స్టార్ కల్చర్ కు ముగింపు పలకండి టీమిండియాపై అశ్విన్ కామెంట్స్
మన దేశంలో క్రికెట్ మతమైతే ఆటగాళ్ళను దేవుళ్ళులా చూస్తారు.. ఎక్కడకెళ్ళినా వారికి ఉండే ఫ్యాన్ ఫాలోయింగే వేరు... సమకాలిన క్రికెట్ లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు ఉన్నంత క్రేజ్ మరే ఆటగాడికీ లేదు..

మన దేశంలో క్రికెట్ మతమైతే ఆటగాళ్ళను దేవుళ్ళులా చూస్తారు.. ఎక్కడకెళ్ళినా వారికి ఉండే ఫ్యాన్ ఫాలోయింగే వేరు… సమకాలిన క్రికెట్ లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు ఉన్నంత క్రేజ్ మరే ఆటగాడికీ లేదు..గతంలో సచిన్, గంగూలీకి ఇలాంటి ఫాలోయింగ్ చూశాం… అయితే కోహ్లీ, రోహిత్ లతో ఇలాంటి స్టార్ కల్చర్ ను ఆపేయాలని మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సూచించాడు. టీమిండియాలో వ్యక్తి పూజపై అశ్విన్ హాట్ కామెంట్స్ చేశాడు. సూపర్‌స్టార్ కల్చర్‌ను ఎట్టిపరిస్థితుల్లో ప్రోత్సహించవద్దని బీసీసీఐని కూడా కోరాడు. క్రికెటర్లు.. యాక్టర్లు కాదని, వారిని సూపర్‌స్టార్స్‌లా ట్రీట్ చేయవద్దని సూచించాడు.విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ లాంటి ప్లేయర్లు మరో సెంచరీ సాధిస్తే అది చాలా సాధారణ విషయమని చెప్పాడు. ఈ అచీవ్ మెంట్స్ కంటే కూడా మన గోల్స్ పెద్దగా ఉండాలంటూ వ్యాఖ్యానించాడు.
భారత క్రికెట్‌లో వీలైనంత త్వరగా సూపర్ స్టార్ కల్చర్‌కు తెరదించాలన్నాడు. జట్టులో సూపర్ స్టార్‌డమ్, సూపర్ సెలెబ్రిటీస్ కల్చర్‌ను ఏ మాత్రం పోత్సహించవద్దని అభిప్రాయపడ్డాడు. మనమంతా క్రీడాకారులమనీ, సామన్య ప్రజల్లో ఒకరిగా ఉండాలనీ అశ్విన్ వ్యాఖ్యానించాడు. వ్యక్తిగత రికార్డులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వవద్దన్న అశ్విన్ గొప్ప లక్ష్యాలు పెట్టుకుని ఆడాలని, అభిమానులు కూడా అలాగే ఆలోచించాలన్నాడు. కాగా భారత జట్టులో స్టార్ కల్చర్ కు చెక్ పెట్టే విధంగానే బీసీసీఐ ఇటీవల నిర్ణయాలు తీసుకుంది. ఆటగాళ్ళపై పలు ఆంక్షలు విధించింది. కుటుంబసభ్యులను తీసుకెళ్ళే అంశంతో పాటు లగేజ్, టీమ్ బస్సులోనే ప్రయాణం వంటి వాటిపై కొత్త రూల్స్ తీసుకొచ్చింది. జూనియర్, సీనియర్ అనే తేడా లేకుండా ప్రతీ ప్లేయర్ ఈ రూల్స్ ను ఖచ్చితంగా ఫాలో కావాల్సిందేనని తేల్చి చెప్పింది.
ఇదిలా ఉంటే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం భారత జట్టులో చేసిన మార్పులపై అశ్విన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. 15 మంది జట్టులో ఐదుగురు స్పిన్నర్లు ఎందుకని ప్రశ్నించాడు. భారత సెలెక్టర్ల నిర్ణయం తనకు అర్థం కాలేదని చెప్పాడు. ఎక్స్‌ట్రా స్పిన్నర్ కోసం యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను జట్టులో నుంచి తప్పించడం సరికాదన్నాడు. దుబాయ్ పిచ్‌లు స్పిన్‌కు అనుకూలించడం లేదని, ఐఎల్ టీ20లో ఈ విషయం స్పష్టంగా కనిపించిందన్నాడు.