బ్యాటర్ల ఫ్లాప్ షో, మెల్ బోర్న్ లో భారత్ ఓటమి
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ కు మరో ఓటమి ఎదురైంది. ఖచ్చితంగా డ్రా చేస్తారనుకున్న మ్యాచ్ ను చేజేతులారా ఓడిపోయింది. మళ్ళీ బ్యాటర్లు అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో పరాజయం పాలైంది. ఒకవిధంగా ఈ ఓటమి అనూహ్యమనే చెప్పాలి.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ కు మరో ఓటమి ఎదురైంది. ఖచ్చితంగా డ్రా చేస్తారనుకున్న మ్యాచ్ ను చేజేతులారా ఓడిపోయింది. మళ్ళీ బ్యాటర్లు అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో పరాజయం పాలైంది. ఒకవిధంగా ఈ ఓటమి అనూహ్యమనే చెప్పాలి. ఎందుకంటే రెండు సెషన్ల పాటు బాగా పోరాడిన మన జట్టు చివరి సెషన్ లో అనూహ్యంగా కుప్పకూలింది. యశస్వి జైస్వాల్ అద్భుతంగా పోరాడినా ఫలితం లేకపోయింది. ఆసీస్ ను రెండో ఓవర్లోనే ఆలౌట్ చేసి వెంటనే ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ఆరంభంలో నిలకడగా ఆడింది. అయితే కమ్మిన్స్ ఒకే ఓవర్లో రోహిత్ , రాహుల్ ను ఔట్ చేయడం కొంపముంచింది. కాసేపటికే కోహ్లీ కూడా వెనుదిరగడంతో జైశ్వాల్, పంత్ ఆదుకునే ప్రయత్నం చేశారు. తొలి ఇన్నింగ్స్ లో రనౌటైన జైశ్వాల్ ఈ సారి నిలకడగా ఆడుతూ పంత్ తో కలిసి పార్టనర్ షిప్ నిర్మించాడు.
రిషబ్ పంత్ కూడా క్రీజుల్లో ఉన్నంతసేపు నిలకడగా ఆడాడు. అయితే, మూడో సెషన్‍లో పార్ట్ టైమ్ స్పిన్నర్ ట్రావిస్ హెడ్ బౌలింగ్‍లో పంత్ అనవసరమైన షాట్‍కు వెళ్లి ఔటయ్యాడు. డ్రా కోసం నిదానంగా ఆడాల్సిన దశలో బంతిని గాలిలోకి బాది క్యాచౌట్ అయ్యాడు. దీంతో ఆసీస్ గెలుపు ఆశలు మళ్లీ చిగురించాయి. తర్వాత జైస్వాల్ ఔట్‍పై థర్డ్ అంపైర్ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నాడు. స్నికో మీటర్ లో ఆధారం లేకున్నా బంతి యాంగిల్ ను చూసి ఔట్ ప్రకటించడం దుమారాన్ని రేపింది. ఇక్కడ నుంచి భారత్ వరసుగా వికెట్లు చేజార్చుకుంది.
ఆకాశ్ దీప్ , వాషింగ్టన్ సుందర్ పోరాడినా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. క్లోజ్ ఫీల్టింగ్ సెటప్ తో భారత్ బ్యాటర్లపై ఒత్తిడి పెంచిన కంగారూలు సక్సెస్ అయ్యారు. చివరి సెషన్‍లో 21.3 ఓవర్లలో 34 పరుగుల వ్యవధిలో టీమిండియా ఏడు వికెట్లు కోల్పోయింది. టీ విరామం వరకు మూడు వికెట్లే కోల్పోయి పటిష్టంగా ఉన్న భారత్.. చివరి సెషన్‍లో ఆఖరు 34 పరుగులకు ఏడు వికెట్లు చేజార్చుకొని 155 పరుగులకే ఆలౌటైంది. రెండో సెషన్‍లో వికెట్ పడకుండా ఆడి డ్రా ఖాయమనుకున్న దశ నుంచి ఓటమి పాలైంది. ఈ గెలుపుతో ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ ఓటమితో సిరీస్ లో వెనుకబడడమే కాదు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు చేరే అవకాశాలను కూడా భారత్ మరింత క్లిష్టం చేసుకుంది. సిరీస్ లో చివరి మ్యాచ్ సిడ్నీ వేదికగా జనవరి 3 నుంచి మొదలవుతుంది.