Ambati Rayudu: చెన్నై-ముంబై వారధి అంబటి..! అభిమానులు ఎప్పటికీ మరువలేని రాయుడు జ్ఞాపకాలు
ఐపీఎల్ కెరీర్‌కు రాయుడు గుడ్‌బై చెప్పాడు. ఇక రాయుడును కాంపిటేటివ్ క్రికెట్‌లో మన చూడలేం. 13ఏళ్లుగా ఐపీఎల్ అభిమానులను అలరించిన రాయుడు రిటైర్ అవుతున్నాడంటే అటు ముంబై..ఇటు చెన్నై అభిమానులను ఏదో తెలియని బాధ ముంచేస్తోంది.
ఐపీఎల్‌లో ముంబై-చెన్నై అభిమానులది టామ్ అండ్ జెర్రి లాంటి అనుబంధం.. ఒకరంటే ఒకరికి పడదు..అయితే ఆ గొడవలు ఎప్పుడూ హద్దు దాటవు..వాదించుకున్నంత సేవు వాదించుకొని తర్వాత ఫ్రెండ్స్‌లా ఉంటారు.ఇక ముంబై జట్టులోని ఆటగాళ్లను చెన్నై అభిమానులు.. చెన్నై జట్టులోని ఆటగాళ్లను ముంబై ఫ్యాన్స్ ట్రోల్ చేయడమన్నది సాధారణ విషయం..! దీనికి సచిన్ నుంచి ధోనీ వరకు ఎవరూ అతీతులు కాదు. అయితే ఓ ప్లేయర్‌ని మాత్రం చెన్నై అభిమానులు ట్రోల్ చేయరు.. ఇటు ముంబై అభిమానులూ అంతే..ఇలా ఒకరంటే ఒకరికి పడని రెండు జట్ల అభిమానుల మనసుల్లో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకున్న ఆటగాడు అంబటి రాయుడు.
అంబటి రాయుడు అంటే ముంబై అభిమానులకు సొంత కుటుంబంలోని సభ్యుడితో సమానం. అతనిపై ముంబై అభిమానులు చూపించే ప్రేమ అపూర్వం.. 2010లో సచిన్‌తో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకోల్పిన రాయుడు..టీమ్‌లోకి వచ్చిన తక్కువ రోజుల్లోనే ముంబై ఫ్యాన్స్‌కు చాలా దగ్గరైపోయాడు. 2011లో బెంగళూరుపై జరిగిన మ్యాచ్‌లో.. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎన్నికైన సచిన్..తన అవార్డును రాయుడుతో కలిసి షేర్ చేసుకుంటానని చెప్పి..నేరుగా తన వద్దకు వెళ్లి అవార్డును పంచుకోవడమే కాకుండా.. క్యాష్ చెక్‌ని అంబటికి ఇచ్చేయడం అభిమానులకు ఇప్పటికీ గుర్తు. ముంబై జట్టు ఆపదలో ఉన్న ప్రతిసారి పొలార్డ్‌తో రాయుడి నెలకొల్పిన పార్టనెర్‌షిప్‌లు సచిన్-రోహిత్ టీమ్‌ను గెలిపించాయి. స్కోర్ కార్డు చూసేవాళ్లకి రాయుడు ఆడింది తక్కువే లాగా అనిపించినా.. అతను ఏ పరిస్థితిలో ఎలా ఆడాడో..ఓడిపోయే మ్యాచ్‌ను ఎలా గెలిపించాడో మ్యాచ్ మొత్తం చూసినవాళ్లకే అర్థమవుతుంది.
2014లో రాజస్థాన్‌పై 14.3ఓవర్లలో 190పరుగులు చేస్తేనే ప్లేఆఫ్‌కు అర్హత సాధించే అవకాశమున్న ముంబైని రాయుడు దాదాపు విజయతీరాల వరకు చేర్చాడు.. ఆఖరి మెట్టుపై అతను బోల్తా పడినా.. ఆదిత్య తారే చివరి బంతిని సిక్సర్‌గా మలిచి ఐపీఎల్ చరిత్రలోనే ఫ్యాన్స్ ఎల్లకాలం గుర్తిండిపోయే విజయాన్నిందిచాడు. ఆ మ్యాచ్ విజయం తర్వాత తారే స్పెషల్‌గా రాయుడుతో కలిసి తన ఆనందాన్ని పంచుకున్నాడు. 2012లో బెంగళూరుపై 54బంతుల్లో 81.. 2016లో పంజాబ్‌పై 37బంతుల్లో 65.. 2017లో హైదరాబాద్‌పై 46బంతుల్లో 68పరుగులు ముంబై తరఫున రాయుడు బెస్ట్ స్టాట్స్..అయితే ముందు చెప్పుకునట్టు..కేవలం స్టాట్స్‌తోనే రాయుడు ఆటను కొలవలేం.. మ్యాచ్ పరిస్థితికి తగ్గట్టుగా..ఆపదలో అనేకసార్లు ఆదుకున్న ఆటగాడిగా రాయుడు పేరు ముంబై అభిమానుల మనసులో గూడుకట్టుకుపోయింది.
2010నుంచి 2017వరకు ముంబై తరఫున సేవియర్ రోల్ ప్లే చేసిన రాయుడు.. 2018 నుంచి చెన్నై తరుపున బరిలోకి దిగాడు. ఓపెనర్‌గా వచ్చి తనలోని మరో యాంగిల్‌ని ప్రపంచానికి చూపించాడు..! రాయుడు ఇలా కూడా ఆడతాడా అని అనిపించేలా కొత్త రోల్‌లో అదరగొట్టాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 52బంతుల్లో 100పరుగులు చేసిన రాయుడు ఐపీఎల్‌లో తన తొలి శతకం బాదాడు. ముంబై తరఫున ఫినీషర్ బాధ్యతలో ఒదిగిపోయిన రాయుడు.. చెన్నై తరుఫున ఓపెనర్‌గా పరుగుల వర్షం కురిపించాడు.. ఆ ఏడాది చెన్నై కప్ గెలవడంలో రాయుడిదే కీలక పాత్ర.. ఇక 2021లో ముంబైపై రాయుడు ఆడిన ఇన్నింగ్స్ ఐపీఎల్ హిస్టరీలో గొప్ప ఇన్నింగ్స్‌లలో ఒకటి. కేవలం 27బంతుల్లో 72పరుగులు చేసిన రాయుడు.. ఆ మ్యాచ్‌లో చెన్నైని గెలిపించాడు.. అదే ఏడాది అతని ఖాతాలో మరో ఐపీఎల్ ట్రోఫీ వచ్చి పడింది. ఇక నిన్నటి ఫైనల్ మ్యాచ్‌లోనూ రాయుడు ఇన్నింగ్సే చెన్నై గెలుపుకు దారులు వేసింది. ముంబై తరుఫున మూడు సార్లు ట్రోఫీ అందుకున్న రాయుడు.. చెన్నై తరుఫున మూడుసార్లు కప్ గెలిచాడు..రాయుడు ఐపీఎల్ కెరీర్‌లో నాలుగు వేలకుపైగా పరుగులున్నాయి. 14సీజన్లలో 11సార్లు ఫ్లేఆఫ్‌కు వచ్చాడు..8సార్లు ఫైనల్‌కు వచ్చాడు..ఆరు సార్లు ట్రోఫి గెలిచాడు..అయితే ఇవ్వని కాదు.. రాయుడు అంటే అంతకుమించి..! ముంబై,చెన్నై అభిమానులకు అతను ఇప్పటికీ..ఎప్పటికీ సొంత ఇంటి మనిషే..!