ఐపీఎల్ మెగా వేలం వీళ్ళు అమ్ముడవడం కష్టమే
ఐపీఎల్ 18వ సీజన్ కు ముందు ఆటగాళ్ళ మెగా వేలం జరగనుంది. ఇటీవలే ఫ్రాంచైజీ ఓనర్లతో బీసీసీఐ సమావేశం నిర్వహించి పలు కీలక అంశాలపై కూడా చర్చించింది. మెగా వేలం ఖాయంగా జరగనున్న నేపథ్యంలో పలువురు ఆటగాళ్ళు తమ పాత ఫ్రాంచైజీలను వీడేందుకు సిద్ధమవుతున్నారు. అటు అన్ని ఫ్రాంచైజీలు కూడా తమ జట్ల కూర్పుపై ఫోకస్ పెట్టాయి. ఇదిలా ఉంటే పలువురు ప్లేయర్లకు మాత్రం మెగా వేలంలో షాక్ తగలడం ఖాయంగా కనిపిస్తోంది. కొన్ని అంచనాల ప్రకారం రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్న ఆటగాళ్ళు వేలంలో అమ్ముడుపోకుండా మిగిలిపోతారని భావిస్తున్నారు. వారిలో భారత ఆటగాళ్ళు, కొందరు విదేశీ స్టార్స్ కూడా ఉంటారని అంచనా..
పంజాబ కింగ్స్ కెప్టెన్ గా ఉన్న శిఖర్ ధావన్ ఈ సీజన్ లో అమ్ముడవడం డౌటేనని చెప్పొచ్చు. భారత జాతీయ జట్టుకు దూరమైన ధావన్ ప్రస్తుతం ఐపీఎల్ లో మాత్రమే కనిపిస్తున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో కూడా గాయాలతో ఇబ్బందిపడి చాలా మ్యాచ్ లు ఆడలేదు. దీనికి తోడు చెప్పుకోదగిన ఫామ్ లో లేకపోవడంతో పంజాబ్ కింగ్స్ అతన్ని రిటైన్ చేసుకునే అవకాశం లేదు. అలాగే వేలంలో కూడా మిగిలిన ఫ్రాంచైజీలు పట్టించుకునే పరిస్థితి లేదు.
విదేశీ ఆటగాళ్ళలో కేన్ విలియమ్సన్ , స్టీవ్ స్మిత్ అన్ సోల్డ్ ప్లేయర్స్ జాబితాలో ఉంటారని భావిస్తున్నారు. న్యూజిలాండ్ క్రికెట్ టీమ్ కు స్టార్ ప్లేయర్ గా, కెప్టెన్ గా ఎన్నో రికార్డులున్న విలియమ్సన్ గాయాలతో ఇబ్బందిపడుతున్నాడు. గతంలో హైదరాబాద్ టీమ్ కు, ఈ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ జట్టులో ఉన్న విలియమ్సన్ కు బిడ్ దక్కడం కష్టమే. అలాగే ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కూడా అమ్ముడుపోవడం అనుమానంగానే ఉంది. గత వేలంలోనే అన్ సోల్డ్ గా మిగిలిపోయిన స్మిత్ ను ఈ సారి కూడా ఫ్రాంచైజీలు పట్టించుకోకపోవచ్చు. ఇటీవల వేరే టీ ట్వంటీ లీగ్స్ లో అదరగొట్టినప్పటకీ ఐపీఎల్ వేలంలో మాత్రం అతనికి నిరాశే మిగులుతుందని పలువురు అంచనా వేస్తున్నారు.