స్టార్ ప్లేయర్స్ అంతా ఔట్ టైటిల్ గెలిచే సత్తా ఉందా ?

ఐసీసీ టోర్నమెంట్ ఎప్పుడు జరిగినా టైటిల్ ఫేవరెట్ గా ఆస్ట్రేలియా పేరు ముందుంటుంది.. గత కొన్నేళ్ళుగా మెగాటోర్నీల్లో ఆ జట్టు డామినేషన్ అలా ఉంది మరి... ఎప్పటికప్పుడు యువ, సీనియర్ ఆటగాళ్ళతో ప్రపంచకప్ లాంటి పెద్ద టోర్నీల్లో సత్తా చాటే జట్టుగా ఆసీస్ కు పేరుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 19, 2025 | 04:20 PMLast Updated on: Feb 19, 2025 | 4:20 PM

Are All The Star Players Capable Of Winning The Out Title

ఐసీసీ టోర్నమెంట్ ఎప్పుడు జరిగినా టైటిల్ ఫేవరెట్ గా ఆస్ట్రేలియా పేరు ముందుంటుంది.. గత కొన్నేళ్ళుగా మెగాటోర్నీల్లో ఆ జట్టు డామినేషన్ అలా ఉంది మరి… ఎప్పటికప్పుడు యువ, సీనియర్ ఆటగాళ్ళతో ప్రపంచకప్ లాంటి పెద్ద టోర్నీల్లో సత్తా చాటే జట్టుగా ఆసీస్ కు పేరుంది. కానీ ఈ సారి ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియాకు టైటిల్ గెలిచే సత్తా ఎంతవరకూ ఉందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనికి కారణం పలువురు స్టార్ ప్లేయర్స్ గాయాలతో దూరమవడమే.. ఆసీస్ అనగానే వారి భయంకరమైన పేస్ ఎటాక్ గుర్తొస్తుంది. ప్రత్యర్థి బ్యాటర్లను తమ బౌన్సర్లతో కవ్విస్తూ వారిని ఇబ్బందిపెట్టే పేస్ బౌలింగ్ కంగారూల సొంతం.. అయితే ఛాంపియన్స్ ట్రోఫీకి మాత్రం ఆ జట్టులో కీలక పేస్ బౌలర్లందరూ అందుబాటులో లేకుండా పోయారు. ఏకంగా ఐదుగురు స్టార్ ప్లేయర్స్ దూరమయ్యారు.

గాయాల కారణంగా కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్, పేసర్ జోష్‌ హేజిల్‌వుడ్, ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ వైదొలగగా.. ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టాయినిస్‌ అకస్మాత్తుగా రిటైర్మెంట్‌ ప్రకటించాడు. తాజాగా ప్రధాన పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ కూడా తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాలతో స్టార్క్‌ టోర్నీకి దూరమయ్యాడు. కీలక ఆటగాళ్లు దూరమైన నేపథ్యంలో పలువురు యువ ఆటగాళ్ళకు చోటు దక్కింది. గాయం కారణంగా కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్ ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025కి దూరమవడంతో… సీనియర్ బ్యాటర్ స్టీవ్‌ స్మిత్‌కు ఆసీస్ సెలెక్షన్‌ కమిటీ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. బ్యాటర్‌ ఫ్రేజర్‌ మెక్‌గుర్క్‌.. పేసర్లు ఆరోన్‌ హార్డీ, స్పెన్సర్‌ జాన్సన్, నాథన్‌ ఎలిస్, సీన్‌ అబాట్, బెన్‌ డ్వార్షుయిస్‌.. లెగ్‌ స్పిన్నర్‌ తన్వీర్‌ సంఘా జట్టులోకి వచ్చారు. మార్నస్ లబుషేన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ట్రావిస్ హెడ్, అలెక్స్‌ కేరీ, ఆడమ్ జంపా వంటి అనుభవజ్ఞులైన ప్లేయర్స్ ఆసీస్ జట్టులో ఉన్నారు.

కీలకమైన పేస్ బౌలర్లందరూ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందే దూరమవడం ఆస్ట్రేలియాకు పెద్ద ఎదురుదెబ్బగానే చెప్పాలి. దీంతో ఫాస్ట్ బౌలింగ్ విభాగం కొత్త కుర్రాళ్లతో నింపాల్సి వచ్చింది. పేసర్లు ఆరోన్‌ హార్డీ, స్పెన్సర్‌ జాన్సన్, నాథన్‌ ఎలిస్, సీన్‌ అబాట్, బెన్‌ డ్వార్షుయిస్‌ ఎంతవరకూ ప్రభావం చూపిస్తారనేది చూడాలి. వీరంతా దేశవాళీ టోర్నీల్లో నిలకడగానే రాణిస్తున్నా మెగాటోర్నీల్లో సత్తా చాటుతారా అనేది డౌటే.

అదే సమయంలో లెగ్‌స్పిన్నర్ ఆడమ్ జంపాపై అదనపు భారం పడింది. ఆసీస్ గత వన్డే ప్రపంచ కప్‌ను నెగ్గడంలో జంపా కూడా కీలకపాత్ర పోషించాడు. 11 మ్యాచుల్లో 23 వికెట్లు తీసి, అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. పాకిస్థాన్‌లోనూ జంపానే ఆసీస్ ప్రధాన అస్త్రం అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇంగ్లండ్, అఫ్గానిస్థాన్, దక్షిణాఫ్రికా జట్లలోని కుడి చేతివాటం బ్యాటర్లకు జంపా నుంచి ప్రమాదం తప్పదు. ఎందుకంటే కెరీర్‌లో 181 వికెట్లు తీసిన జంపా, 133 వికెట్లు కుడిచేతివాటం బ్యాటర్లవే. ఇదిలా ఉంటే 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఎడిషన్ లో ఆసీస్ నిరాశపరిచింది. రెండు మ్యాచ్ లలో ఫలితం తేలకపోగా… ఇంగ్లాండ్ చేతిలో ఓడిన కంగారూలు గ్రూప్ స్టేజ్ లోనే ఇంటిదారి పట్టారు. 2006, 2009లో వరుసగా రెండుసార్లు ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన ఆస్ట్రేలియా 16 ఏళ్ళ నిరీక్షణకు ముగింపు పలుకుతారా అనేది వేచి చూడాలి.