Asian Games: ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన టీమిండియా.. శ్రీలంకపై విజయం..

సోమవారం శ్రీలంకతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో 19 పరుగుల తేడాతో గెలుపొంది, స్వర్ణ పతకాలు సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్‌ ఇండియా.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. ఈ లక్ష్యఛేదనలో శ్రీలంక విఫలమైంది. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 97 పరుగులకు పరిమితమైంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 25, 2023 | 04:12 PMLast Updated on: Sep 25, 2023 | 4:12 PM

Asian Games 2023 India Wins Maiden Cricket Gold As Womens Team Beat Sri Lanka In Final

Asian Games: ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో భారత మహిళా క్రికెట్‌ జట్టు స్వర్ణ పతకం సాధించింది. సోమవారం శ్రీలంకతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో 19 పరుగుల తేడాతో గెలుపొంది, స్వర్ణ పతకాలు సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్‌ ఇండియా.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. ఈ లక్ష్యఛేదనలో శ్రీలంక విఫలమైంది. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 97 పరుగులకు పరిమితమైంది.

18 ఏళ్ల పేసర్ టిటాస్ సాధు.. చమరి ఆటపట్టు, అనుష్క సంజీవని, విష్మి గుణరత్నేలను వరుస ఓవర్లలో ఔట్‌ చేసి శ్రీలంకకు గట్టి షాక్‌ ఇచ్చింది. దీంతో శ్రీలంక 14 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అనంతరం హాసిని పెరీరా 25 పరుగులు, నీలాక్షి డి సిల్వా 23పరుగులు, ఓషది రణసింగ్ 19 పరుగులతో ఆదుకున్నా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు. రాజేశ్వరి గైక్వాడ్ 2, పూజా వస్త్రాకర్‌, దీప్తి శర్మ, దేవిక వైద్య తలో వికెట్ పడగొట్టారు. భారత బ్యాటర్లలో స్మృతీ మంధాన 46, జెమీమా రోడ్రిగ్స్‌ 42 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. వీరిద్దరు తప్ప మిగతా వారెవరూ రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. షఫాలీ వర్మ 9, రిచా ఘోష్ 9, హర్మన్ ప్రీత్‌ కౌర్ 2, పూజా వస్త్రాకర్ 2 పరుగులకే పెవిలియన్‌ చేరారు.

శ్రీలంక బౌలర్లు ఉదేశిక ప్రబోధని, సుగందిక కుమారి, ఇనోక రణవీర రెండేసి వికెట్లు తీశారు. ఆసియా క్రీడల్లో బరిలోకి దిగిన మొదటిసారే భారత జట్టు స్వర్ణ పతకం సాధించి సత్తాచాటింది. ఆసియా గేమ్స్‌లో నేడు షూటింగ్‍ టీమ్ భారత స్వర్ణ పతక ఖాతా తెరువగా.. ఇప్పుడు మహిళల క్రికెట్ జట్టు కూడా గోల్డ్ మెడల్ గెలిచింది. చైనాలోని హాంగ్జౌ వేదికగా ఆసియాగేమ్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే.