Ashes Series: ‘యాషెస్’ సిరీస్ ఎలా పుట్టింది జర్నలిస్ట్ కారణంగా కొనసాగుతున్న 150 ఏళ్ళ సమరం

ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ తర్వాత ప్రపంచ క్రికెట్ అభిమానులను అలరించడానికి మరో ప్రతిష్టాత్మక సిరీస్ శుక్రవారం నుంచి ఇంగ్లీషు గడ్డ మీద మొదలుకానుంది. సుమారు శతాబ్దంన్నర కాలంగా క్రికెట్‌లోని రెండు అగ్రశ్రేణి జట్లు యాషెస్ కోసం చేస్తున్న సమరం ఈరోజు ఇంగ్లాండ్ వేదికగా మరోసారి కనువిందు చేయనుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 17, 2023 | 01:31 PMLast Updated on: Jun 17, 2023 | 1:31 PM

Ashes Series Between Australia And England Test Match

డబ్ల్యూటీసీ ఫైనల్ గెలిచి ప్రపంచ ఛాంపియన్‌లుగా ఉన్న ఆస్ట్రేలియా.. ‘బజ్‌బాల్’ ఊపులో ఉన్న ఇంగ్లాండ్‌లు బర్మింగ్‌హోమ్ లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా తలపడనున్నాయి. ప్రతీ ఏడాది యాషెస్ సమయంలో ఇది చర్చలోకి వచ్చేదే అయినా టూకీగా చెప్పుకోవాలంటే 1882లో లండన్‌లోని ఓవల్ వేదికగా జరిగిన ఓ టెస్టులో ఆసీస్ చేతిలో ఇంగ్లీష్ జట్టు ఘోర పరాజయం పాలైంది. స్వదేశంలో ఇంగ్లాండ్‌కు ఇదే తొలి ఓటమి. ఈ ఓటమిని జీర్ణించుకోలేని నాటి ‘స్పోర్టింగ్ టైమ్స్’ రిపోర్టర్ రెజినాల్ట్ షిర్లీ.. ‘1882, ఆగస్టు 29న ఇంగ్లీష్ క్రికెట్ చచ్చిపోయింది. ఆ శరీరాన్ని కాల్చి బూడిదను ఆస్ట్రేలియాకు తీసుకెళ్లారు’ అని భారీ హెడ్డింగ్‌తో రాశాడు.

ఇది జరిగిన కొన్ని వారాలకు ఆసీస్‌లో పర్యటించిన ఇంగ్లాండ్ సారథి ఐవో బ్లై.. మట్టితో తయారుచేసిన చిన్న కప్పును ప్రదర్శించి ఇదే యాషెస్‌కు చిహ్నం.. దీనిని తిరిగి ఇంగ్లాండ్‌కు తీసుకొస్తామని శపథం చేశాడు. నాటి నుంచి దీనికి యాషెస్ అని పేరు వచ్చింది. యాషెస్ ఒరిజినల్ ట్రోఫీ ఎంసీసీలోనే ఉండగా గెలిచిన జట్టుకు అందజేసేది దాని డూప్లికేట్ వర్షన్. సుమారు 150 ఏండ్లుగా జరుగుతున్నా ఈ సిరీస్‌లో ఆసక్తి ఇసుమంతైనా తగ్గలేదు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఆటగాళ్లకు ఐసీసీ ట్రోఫీల కంటే యాషెస్ నెగ్గడమే ముఖ్యం. మిగతా టోర్నీలు, సిరీస్ లలో ఎలా ఆడినా యాషెస్ లో మాత్రం ఇరు జట్ల ఆటగాళ్లు 110 శాతం ప్రదర్శనను ఇస్తారు.

ఈ సిరీస్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్‌ను, స్టేడియానికి వచ్చే అభిమానులను చూస్తే ఇరు దేశాలకు ఈ వైరం మీద ఉన్న ఆసక్తేంటో అర్థం చేసుకోవచ్చు. యాషెస్‌‌లో ఇప్పటివరకు 72 సిరీస్ లు జరిగాయి. ఇందులో ప్రారంభంలో ఇంగ్లాండ్ వరుసగా 8 సిరీస్ లు గెలుచుకుని ఆధిపత్యం ప్రదర్శించింది. కానీ తర్వాత ఆసీస్.. ఇంగ్లాండ్ జైత్రయాత్రకు అడ్డుకట్ట వేసింది. మరీ ముఖ్యంగా 1902 తర్వాత ఆసీస్ ఆధిపత్యం పెరిగింది. ఇక ప్రపంచ క్రికెట్ దిగ్గజం సర్ డాన్ బ్రాడ్‌మన్ ఆగమనంతో ఆసీస్ ఆధిపత్యం పెరిగింది. మొత్తంగా ఇప్పటివరకూ జరిగిన 72 సిరీస్‌లలో కంగారూలు 34 గెలువగా ఇంగ్లాండ్ 32 సార్లు విజేతగా నిలిచింది. ఆరు సిరీస్ లు డ్రా అయ్యాయి.యాషెస్‌లో ఇప్పటివరకూ మొత్తంగా 356 టెస్టులు జరుగగా ఇందులో ఆసీస్ 150.. ఇంగ్లాండ్ 110 గెలిచింది. ఏకంగా 96 టెస్టులు డ్రా అయ్యాయి.