KS Bharath: ఇబ్బందిగా ఉన్నా ఇదే లాస్ట్ సిరీస్
భారత్, వెస్టిండీస్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో రెండోది, చివరి మ్యాచ్ ట్రినిడాడ్‌లోని పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జులై 20 నుంచి జరగనుంది. ఈ సిరీస్‌లో ప్రస్తుతం టీమిండియా 1-0 ఆధిక్యంలో ఉంది.
ఇలాంటి పరిస్థితుల్లో సిరీస్ విజయంపైనే టీమిండియా కన్ను వేసింది. టెస్టు సిరీస్‌లో భాగంగా భారత జట్టులో ఇద్దరు వికెట్ కీపర్లు చోటు దక్కించుకున్నారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు కేఎస్ భరత్, ఇషాన్ కిషన్. టెస్టు సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఇషాన్ కిషన్‌కు వికెట్ కీపర్‌గా ప్లేయింగ్ 11లో చోటు కల్పించాడు. అతను వికెట్ కీపర్‌గా బాగా రాణించినప్పటికీ, బ్యాటింగ్ చేయడానికి పెద్దగా అవకాశం రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో రెండో టెస్టులోనూ ఆడతాడని అంతా భావిస్తున్నారు. దీని కారణంగా కేఎస్ భరత్ మరోసారి ప్లేయింగ్ 11కు దూరంగా ఉండాల్సి రావొచ్చు. ఐపీఎల్ 2023కి ముందు బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో ఆడే అవకాశం కేఎస్ భరత్‌కు లభించింది.
ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో కేఎస్ భారత్ 8, 6, 23 , 17, 3, 44 మాత్రమే స్కోర్ చేయగలిగాడు. కేఎస్ భరత్ 4 మ్యాచ్‌ల్లో ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయలేకపోయాడు. భరత్ గత ఏడాది కాలంగా రిషబ్ పంత్‌కు బ్యాకప్‌గా తయారయ్యాడు. అంతకుముందు ఇండియా ఏ జట్టులో సాధారణ సభ్యుడిగా ఉన్నాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌లో ఆడే అవకాశం కూడా కేఎస్ భరత్‌కి దక్కింది. కెరీర్‌లో 5వ టెస్టు ఆడేందుకు వచ్చిన కేఎస్ భరత్ బ్యాటింగ్‌లో పూర్తిగా ఫ్లాప్ అయ్యాడు. ఈ నేపథ్యంలో భారత్ కు ఇదే చివరి టెస్టు సిరీస్ కాకపోయినా కూడా, మరో అవకాశం కోసం మాత్రం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూడక తప్పదేమో అనిపిస్తుంది.