బ్యాటింగ్, ఫీల్డింగ్ కోచ్ లపై వేటు బీసీసీఐ సంచలన నిర్ణయం
ఇంగ్లండ్ పర్యటనకు ముందు టీమిండియా కోచింగ్ స్టాఫ్ లో ప్రక్షాళణకు బీసీసీఐ శ్రీకారం చుట్టింది. తాజా సమాచారం ప్రకారం కోచింగ్ స్టాఫ్‌లో కీలక మార్పులు మొదలయ్యాయి.

ఇంగ్లండ్ పర్యటనకు ముందు టీమిండియా కోచింగ్ స్టాఫ్ లో ప్రక్షాళణకు బీసీసీఐ శ్రీకారం చుట్టింది. తాజా సమాచారం ప్రకారం కోచింగ్ స్టాఫ్‌లో కీలక మార్పులు మొదలయ్యాయి. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్టాఫ్‌లో భాగమైన అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్, ఫీల్డింగ్ కోచ్, తెలుగు తేజం టీ దిలీప్‌లపై బీసీసీఐ వేసింది. కోచ్‌ల సంఖ్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే జట్టులో బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ ఉండటతో అభిషేక్ నాయర్ అవసరం జట్టుకు లేదనే బోర్డు డిసైడయింది. ఈ క్రమంలోనే ఈ సిరీస్‌కు బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరించిన అభిషేక్ నాయర్‌కు ఉద్వాసన పలకాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా దారుణంగా విఫలమైంది. ముఖ్యంగా బ్యాటింగ్ వైఫల్యమే జట్టు పతనాన్ని శాసించింది. ఈ సిరీస్‌ను భారత్ 1-3తో కోల్పోవడంతో.. డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ చేజారింది. కాగా ఫీల్డింగ్ కోచ్ గా దిలీప్ పనిని మరో కోచ్ రయాన్ టెన్ డెస్కాటే చూసుకుంటాడని వెల్లడించింది.
2024 టీ20 ప్రపంచకప్ విజయంతో రాహుల్ ద్రవిడ్ పదవి కాలం ముగియగా.. గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. సపోర్ట్ స్టాఫ్ విషయంలో గంభీర్‌కు బీసీసీఐ పూర్తి స్వేచ్చను ఇచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్లుగానే గంభీర్.. కేకేఆర్ జట్టుకు తనతో కలిసి పనిచేసిన అభిషేక్ నాయర్, ర్యాన్ డస్కటే, మోర్నీ మోర్కెల్‌లను సపోర్ట్ స్టాఫ్‌లోకి తీసుకున్నాడు. ఫీల్డింగ్ కోచ్‌గా టీ దిలీప్‌ను కొనసాగించాడు. కానీ గంభీర్ పర్యవేక్షణలో టీమిండియా ఘోర పరాజయాలను చవిచూసింది. న్యూజిలాండ్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్‌లో క్లీన్ స్వీప్ అయ్యింది. శ్రీలంక గడ్డపై వన్డే సిరీస్‌ను కోల్పోయింది. ఆసీస్‌తో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని చేజార్చుకుంది. అయితే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంతో గంభీర్‌కు కాస్త రిలీఫ్ లభించింది.
అయినా కోచింగ్ స్టాఫ్ సంఖ్య ఎక్కువగా ఉందని, కుదించాలని బీసీసీఐ నిర్ణయించింది. కాగా టీ దిలీప్ పర్యవేక్షణలో టీమిండియా ఫీల్డింగ్ చాలా మెరుగైనా కూడా… అతన్ని ఎందుకు తప్పిస్తున్నారో అర్థం కావడం లేదని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఐపీఎల్ 2025 సీజన్ ముగిసిన వెంటనే టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. జూన్ 20 నుంచి ఇంగ్లండ్‌తో టీమిండియా ఐదు టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది. ఇదిలా ఉంటే భారత డ్రెస్సింగ్ రూమ్‌లో చర్చించుకుంటున్న అంశాలు బయటకు రావడం ఆసీస్ టూర్ నుంచే మొదలైంది. ఇలా లీకులు రావడంతో, ఆటగాళ్లు సరిగా ఆడకపోవడంతో వివాదంపై రచ్చ మొదలైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆటగాళ్ల మానసిక స్థిరత్వం దెబ్బతింటుందని గ్రహించిన ఓ ప్లేయర్ బీసీసీఐకి ఫిర్యాదు చేశాడు. లీకులకు వీళ్లే కారణని భావించి చర్యలు తీసుకున్నట్టు చెబుతున్నారు.