Ravichandran Ashwin: రోహిత్ ఓటు ఎవరికి? నేడే ఫైనల్ సెలెక్షన్స్..!
భారత్ జట్టులో ఒకరి ఎంపికపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. ఇప్పటికే భారత్ 15 మందితో కూడిన స్క్వాడ్‌ను ప్రపంచ కప్ కోసం ప్రకటించిన సంగతి తెలిసిందే.
Ravichandran Ashwin: వరల్డ్ కప్ సందడి షురూ అయింది. కొన్ని జట్లు ఇప్పటికే భారత్‌కు చేరుకున్నాయి. మరో వారం రోజుల్లో తొలి మ్యాచ్ జరగనుంది. శుక్రవారం నుంచి వార్మప్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే, అంతకంటే ముందు ముఖ్యమైన ప్రక్రియకు గడువు నేటితో తీరిపోనుంది. అదే ప్రపంచకప్ కోసం బరిలోకి దిగే స్క్వాడ్‌లో మార్పులు చేసుకొనే ఛాన్స్‌కు ఇవాళ లాస్ట్ డేట్. భారత్ జట్టులో ఒకరి ఎంపికపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది.
ఇప్పటికే భారత్ 15 మందితో కూడిన స్క్వాడ్‌ను ప్రపంచ కప్ కోసం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆసియా కప్ ఫైనల్‌లో అక్షర్ పటేల్ గాయపడటంతోపాటు శ్రేయస్ అయ్యర్ ఫామ్‌పై కూడా అనుమానాలున్నాయి. కానీ, ఇప్పుడు శ్రేయస్ ఫామ్ అందిపుచ్చుకున్నాడు. ఇక అక్షర్ గాయం నుంచి కోలుకోకపోవడంతో ఆసీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లోనూ ఆడలేదు. ఇప్పటికీ అతడు ఫిట్‌నెస్ అందుకోవడం కష్టమే అనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో అక్షర్ స్థానాన్ని మరొకరితో భర్తీ చేయాల్సి ఉంది. దాని కోసం అశ్విన్, సుందర్ సిద్ధంగా ఉన్నారు. వారు ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో ఆడారు. ఇద్దరూ ఆల్‌రౌండర్లే. కానీ అశ్విన్ అనుభవజ్ఞుడు. దాదాపు ఏడాదిన్నర తర్వాత వన్డేల్లోకి అడుగు పెట్టిన అశ్విన్ ఎలా ఆడతాడు? అనే అనుమానం తొలుత అందరిలో నెలకొంది.
కానీ, వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ తొలి రెండు వన్డేల్లో నాలుగు వికెట్లు తీసి ఆశ్చర్యపరిచాడు. బ్యాటర్లను నియంత్రించాడు. అంతేకాదు.. గతంలో మెరుగైన బ్యాటింగ్ రికార్డు ఉండటంతో అశ్విన్ ఎంపిక లాంఛనమే అని అనుకున్నారు. అనూహ్యంగా ఆసీస్‌తో మూడో వన్డేలో అశ్విన్‌కు విశ్రాంతినిచ్చి వాషింగ్టన్ సుందర్‌ను బరిలోకి దింపింది. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై ఆసీస్ భారీ స్కోరు చేసింది. అయినా, సుందర్ మాత్రం బౌలింగ్‌లో వికెట్ తీయకపోయినా కట్టుదిట్టంగానే బంతులను సంధించాడు. ఈ క్రమంలోనే అభిమానుల్లో ఉత్కంఠ తారస్థాయికి చేరింది.
అయితే, మూడో మ్యాచ్ తర్వాత వాషింగ్టన్ సుందర్ ఆసియా గేమ్స్‌లో పాల్గొనేందుకు చైనాకు వెళ్తాడు. సీనియారిటీకి చోటు కల్పించాలని భావిస్తే మాత్రం రవిచంద్రన్ అశ్విన్ వైపే టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్ మొగ్గుచూపే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకుల అంచనా.