Ireland: 200 కంటే తక్కువ కొట్టట్లేదు వాళ్ళతో 20 – 20 అంటే మాములుగా ఉండదు
ఐర్లాండ్.. అంతర్జాతీయ క్రికెట్లో చిన్న దేశమే అయినా చిచ్చరపిడుగులా ఆడుతోంది! మేటి జట్లకే సవాల్ విసురుతోంది. చక్కని ఆటగాళ్లు వారి సొంతం. అందుకే మరోసారి టీమ్‌ఇండియా అక్కడ పర్యటించేందుకు సిద్ధమైంది.
ఈ ఏడాది ఆఖర్లో టీమ్‌ఇండియా ఐర్లాండ్‌లో పర్యటించనుంది. మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. టీమ్‌ఇండియా, ఐర్లాండ్ టీ20 సిరీస్ షెడ్యూలు ఐసీసీ ప్రకటించింది. 2022లో టీమ్‌ఇండియా అక్కడ రెండు టీ20లు ఆడింది. మలహైడ్ వేదికగా తలపడింది. వీటికి వీక్షించేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలోనే హాజరయ్యారు. అందుకే ఈ సారి మూడు టీ20ల సిరీస్ ప్లాన్ చేశారు. ఆగస్టు 18-23 మధ్య సిరీస్ ఉంటుంది. జులై, ఆగస్టులో వెస్టిండీస్‌తో రెండు టెస్టుల, మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ ముగియగానే ఇది మొదలవుతుంది.
‘ఏడాదిలోపే టీమ్‌ఇండియా రెండోసారి ఐర్లాండ్‌కు వస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. 2022లో నిర్వహించిన రెండు మ్యాచులకు టికెట్లన్నీ అమ్ముడవ్వడం చూశాం. ఈసారి మూడు టీ20ల సిరీసు జరగబోతోంది. మరింత మంది అభిమానులు అదనంగా మరో మ్యాచ్ ఎంజాయ్ చేసేందుకు అవకాశం దొరికింది’ అని ఐర్లాండ్ క్రికెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వారెన్ డ్యూట్రామ్ అన్నారు. ‘మేం బీసీసీఐకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. టీమ్‌ఇండియా బిజీ షెడ్యూలులో ఐర్లాండ్‌ను చేర్చుకున్నందుకు సంతోషం. అభిమానులకు స్నేహపూర్వకమైన షెడ్యూలు రూపొందించినందుకు కృతజ్ఞతలు. శుక్రవారం, ఆదివారం మ్యాచులు నిర్వహించడం వల్ల ఎక్కువ మంది అభిమానులు స్టేడియానికి వస్తారు’ అని వారెన్ డ్యూట్రామ్ అన్నారు.