే.. ఆఫ్గాన్‌ సెమీస్‌ చేరడం ఖాయం. అప్ఘానిస్థాన్‌ను ఇకపై పసికూన అంటే పొరపాటే అవుతుందేమో. ముందు ఇంగ్లాండ్‌, తరువాత పాకిస్తాన్‌, ఇప్పుడు శ్రీలంకను ఓడించి.. తాము పసివాళ్లం కాదని మీసం మెలేసింది.

మ్యాచ్ మ్యాచ్‌కి అటు బంతితో, ఇటు బ్యాటుతో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. ప్రత్యర్థి జట్లను ఓ ఆట ఆడుకుంటోంది. అయితే ఈ విజయాలేవీ.. అలవోకగా వచ్చినవి కాదు. ఈ గెలుపు గాలివాటం కాదు. ఆఫ్ఘనిస్తాన్‌ విజయాల వెనుక ఎన్నో కన్నీళ్లు, విషాదాలు ఉన్నాయి. ఎప్పుడూ ఏదో ఒక సంక్షోభం, ఆర్థిక సమస్యలు, తినడానికి తిండి ఉండదు, నిత్యం బాంబు దాడులు, భూకంపాలతో సతమతమయ్యే దేశంలో.. క్రికెట్‌ లాంటి జంటిల్మెన్ గేమ్ గురించి ఆలోచించే పరిస్థితి ఉంటుందా..? ఇక రెండేళ్ల కిందట దేశం తాలిబన్ల చేతుల్లోకి వెళ్లాక అసలు క్రీడా వసతుల గురించి ప్రస్తావన వస్తుందా..? కానీ అప్ఘన్ ఆటగాళ్లు అద్భుతాలు చేస్తున్నారు. అందుకు కారణం.. అఫ్గాన్‌ పాలన తాలిబన్ల ఆధినంలోకి వెళ్లాక ఆ దేశ క్రికెటర్లు ఎక్కువగా విదేశాల్లోనే ఉంటున్నారు. ఎవరికి వారు అన్నట్లు ఉండే ఆటగాళ్లు.. జాతీయ జట్టు తరఫున ఏదైనా సిరీస్, టోర్నీ ఆడాల్సినపుడు మాత్రమే ఒక చోటికి చేరుతున్నారు. సమష్టిగా రాణిస్తూ దేశానికి గొప్ప పేరు తీసుకొస్తున్నారు. మిగతా జట్లలా అఫ్ఘనిస్థాన్‌ ఆటగాళ్లకు తమ దేశంలో ఉత్తమ క్రికెట్‌ సౌకర్యాలేమీ లేవు. కొన్నేళ్ల ముందు వరకు ఆ దేశంలో క్రికెట్‌ స్టేడియమే లేదు. దశాబ్దాల క్రికెట్‌ సంస్కృతి లేకపోయినా.. గొప్ప సౌకర్యాలు లేకపోయినా.. సహజ ప్రతిభకు మెరుగులు దిద్దుకుని ఆ దేశ ఆటగాళ్లు ప్రపంచ స్థాయికి ఎదిగారు.

టీ20 లీగ్స్‌ వారికి బాగా కలిసొచ్చాయి. నబి, రషీద్‌ ఖాన్, ముజీబ్‌ రెహ్మాన్, గుర్బాజ్, ఫారూఖీ, నవీనుల్‌ హక్‌ లాంటి ప్రతిభావంతులు ఆ దేశానికి ప్రపంచ క్రికెట్లో ఒక స్థాయిని తీసుకొచ్చారు. ఎదుగుతున్న దశలో అఫ్ఘన్‌కు భారత్‌ అండగా నిలిచింది. ఆ దేశంలో స్టేడియం నిర్మించడమే కాక.. మరికొన్ని క్రికెట్‌ సౌకర్యాలు సమకూర్చింది. అఫ్గాన్‌ తమ సొంతగడ్డపై ఆడాల్సిన సిరీస్‌లు కొన్నింటికి భారత్‌నే వేదికగా మార్చింది. అంతే కాక లాల్‌సింగ్‌ రాజ్‌పుత్, మనోజ్‌ ప్రభాకర్‌.. గతంలో అఫ్ఘన్‌కు కోచ్‌లుగా పని చేశారు. ప్రస్తుతం భారత్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లోనూ అజయ్‌ జడేజా అఫ‌్ఘనిస్థాన్‌కు మెంటర్‌గా వ్యవహరిస్తుండటం విశేషం. ఇలా అఫ‌్ఘన్‌ ఎదుగుదలలో భారత్‌ పాత్ర ఎంతో కీలకం. తమ దేశం నుంచి ఎలాంటి ప్రోత్సాహం లేకపోయినా.. పుట్టిన దేశం సమస్యల వలయంలో చిక్కుకుపోయినా.. కసి, పట్టుదలతో ఈ స్థాయికి చేరుకున్న అఫ్గానిస్తాన్‌ జట్టును ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు.