ఆ క్రికెటర్ తనతో పడుకోమన్నాడు, బంగర్ కుమార్తె సంచలన ఆరోపణలు
టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కుమార్తె అనయ బంగర్ సంచలన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచింది. లింగ మార్పిడి చికిత్సతో అబ్బాయి నుంచి అమ్మాయిగా మారిన అనయ బంగర్..

టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కుమార్తె అనయ బంగర్ సంచలన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచింది. లింగ మార్పిడి చికిత్సతో అబ్బాయి నుంచి అమ్మాయిగా మారిన అనయ బంగర్.. కొందరు క్రికెటర్లు తనకు నగ్న చిత్రాలు పంపి వేధించారని తెలిపింది. ఓ వెటరన్ క్రికెటర్ తనతో పడుకుంటావా అని అడిగాడని ఆరోపించింది. కుటుంబ సభ్యులకు దూరంగా లండన్‌లో ఉంటున్న అనయ బంగర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మొదట ఆర్యన్ గా పెరిగిన ఆమె.. అబ్బాయితో కలిసి ఏజ్ గ్రూప్ క్రికెట్ కూడా ఆడింది.
తాను తొమ్మిది ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అమ్మ దుస్తులు తీసుకుని వేసుకునేదాన్నని చెప్పుకొచ్చింది. అద్దంలో చూసుకుని తాను అమ్మాయిగా ఉండాలనుకుంటున్నానని భావించినట్టు చెప్పింది. క్రికెటర్ గా కెరీర్ మొదలుపెట్టే క్రమంలో ముషీర్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్, యశస్వి జైస్వాల్ లాంటి ప్రముఖ క్రికెటర్లతో కలిసి ఆడాననీ, కానీ నాన్న ఫేమస్ పర్సనాలిటీ కావడంతో ప్రైవసీ మెయింటేన్ చేయాల్సి వచ్చేదని గుర్తు చేసుకుంది. జెండర్ మార్పిడి తర్వాత కొంతమంది తనకు అండగా నిలిస్తే మరికొందరు క్రికెటర్లు లైైంగికంగా వేధించారని ఆరోపించింది. తనకు నగ్న చిత్రాలు పంపించారనీ, ముఖ్యంగా ఓ వ్యక్తి పక్కన కూర్చొని ఫొటోలు అడిగేవాడని తెలిపింది.
తన పరిస్థితి గురించి ఒక వెటరన్ క్రికెటర్‌కు చెబితే… అతనేమో కారులో వెళ్దాం, నీతో పడుకోవాలని ఉందని డైరెక్ట్ గానే చెప్పేవాడని అనయ వెల్లడించింది. తండ్రి సంజయ్ బంగర్ లాగే అనయ కూడా స్థానిక క్లబ్ క్రికెట్ లో ఇస్లాం జింఖానాకు ఆడింది. అంతే కాకుండా లెస్టర్‌షైర్‌లోని హింక్లీ క్రికెట్ క్లబ్‌కు కూడా ప్రాతినిథ్యం వహించింది. అయితే ఐసీసీ తీసుకున్న నిర్ణయంపై మాత్రం అనయ తీవ్ర నిరాశ వ్యక్తం చేసింది. ట్రాన్స్‌జెండర్ క్రీడాకారులను మహిళల క్రికెట్ ఆడటానికి అనుమతించబోమని ఐసీసీ ప్రకటించింది.
ట్రాన్స్ మహిళల కోసం క్రికెట్లో రూల్స్ తీసుకురావాలని అనయ డిమాండ్ చేసింది. అథ్లెట్లు కెరీర్, గుర్తింపు మధ్య నలిగిపోకుండా ఉండేలా నిబంధనలు తయారు చేయాలని ఆమె కోరింది.