కోహ్లీ దెబ్బకు దిగొచ్చిన బీసీసీఐ ఫ్యామిలీ కండీషన్లపై యూటర్న్
ఒకవైపు ఐపీఎల్ కోసం రెడీ అవుతున్న బీసీసీఐకి సీనియర్ క్రికెటర్ల అసంతృప్తి దిమ్మతిరిగే షాకిచ్చింది. ఆస్ట్రేలియా టూర్ లో వైఫల్యం తర్వాత ప్రక్షాళణ అంటూ కొన్ని కొత్త రూల్స్ ను తీసుకొచ్చింది.

ఒకవైపు ఐపీఎల్ కోసం రెడీ అవుతున్న బీసీసీఐకి సీనియర్ క్రికెటర్ల అసంతృప్తి దిమ్మతిరిగే షాకిచ్చింది. ఆస్ట్రేలియా టూర్ లో వైఫల్యం తర్వాత ప్రక్షాళణ అంటూ కొన్ని కొత్త రూల్స్ ను తీసుకొచ్చింది. 10 పాయింట్లతో ఆటగాళ్ళపై కఠిన ఆంక్షలే విధించింది. ఈ రూల్స్‌లో ఆటగాళ్లతో కుటుంబ సభ్యులను అనుమతించడంపై ఆంక్షలు విధించడం కూడా ఉంది. సుదీర్ఘమైన విదేశీ పర్యటనలకు మాత్రమే కుటుంబ సభ్యులను రెండు వారాలే అనుమతించాలని పేర్కొంది. తక్కువ వ్యవధి పర్యటనలకు కుటుంబ సభ్యులు అవసరం లేదని స్పష్టం చేసింది. టీమిండియా విదేశీ పర్యటనలో 45 రోజులకు పైగా ఉండే సమయంలో ఆటగాళ్లకు వారి భాగస్వాములు, పిల్లలు ఒకసారి, రెండు వారాల పాటు కలిసి ఉండే అవకాశం ఉంటుంది. అయితే మిగిలిన రూల్స్ విషయంలో ఎలా ఉన్నా ఈ ఫ్యామిలీ కండీషన్లపై సీనియర్లు భగ్గుమన్నారు. రోహిత్ , కోహ్లీతో సహా పలువురు సీనియర్ ఆటగాళ్ళు బీసీసీఐపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు.
విరాట్ కోహ్లీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు లేకుండా గదిలో ఒంటరిగా కూర్చోని ఏడవాలా అంటూ ఇచ్చిపడేశాడు. కఠినమైన పరిస్థితులు వస్తే కుటుంబ సభ్యులను కలిస్తే ఎంతో హాయిగా ఉంటుందన్నాడు వారితో గడిపే సమయాన్ని అసలు నేను వదులుకోలేనని కోహ్లీ తేల్చేశాడు. అటు పలువురు మాజీ క్రికెటర్లు సైతం కోహ్లీ కామెంట్స్ కు సపోర్ట్ గా నిలిచారు. కోహ్లీకి దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ అండగా నిలిచారు. ఆటగాళ్లతో కుటుంబ సభ్యులను అనుమతించాలని అభిప్రాయపడ్డారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న కపిల్ దేవ్ ముందు కోహ్లీ వ్యాఖ్యలను ప్రస్తావించగా.. అతనికి అండగా మాట్లాడాడు. తమ కాలంలో క్రికెట్, కుటుంబానికి సమ ప్రాధాన్యం ఇచ్చేవారిమని గుర్తు చేసుకున్నారు.
తాజా పరిణామాలతో బీసీసీఐ వెనక్కి తగ్గింది. తాము తీసుకున్న నిర్ణయాన్ని సవరించాలని చూస్తున్నట్లు సమాచారం. విదేశీ పర్యటనలో తమ కుటుంబ సభ్యులు ఎక్కువకాలం తమతో పాటు ఉండాలనుకునే ఆటగాళ్లు బీసీసీఐ నుంచి అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బోర్డు తగిన నిర్ణయం తీసుకుంటుందని బీసీసీఐ ఉన్నతాధికారి చెప్పారు. ఫ్యామిలీ పాలసీ మీద పునరాలోచనలు చేస్తున్నారని వెల్లడించారు. ఆటగాళ్లను కుటుంబ సభ్యులతో ఎక్కువ కాలం ఉండేందుకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారట. అయితే దీనికి కోచ్ గంభీర్, కెప్టెన్‌తో పాటు జీఎం ఆపరేషన్స్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుందట. ఈ రూల్ గురించి బోర్డు పెద్దలు మరింత లోతుగా ఆలోచిస్తున్నారని సమాచారం. కాగా ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ వంటి ఆటగాళ్ళు తమ కుటుంబాలతో దుబాయ్‌లో ఉన్నప్పటికీ, జట్టుతో కలిసి హోటల్‌లో బస చేయలేదు. వారి బసకు సంబంధించిన ఖర్చులను బోర్డు భరించలేదు, ఆటగాళ్లే సొంతంగా చెల్లించుకున్నారు.