ఆరోజే మెగాటోర్నీకి భారత్ , వార్మప్ మ్యాచ్ లేనట్టే
ఛాంపియన్స్ ట్రోఫీకి సమయం దగ్గర పడుతోంది. పాకిస్థాన్ ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కాబోతోంది. భారత జట్టు పాక్ వెళ్ళేందుకు నిరాకరించడంతో టోర్నీని హైబ్రిడ్ మోడల్ లో నిర్వహిస్తున్నారు.

ఛాంపియన్స్ ట్రోఫీకి సమయం దగ్గర పడుతోంది. పాకిస్థాన్ ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కాబోతోంది. భారత జట్టు పాక్ వెళ్ళేందుకు నిరాకరించడంతో టోర్నీని హైబ్రిడ్ మోడల్ లో నిర్వహిస్తున్నారు. దీని ప్రకారం మన మ్యాచ్ లకు దుబాయ్ ఆతిథ్యమిస్తోంది. ఈ మెగాటోర్నీ తొలి మ్యాచ్ లో భారత్ ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్ తో తలపడుతుంది. ఫిబ్రవరి 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తోనూ, మార్చి 2న న్యూజిలాండ్ తోనూ ఆడుతుంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ ఆడుతున్న భారత్ ఫిబ్రవరి 15న దుబాయ్ కు బయలుదేరుతుంది. అంటే ఇంగ్లాండ్ చివరి వన్డే ముగిసిన మూడురోజుల్లోనే మెగాటోర్నీకి రెడీ అవుతుంది. అయితే మెగాటోర్నీకి ముందు ప్రతీ జట్టు వార్మప్ మ్యాచ్ లు ఉండేలా షెడ్యూల్ ప్లాన్ చేస్తారు. కానీ టీమిండియా మాత్రం ఈ సారి వార్మప్ మ్యాచ్ లు ఆడడం లేదు. మొదటి మ్యాచ్ కు ముందు పూర్తిస్థాయి సమయం లేకపోవడమే దీనికి కారణం. మిగిలిన జట్లన్నీ పాకిస్తాన్ లో ఉండడం కారణంగా చెబుతున్నారు. ఎందుకంటే భారత్ మ్యాచ్ లు మాత్రమే దుబాయ్ లో జరుగుతుండగా.. మిగిలిన అన్ని మ్యాచ్ లో పాక్ గడ్డపైనే నిర్వహిస్తున్నారు. దీంతో మిగిలిన జట్లు వార్మప్ కోసం దుబాయ్ వచ్చి మళ్ళీ పాక్ వెళ్ళే క్రమంలో అలసిపోతారని భావిస్తున్నాయి.
దీంతో పాటు బంగ్లాదేశ్ తో మ్యాచ్ కు ముందు భారత జట్టు పూర్తిగా ప్రాక్టీస్ కే పరిమితం కావాలని నిర్ణయించుకుంది. అక్కడి పిచ్ లు ఇంచుమించు భారత్ తరహాలోనే ఉండడంతో వార్మప్ మ్యాచ్ లేకున్నా పెద్దగా ఇబ్బంది లేదన్నది టీమిండియా మేనేజ్ మెంట్ అభిప్రాయం. అందుకే నెట్ ప్రాక్టీస్ కే ప్రాధాన్యతనిస్తోంది. ఇదిలా ఉంటే మెగా టోర్నీ కోసం భారత జట్టు ఈ సారి బలమైన జట్టుగానే బరిలోకి దిగుతోంది. మొత్తం 8 దేశాలు ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆడనున్నాయి. 8 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ Aలో టీమిండియా, పాకిస్థాన్, కివీస్, బంగ్లాదేశ్ జట్లు, గ్రూప్ Bలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్తాన్ ఉన్నాయి. ప్రతి టీమ్ తమ గ్రూప్‌లోని ఇతర జట్లతో తలపడుతుంది. టాప్-2లో నిలిచిన జట్లు సెమీస్‌కు చేరుకుంటాయి. దాదాపు 8 ఏళ్ల తరువాత ఈ టోర్నీ జరగనుండగా.. 2013లో ధోనీ కెప్టెన్సీలో భారత్ ట్రోఫీని ముద్దాడింది.
చాంపియన్స్ ట్రోఫీ టీమ్‌లో రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ ఓపెనర్లుగా ఉన్నారు. వీళ్లతో పాటు సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, స్టైలిష్ ప్లేయర్లు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ టాపార్డర్‌లో ఉన్నారు. పేస్ ఆల్‌రౌండర్ కోటాలో హార్దిక్ పాండ్యా చోటు దక్కించుకున్నాడు. వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌ను తీసుకున్నారు. స్పిన్ ఆల్‌రౌండర్లుగా అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా ఎంపికయ్యారు. ప్రధాన స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌ను తీసుకున్నారు. అయితే స్టార్ పేసర్ బుమ్రాను ఎంపిక చేసినా అతను టోర్నీలో ఆడడంపై క్లారిటీ లేదు. లీగ్ మ్యాచ్ లకు బుమ్రా దూరమయ్యే ఛాన్స్ ఎక్కువగానే ఉంది. దీంతో మహ్మద్ షమి, అర్ష్‌దీప్ సింగ్‌తో పాటు హర్షిత్ రాణా జట్టులోకి వచ్చే ఛాన్సుంది. రాణా ఇప్పటికే ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్ గా ఎంపికయ్యాడు.