BCCI: ఎవరికి ఎక్కువ జీతం..? ఆటగాళ్లకు అందుతున్న వేతనాలు ఇవే..!
దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్లేయర్లను బీసీసీఐ.. ఎ+, ఎ, బీ, సీ కేటగిరీలుగా విభజించింది. అనుభవం, ఆడే మ్యాచ్‌లు, ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా ఈ జాబితాను సిద్ధం చేశారు. మూడు ఫార్మాట్లలో జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారికి ఎ+ కేటగిరీలో చోటు కల్పించారు.
BCCI: ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ బోర్డుగా గుర్తింపు సాధించిన బీసీసీఐ.. తమ ఆటగాళ్లకు అదే స్థాయిలో వేతనాలు ఇస్తూ ప్రత్యేకత చాటుకుంటోంది. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్లేయర్లను బీసీసీఐ.. ఎ+, ఎ, బీ, సీ కేటగిరీలుగా విభజించింది. అనుభవం, ఆడే మ్యాచ్‌లు, ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా ఈ జాబితాను సిద్ధం చేశారు. మూడు ఫార్మాట్లలో జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారికి ఎ+ కేటగిరీలో చోటు కల్పించారు.
ఇందులో భాగంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా ఎ+లో చోటు దక్కించుకున్నారు. అంటే ఈ ముగ్గురికీ ఏటా 7 కోట్ల రూపాయలు దక్కనున్నాయి. రవీంద్ర జడేజా, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, మహమ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్ ‘ఎ’ కేటగిరీలో ఉండటంతో వారికి ఏడాదికి రూ.5 కోట్లు అందుతున్నాయి. ‘బి’ గ్రూప్‌లో ఉన్న చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, శ్రేయస్ అయ్యర్, మహమ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ రూ.3 కోట్లు సొంతం చేసుకుంటుండగా.. ‘సి’ కేటగిరీలో ఉన్న శిఖర్ ధవన్, ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, శుభ్‌మన్ గిల్, హనుమ విహారి, యుజ్వేంద్ర చాహల్, వృద్ధిమాన్ సాహా, సూర్యకుమార్ యాదవ్, మయాంక్ అగర్వాల్, దీపక్ చాహర్ కోటి రూపాయలు దక్కించుకుంటున్నారు.
అయితే కాంట్రాక్ట్‌లో చోటు దక్కించుకున్న ఆటగాళ్లు ఓ టెస్టు మ్యాచ్ ఆడితే రూ. 15 లక్షలు, వన్డేకు రూ.6 లక్షలు, టీ20కి రూ.3 లక్షలు అందుకుంటున్నారు. ప్లేయర్ల మ్యాచ్ ఫీజుల్లో కేటగిరీతో సంబంధం లేకున్నా.. అందరి కంటే అత్యధికంగా రోహిత్ శర్మ మ్యాచ్ ఫీజు అందుకుంటున్నాడు. మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రోహిత్ అందరికంటే అదనంగా 25 నుంచి 50 శాతం మ్యాచ్ ఫీజు తీసుకుంటున్నాడు. దీంతో రోహిత్‌కు ఒక్క టెస్టు మ్యాచ్‌కు రూ.18 లక్షలు, వన్డేకు రూ.7.2 లక్షలు, టీ20కి రూ.3.6 లక్షలు దక్కుతున్నాయి. ప్రస్తుతం జట్టులో కొనసాగుతున్న ప్లేయర్లతో పాటు మహిళల జట్టు ప్లేయర్లు, అండర్-19 జట్టు సభ్యులు, దేశవాళీల్లో ఆడుతున్న ప్లేయర్లు.. ఆటకు వీడ్కోలు పలికిన మాజీ ఆటగాళ్లకు కూడా భారీగా జీతాలు ఇస్తున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. ఇవన్నీ 2022-23 సీజన్‌కు సంబంధించిన లెక్కలు కాగా.. తాజా కాంట్రాక్ట్‌లో పలువురు ప్లేయర్ల కేటగిరీలు తారుమారు అయ్యే అవకాశాలు లేకపోలేదు.