24 గంటల్లో తుది నిర్ణయం.. బుమ్రాపై తేల్చేయనున్న బీసీసీఐ
ఛాంపియన్స్ ట్రోఫీకి కౌంట్ డౌన్ మొదలైంది. మరో 11 రోజుల్లో మెగాటోర్నీ షురూ కానుంది. ఈ టోర్నీలో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్న టీమిండియాను మాత్రం ఆటగాళ్ళ గాయాలు, పేలవ ఫామ్ వెంటాడుతున్నాయి.

ఛాంపియన్స్ ట్రోఫీకి కౌంట్ డౌన్ మొదలైంది. మరో 11 రోజుల్లో మెగాటోర్నీ షురూ కానుంది. ఈ టోర్నీలో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్న టీమిండియాను మాత్రం ఆటగాళ్ళ గాయాలు, పేలవ ఫామ్ వెంటాడుతున్నాయి. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ మెగా టోర్నీలో ఆడడంపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ సస్పెన్స్ కు మరో 24 గంటల్లో తెరపడే అవకాశాలున్నాయి. ఆస్ట్రేలియా పర్యటన సమయంలో బుమ్రా వెన్నునొప్పితో ఇబ్బంది పడ్డాడు. ఈ గాయం కారణంగా ఐదో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయలేక మధ్యలోనే తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో అతడి ఫిట్‌నెస్‌పై ఆందోళన పెరిగింది.
ఇంగ్లండ్‌తో జరిగిన తొలి రెండు టెస్టులకు అతడిని జట్టులోకి ఎంపిక చేయలేదు.
కానీ మూడో టెస్టులో చోటు కల్పించిన మేనేజ్‌మెంట్.. ఆ తర్వాత అతడిని జాతీయ క్రికెట్ అకాడమీకి పంపించింది. అక్కడ అతడి ఫిట్‌నెస్ స్థాయిని పరీక్షించి, గాయంపై పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. దీంతో స్కానింగ్‌తో పాటు ఇతర ఫిట్‌నెస్ పరీక్షలు పూర్తి చేసుకున్నాడు. బీసీసీఐ మెడికల్ టీమ్ ఆధ్వర్యంలో ఈ టెస్టులు నిర్వహించినట్లు సమాచారం. జనవరిలో నిర్వహించిన స్కానింగ్‌తో తాజా స్కానింగ్‌ను పోల్చి చూస్తున్నట్లు తెలుస్తోంది. న్యూజిలాండ్‌కు చెందిన ప్రఖ్యాత స్పోర్ట్స్ ఫిజియో రోవన్ స్కౌటెన్ ఈ నివేదికలను పరిశీలించి, బుమ్రా గాయం పూర్తిగా తగ్గిందా లేదా అనే విషయంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
అయితే జట్టులో మార్పులు చేయాల్సిన పరిస్థితి ఉంటే ఫిబ్రవరి 12లోగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ బుమ్రా వెన్ను గాయం పూర్తిగా తగ్గకపోతే, మేనేజ్‌మెంట్ అతడిని బరిలోకి దింపే రిస్క్ తీసుకోకపోవచ్చు. ఒకవేళ బుమ్రా ఫిట్ గా లేకుంటే మాత్రం రీప్లేస్ మెంట్ గా ఎవరికి చోటు దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. అతడి స్థానాన్ని పేసర్ లేదా స్పిన్నర్‌తో భర్తీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే హర్షిత్ రాణాను ట్రావెల్ రిజర్వ్‌గా బీసీసీఐ ఎంపిక చేసింది. అయితే పరిస్థితిని బట్టి అతడిని ప్రధాన జట్టులోకి తీసుకోవచ్చు. లేదంటే ఇంగ్లాండ్ తో సిరీస్ కు బుమ్రా స్థానంలోనే ఎంపికైన వరుణ్ చక్రవర్తిని ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో కూడా కొనసాగించే ఛాన్సుంది.