ఆటగాళ్ళకు బీసీసీఐ సర్ ప్రైజ్.. గిఫ్ట్ గా డైమండ్ రింగ్స్

ప్రపంచ క్రికెట్ లో బీసీసీఐకి వచ్చిన ఆదాయం మరే బోర్డుకూ రాదు... అందుకే ఆటగాళ్ళకు అందించే మ్యాచ్ ఫీజులే కాదు మెగాటోర్నీలు గెలిచినప్పుడు ఇచ్చే నజరానాలు కూడా భారీగానే ఉంటాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 8, 2025 | 04:17 PMLast Updated on: Feb 08, 2025 | 4:17 PM

Bcci Surprises Players With Diamond Rings As Gifts

ప్రపంచ క్రికెట్ లో బీసీసీఐకి వచ్చిన ఆదాయం మరే బోర్డుకూ రాదు… అందుకే ఆటగాళ్ళకు అందించే మ్యాచ్ ఫీజులే కాదు మెగాటోర్నీలు గెలిచినప్పుడు ఇచ్చే నజరానాలు కూడా భారీగానే ఉంటాయి. గత ఏడాది టీ ట్వంటీ ప్రపంచకప్ గెలిచి విశ్వవిజేతగా నిలిచిన టీమిండియాకు బీసీసీఐ భారీగానే ప్రైజ్ మనీ ప్రకటించింది. ఏకంగా 125 కోట్ల రూపాయలను నజరానాగా అందజేసింది. తాజాగా ఈ నజరానాకు తోడు మరో ఖరీదైన గిఫ్ట్స్ కూడా ఇచ్చినట్టు తెలిసింది. జట్టులోని ప్రతీ ఆటగాడికి అత్యంత విలువైన డైమండ్ రింగ్స్ ను ప్రదానం చేసింది. అమెరికన్ స్పోర్ట్స్ లీగ్స్ అయిన ఎన్‌బీఏ, ఎన్ఎఫ్ఎల్ వంటి వాటి నుంచి స్ఫూర్తి పొంది ఈ నిర్ణయం తీసుకుంది.

రీసెంట్ గా బీసీసీఐ.. నమాన్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలోనే ప్లేయర్స్ కు ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ వజ్రపు ఉంగరాలను ప్రదానం చేసింది. తాజాగా ఈ ప్రదానోత్సవానికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ప్రత్యేకంగా విడుదల చేసింది. టీ20లో అద్భుతమైన ప్రదర్శన చేసిన టీమిండియాకు ఛాంపియన్స్ రింగ్ ను ప్రదానం చేస్తున్నాం. ఈ వజ్రాలు శాశ్వతంగా ఉండవచ్చు, కానీ ఈ విజయం కచ్చితంగా బిలియన్ల మంది హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఈ మధుర జ్ఞాపకాలు ఎప్పటికీ మనతోనే ఉంటాయంటూ బీసీసీఐ పేర్కొంది

ఈ ఉంగరాలను వజ్రాలు, బంగారంతో రూపొందించారు. అలానే ఈ ఉంగరంపై భాగంలో టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్‌ ఇండియా అనే అక్షరాలను లిఖించారు. దీంతో పాటే అశోక చక్రం గుర్తు కూడా వేశారు. ఇంకా ఉంగరానికి రెండు వైపులా ఆటగాళ్ల పేర్లు, జెర్సీ నంబర్లతో పాటు భారత జట్టు ఎంత తేడాతో ఏ ప్రత్యర్థులపై విజయాలు సాధించిందో కూడా ముద్రించారు. వీడియోలో రోహిత్ శర్మ, బుమ్రా, రిషభ్ పంత్, సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య ఈ ఉంగరాలను తీసుకున్నట్టు వీడియో ద్వారా తెలుస్తోంది. టీ20 వరల్డ్ కప్‌ ఫైనల్లో సౌతాఫ్రికాపై 7 పరుగుల తేడాతో భారత జట్టు విజయం సాధించి టైటిల్ ను ముద్దాడింది. అప్పుడు కోట్ల వర్షం కురిపించిన ఆటగాళ్లపై కనకవర్షం కురిపించిన బోర్డు.. తాజాగా వజ్రపు ఉంగరాలతో మరోసారి ఘనంగా సత్కరించింది. బీసీసీఐ తన రేంజ్ కు తగ్గట్టే కానుకలు ఇచ్చిందంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.