టీ20 క్రికెట్ లో భారత్ హవా, ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ గా అర్షదీప్
టీ ట్వంటీ క్రికెట్ లో వరల్డ్ ఛాంపియన్ గా ఉన్న టీమిండియా ఈ ఫార్మాట్ లో తన ఆధిపత్యాన్ని కంటిన్యూ చేస్తోంది. గత ఏడాది అద్భుతంగా రాణించి ప్రపంచ విజేతగా నిలిచిన భారత్ ఇప్పుడు ఐసీసీ వార్షిక అవార్డుల్లోనూ దుమ్మురేపుతోంది.
టీ ట్వంటీ క్రికెట్ లో వరల్డ్ ఛాంపియన్ గా ఉన్న టీమిండియా ఈ ఫార్మాట్ లో తన ఆధిపత్యాన్ని కంటిన్యూ చేస్తోంది. గత ఏడాది అద్భుతంగా రాణించి ప్రపంచ విజేతగా నిలిచిన భారత్ ఇప్పుడు ఐసీసీ వార్షిక అవార్డుల్లోనూ దుమ్మురేపుతోంది. ఇప్పటికే టీ ట్వంటీ టీమ్ ఆఫ్ ద ఇయర్ లో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు హార్థిక్ పాండ్యా, బుమ్రా, అర్షదీప్ చోటు దక్కించుకున్నారు. తాజాగా టీ ట్వంటీ ఫార్మాట్ వ్యక్తిగత విభాగాల్లోనూ మన హవా కొనసాగుతోంది. టీ ట్వంటీ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ గా భారత పేసర్ అర్షదీప్ సింగ్ ఎంపికయ్యాడు. ఈ అవార్డు కోసం భారత్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, జింబాబ్వే నుంచి ఒక్కొక్కరు చొప్పున నామినేట్ అయ్యారు. షార్ట్ ఫార్మాట్ లో గత ఏడాది అదరగొట్టిన అర్షదీప్ సింగ్… ట్రావిస్ హెడ్, సికందర్ రాజా, బాబర్ ఆజంలను వెనక్కి నెట్టి విజేతగా నిలిచాడు.
అర్షదీప్ చాలా కాలంగా టీ ట్వంటీ క్రికెట్ లో దుమ్మురేపుతున్నాడు. గత ఏడాది 18 మ్యాచ్‌ల్లో 13.50 సగటుతో 36 వికెట్లు తీసి అదర గొట్టాడు. ముఖ్యంగా 2024 టీ ట్వంటీ వరల్డ్ కప్ లో తనదైన ముద్ర వేశాడు. 8 మ్యాచ్‌ల్లో 7.16 ఎకానమీతో 17 వికెట్లు పడగొట్టాడు. ఈ మెగా టోర్నీలో కీలక పాత్ర పోషించిన అతడు అటు పవర్‌ప్లే, ఇటు డెత్ ఓవర్లలో ప్రత్యర్థి బ్యాటర్లకు చెమటలు పట్టించాడు. 2024 సంవత్సరాన్ని 7.49ఎకానమీ రేటుతో ముగించాడు. వరల్డ్ కప్ లో అమెరికాపై సంచలన బౌలింగ్ చేశాడు. 9 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. టీమిండియా తరపున టీ ట్వంటీల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గానూ అర్షదీప్ ఘనత సాధించాడు. ఇంగ్లాండ్ తో తొలి టీ ట్వంటీలో 2 వికెట్లు తీయడం ద్వారా ఈ మైలురాయి అందుకున్నాడు.
ఓ క్యాలెండర్ ఇయర్లో ప్రపంచంలో అర్ష్‌దీప్ కన్నా నలుగురు ఆటగాళ్లు మాత్రమే ఎక్కువ వికెట్లు పడగొట్టారు. వారిలో సౌదీ అరేబియాకు చెందిన ఉస్మాన్ నజీబ్ , శ్రీలంకకు చెందిన వనిందు హసరంగా , యూఏఈకు చెందిన జునైద్ సిద్ధిక్ , హాంకాంగ్‌కు చెందిన ఎహ్సాన్ ఖాన్ ముందున్నారు. కాగా ఐసీసీ వన్డే టీమ్ లో భారత ప్లేయర్లలో ఒక్కరికి కూడా చోటు లేకపోవడంతో నిరాశ చెందిన ఫ్యాన్స్ కు అర్షదీప్ అవార్డుతో ఖుషీగా ఉన్నారు.