పాకిస్తాన్ కు బిగ్ షాక్ గాయంతో స్టార్ బ్యాటర్ ఔట్
ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ నిలబెట్టుకోవాలనుకుంటున్న పాకిస్తాన్ కు బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే తొలి మ్యాచ్ లో చిత్తుగా ఓడిన పాక్ ను గాయాలు వెంటాడుతున్నాయి.

ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ నిలబెట్టుకోవాలనుకుంటున్న పాకిస్తాన్ కు బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే తొలి మ్యాచ్ లో చిత్తుగా ఓడిన పాక్ ను గాయాలు వెంటాడుతున్నాయి. తాజాగా ఆ జట్టు స్టార్ బ్యాటర్ ఫఖర్ జమాన్ భారత్ తో మ్యాచ్ కు దూరమయ్యాడు. న్యూజిలాండ్ తో మ్యాచ్ సందర్భంగా ఫఖర్ జమాన్ గాయపడ్డాడు. ఫీల్డింగ్ సందర్భంగా గాయపడిన ఫకర్ జమాన్.. ఆతర్వాత కొద్ది సేపు రెస్ట్ తీసుకుని బ్యాటింగ్‌కు దిగాడు. అయితే జమాన్ తన రెగ్యులర్ ఓపెనింగ్ స్థానంలో కాకుండా నాలుగో స్థానంలో బరిలోకి దిగాడు. బ్యాటింగ్ చేస్తున్నంత సేపు జమాన్ చాలా ఇబ్బందిపడ్డాడు. 41 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 24 పరుగులు చేసిన అనంతరం బ్రేస్‌వెల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. జమాన్.. ఛాతీలో కండకాల నొప్పితో బాధపడుతున్నట్లు పాక్ క్రికెట్ బోర్డు వెల్లడించింది.
ఫకర్ జమాన్‌కు ప్రత్యామ్నాయంగా ఇమామ్ ఉల్ హాక్ పేరును ప్రకటించింది పీసీబీ. ఫకర్ స్థానంలో అతడు బరిలోకి దిగుతాడని పేర్కొంది. జమాన్.. భారత్‌తో మ్యాచ్‌కు మాత్రమే దూరంగా ఉంటాడా, లేక టోర్నీ మొత్తానికి దూరమయ్యాడా అన్న విషయంపై క్లారిటీ లేదు. న్యూజిలాండ్‌తో కరాచీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన పాకిస్థాన్ 60 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. 29 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఐసీసీ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న పాకిస్థాన్.. అనూహ్య పరాజయంతో తమ అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. ఈ ఘోర పరాజయం పాకిస్థాన్ సెమీస్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చింది. అయితే ఈ మ్యాచ్‌లో ఓడినా.. పాకిస్థాన్‌కు సెమీస్ అవకాశాలు సజీవంగానే ఉన్నాయి.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 330 పరుగులు చేసింది. విల్ యంగ్, టామ్ లాథమ్సెంచరీలతో రాణించారు. గ్లేన్ ఫిలిఫ్స్ హాఫ్ సెంచరీ చేశాడు. ఆరంభంలో రాణించిన పాక్ బౌలర్లు చివర్లో చేతులెత్తేశారు. చివరి 10 ఓవర్లలో కివీస్ 113 పరుగులు చేసిందంటే పాక్ బౌలింగ్ ఎంత పేలవంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అనంతరం పాకిస్థాన్ 47.2 ఓవర్లలో 260 పరుగులకు కుప్పకూలి ఓటమిపాలైంది. కుష్దిల్ షా, బాబర్ ఆజామ్హాఫ్ సెంచరీలతో రాణించగా.. మిగిలిన వారంతా నిరాశపరిచారు. సొంతపిచ్ పై కూడా పాక్ బ్యాటర్లు పరుగులు చేసేందుకు నానాతంటాలు పడ్డారు. న్యూజిలాండ్ బౌలర్లలో విల్ రూర్కీ, మిచెల్ సాంట్నర్ మూడేసి వికెట్లు తీయగా.. మ్యాట్ హెన్రీ రెండు వికెట్లు పడగొట్టాడు.