మీ ఇష్టమొచ్చినట్టు ఇచ్చేయొద్దు ఐపీఎల్ గ్రౌండ్స్ పై బీసీసీఐ వార్నింగ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ కు ఇప్పటికే సన్నాహాలు మొదలయ్యాయి. ఫ్రాంచైజీలు తమకు అందుబాటులో ఉన్న ఆటగాళ్ళతో ప్రాక్టీస్ క్యాంప్స్ కూడా నిర్వహిస్తుండగా.. అటు బీసీసీఐ తమ ఏర్పాట్లలో నిమగ్నమైంది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ కు ఇప్పటికే సన్నాహాలు మొదలయ్యాయి. ఫ్రాంచైజీలు తమకు అందుబాటులో ఉన్న ఆటగాళ్ళతో ప్రాక్టీస్ క్యాంప్స్ కూడా నిర్వహిస్తుండగా.. అటు బీసీసీఐ తమ ఏర్పాట్లలో నిమగ్నమైంది. అయితే ఐపీఎల్ జట్లతో పాటు అన్ని రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లకు బీసీసీఐ భారీ షాకిచ్చింది. ఐపీఎల్ కోసం కేటాయించిన మైదానాలను.. ఇతర మ్యాచ్ లకు అందుబాటులో ఉంచకూడదని రాష్ట్ర సంఘాలను ఆదేశించింది. ఈ మేరకు బీసీసీఐ రాష్ట్ర క్రికెట్ సంఘాలకు మెయిల్ పంపింది. ఐపీఎల్ మ్యాచ్ లు నిర్వహించే మైదానాలలో ఇతర లీగ్ లు జరగకుండా ఇప్పటినుంచే చూసుకోవాలని బీసీసీఐ ఆదేశించింది. ఇతర లీగ్ లకు సంబంధించిన మ్యాచ్ లు జరిపితే.. ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఆ పిచ్ లు నాశనం అవుతాయనే ఉద్దేశంలో భాగంగా బీసీసీఐ ఈ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇలా ఉప్పల్, చిన్నస్వామి స్టేడియం, చెన్నై చెపాక్, ముంబైలోని ఎంసీఏ లాంటి స్టేడియాలకు ఆదేశాలు జారీ చేసింది.
ఐపీఎల్ కోసం కేటాయించిన మైదానాలను లెజెండ్స్ లీగ్, సెలబ్రిటీ క్రికెట్ లీగ్ వంటి వాటికి అందుబాటులో ఉంచకూడదని బీసీసీఐ రాష్ట్ర సంఘాలను హెచ్చరించింది. అటు ఐపీఎల్ జట్ల ప్రాక్టీస్ లకు కూడా పిచ్ లు ఇవ్వొద్దని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. మైదానం, అవుట్ ఫీల్డ్ శుభ్రంగా ఉండాలని బీసీసీఐ ఈ-మెయిల్‌లో పేర్కొంది. అయితే, ఇప్పటికే షెడ్యూల్ చేసిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లకు ప్రధాన స్క్వేర్, అవుట్‌ఫీల్డ్‌ను ఉపయోగించుకోవచ్చని బీసీసీఐ తెలిపింది. అటు ఐపీఎల్ జట్లకు కూడా బీసీసీఐ నిర్ణయం షాక్ గానే చెప్పాలి. ఎందుకంటే లీగ్ ప్రారంభానికి నెల రోజుల ముందు నుంచే తమ తమ హోం గ్రౌండ్స్ లో అన్ని జట్లు ప్రిపరేషన్ క్యాంప్స్ నిర్వహించుకుంటాయి. అలాగే ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ లు కూడా ఆడుతుంటాయి. వీటన్నింటికీ ఇప్పుడు బ్రేక్ పడినట్టే భావిస్తున్నారు.
కాగా ఐపీఎల్ వేదికలు ప్రధానంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, ఢిల్లీ డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్, రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్, క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్,పంజాబ్ క్రికెట్ అసోసియేషన్, తమిళనాడు క్రికెట్ అసోసియేషన్, ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ లలో జరుగుతుంటాయి. ఈ రాష్ట్ర క్రికెట్ సంఘాల ప్రధాన స్టేడియాల్లో ఇప్పటికే కొన్ని ప్రైవేట్ లీగ్స్ కూడా షెడ్యూల్ అయ్యాయి. అయితే బీసీసీఐ తాజా ఆదేశాల నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి.