ICC Champions Trophy: పాకిస్తాన్‌కు ఐసీసీ షాక్.. దుబాయ్‌కు మారనున్న ఛాంపియన్స్ ట్రోఫీ వేదిక..
ఇండియా సహా అనేక దేశాలు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్ వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. ముఖ్యంగా ఇండియా మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ పాకిస్తాన్‌లో ఆడేది లేదని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీని దుబాయ్‌లో నిర్వహించే అంశాన్ని ఐసీసీ పరిశీలిస్తోంది.
ICC Champions Trophy: ఇప్పటికే వరుస ఓటములతో డీలా పడిన పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు మరో షాక్ తగలనుంది. 2025లో పాకిస్తాన్‌లో జరగాల్సిన చాంపియన్స్ ట్రోఫీని ఆ దేశం నుంచి దుబాయ్ తరలించాలని ఐసీసీ భావిస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్ అంతర్యుద్ధం, తీవ్రవాదం, పేదరికం, ద్రవ్యోల్బణం వంటి సమస్యల్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియా సహా అనేక దేశాలు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్ వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. ముఖ్యంగా ఇండియా మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ పాకిస్తాన్‌లో ఆడేది లేదని తేల్చిచెప్పింది.
ఈ నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీని దుబాయ్‌లో నిర్వహించే అంశాన్ని ఐసీసీ పరిశీలిస్తోంది. ఇదే జరిగితే పాక్ క్రికెట్ బోర్డుకు పెద్ద షాక్‌గానే చెప్పాలి. నిజానికి పాకిస్తాన్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించేందుకు పూర్తి స్థాయి ఒప్పందమేదీ ఖరారు కాలేదు. ఐసీసీ, పాక్ బోర్డు మధ్య సూచనప్రాయంగానే అంగీకారం కుదిరింది. నిర్వహణ హక్కులను సంబంధించి కూడా ఇంకా ఎలాంటి అగ్రిమెంట్ చేసుకోలేదు. కానీ, వెంటనే నిర్వహణ హక్కులను సంబంధించిన ఒప్పందం చేసుకోవాలని ఐసీసీని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కోరుతుంది. ఒకవేళ ఒప్పందం ప్రకారం.. ఈ టోర్నీని తమ దేశంలో ఆడేందుకు ఇండియా అంగీకరించకపోతే.. నష్ట పరిహారం కావాలని పాక్ క్రికెట్ బోర్డు కోరింది.
ఈ అంశంపై చర్చించేందుకు ఐసీసీ ఎగ్జిక్యూటివ్ బోర్డుతో పీసీబీ ఛైర్మన్ జకా అష్రఫ్, సీఓఓ సల్మాన్ నసీర్ సమావేశమయ్యారు. ఐసీసీ టోర్నమెంట్‌పై ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకూడదని పీసీబీ కోరింది. గత రెండు సంవత్సరాల కాలంలో అనేక జట్లు పాకిస్తాన్‌లో పర్యటించాయని ఈ సందర్భంగా పీసీబీ గుర్తు చేసింది.