బ్యాడ్ లక్ అంటే మీదే ఢిల్లీ క్యాపిటల్స్ పై ఫ్యాన్స్ సింపతీ
మహిళల ఐపీఎల్ లో మరో సీజన్ ముగిసింది... టైటిల్ ఫేవరెట్స్ లో ముందున్న ఢిల్లీ క్యాపిటల్స్ తుది పోరులో చతికిలపడింది. ఒకసారి కాదు.

మహిళల ఐపీఎల్ లో మరో సీజన్ ముగిసింది… టైటిల్ ఫేవరెట్స్ లో ముందున్న ఢిల్లీ క్యాపిటల్స్ తుది పోరులో చతికిలపడింది. ఒకసారి కాదు. రెండు కాదు.. వరుసగా మూడోసారీ టైటిల్ పోరుకు అర్హత సాధించినా టైటిల్ మాత్రం దక్కలేదు. ఢిల్లీక్యాపిటల్స్ ఉమెన్స్ వరుసగా మూడుసీజన్లలో టాప్ లో నిలిచింది. అందరినీ ఓడించి మరీ ఫైనల్ కు వచ్చారు. కానీ ఏం లాభం వరుసగా మూడోసారి కూడా వారు ఓడిపోయారు. నిజానికి లీగ్ మ్యాచుల్లో అందరినీ బీభత్సంగా ఓడించేసింది ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్స్ టీం. ఇదే ముంబైని వరుసగా రెండు సార్లు లీగు మ్యాచుల్లో చిత్తు చేసింది. ఢిల్లీ కెప్టెన్ మంచి ఫాంలో ఉంది. ప్లేయర్లు అంతా బీభత్సంగా ఫైనల్ ముందు వరకూ ఆడారు. అయితే ఫైనల్ కు వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్ కు లక్ కలిసి రాలేదు. అంత బాగా ఆడిన వారంతా ఫైనల్లో మాత్రం నిరాశపరిచారు మంచి బ్యాటింగ్ లైనప్ ఉండి కూడా 150 రన్స్ టార్గెట్ ను ఛేజ్ చేయలేకపోయారు.
నిజానికి ఈ మ్యాచ్ లో ఎక్కువ సేపు ఢిల్లీదే పైచేయిగా కనిపించింది. ఆరంభంలోనే ముంబై వికెట్లు తీసినప్పటకీ హర్మన్ ప్రీత్ హాఫ్ సెంచరీతో ఆ జట్టు కోలుకుంది. ఛేజింగ్ లో షెఫాలీ వర్మ మెరుపు ఆరంభాన్నివ్వలేకపోవడం మైనస్ పాయింట్.. ఆరంభం నుండి వరుసగా వికెట్లను కోల్పోతూ వచ్చింది. ఈ సీజన్ ప్రారంభం నుండి భారీ టార్గెట్లను సునాయసంగా చేదించిన ఢిల్లీ.. ఫైనల్ లో మాత్రం లక్ష్య చేదనలో తడపడింది. ఢిల్లీ జట్టులో మారిజాన్ కాప్ , జమీమా రోడ్డ్రిగ్స్ , నీకీ ప్రసాద్ మినహా మిగతా బ్యాటర్లు ఎవ్వరు రాణించలేదు. కాప్ మెరుపు బ్యాటింగ్ తో మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠగా సాగింది. 18 బంతుల్లో 29 పరుగులు చేయాల్సి ఉన్నప్పుడు ఢిల్లీదే విజయంగా కనిపించింది. కానీ 18వ ఓవర్లోనే మ్యాచ్ మలుపు తిరిగింది. ఫామ్ లో ఉన్న కాప్ ను ముంబై ఆల్ రౌండర్ బ్రంట్ ఔట్ చేయడం, తర్వాతి బంతికే శిఖా పాండేను కూడా పెవిలియన్ కు పంపడంతో ఓటమి ఖాయమైంది.
2023 సీజన్ లో తొలిసారి ఫైనల్ కు చేరినప్పుడు కూడా ముంబై చేతిలో ఓటమి చవిచూసింది. అప్పటి ఫైనల్లో మొదట బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ 131 పరుగులే చేయగా.. ముంబై సునాయాసంగా ఛేదించింది. ఇక గత ఏడాది ఫైనల్లో ఢిల్లీ జోరుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్రేక్ వేసింది. ఫైనల్లో బ్యాటింగ్ వైఫల్యంతో ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 113 రన్స్ కే కుప్పకూలింది. చిన్న టార్గెట్ కావడంతో ఆర్సీబీ ఈజీగానే ఛేదించి టైటిల్ ఎగరేసుకుపోయింది. ఇప్పుడు కూడా మూడోసారి ఫైనల్ చేరి దాదాపు టైటిల్ గెలిచినట్టే అనుకున్నవేళ విజయానికి చేరువలో చతికిలపడింది. పైగా మహిళల క్రికెట్ లో మెగాస్టార్ గా పేరున్న మెగ్ లానింగ్ ప్రపంచ వ్యాప్తంగా పలు టైటిల్స్ గెలిచినా మహిళల ఐపీఎల్ లో మాత్రం ఢిల్లీని ఛాంపియన్ గా నిలపలేకపోతోంది.దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ కు ఖచ్చితంగా ఏదో దురదృష్టం వెంటాడిందని.. ఏమిటీ శాపం అంటూ అందరూ నిట్టూరుస్తున్నారు.