రాజస్థాన్ కు బిగ్ షాక్ ఐపీఎల్ కు సంజూ దూరం ?
టీమిండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్ ఐపీఎల్ 18వ సీజన్ కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంగ్లాండ్ తో చివరి టీ ట్వంటీ సందర్భంగా సంజూ గాయపడ్డాడు. బ్యాటింగ్ చేస్తుండగా బాల్ అతని వేలికి తగిలింది.
టీమిండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్ ఐపీఎల్ 18వ సీజన్ కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంగ్లాండ్ తో చివరి టీ ట్వంటీ సందర్భంగా సంజూ గాయపడ్డాడు. బ్యాటింగ్ చేస్తుండగా బాల్ అతని వేలికి తగిలింది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతోనే ఈ మ్యాచ్ లో సంజూ కీపింగ్ కూడా చేయలేదు. అతని స్థానంలో ధృవ్ జురెల్ కీపింగ్ బాధ్యతలు తీసుకున్నాడు. తాజాగా సంజూ శాంసన్ వేలు ఫ్రాక్చర్ అయినట్టు సమాచారం. జోఫ్రా ఆర్చర్ వేసిన ఓవర్ మూడో బంతికి శాంసన్ వేలికి తీవ్ర గాయమైంది. ఆ తర్వాత ఫిజియో అతనికి చాలా సేపు చికిత్స అందించాడు. వేలికి గాయమైనప్పటికీ, శాంసన్ బ్యాటింగ్ చేసి ఆర్చర్ ఓవర్ చివరి రెండు బంతుల్లో ఒక సిక్స్, ఫోర్ కొట్టాడు. కానీ, రెండో ఓవర్‌లో మార్క్ వుడ్ వేసిన బంతికి ఆర్చర్‌కి క్యాచ్ ఇచ్చాడు. 7 బంతుల్లో 16 పరుగులు చేసి శాంసన్ ఔటయ్యాడు. ఈ సిరీస్ మొత్తం సంజూ నిరాశపరిచాడు. 5 మ్యాచ్ లలో కేవలం 35 పరుగులే చేశాడు.
ఇప్పుడు గాయంతో రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ కు దూరమైనట్టు తెలుస్తోంది. గాయం తీవ్రత దృష్ట్యా అతను కనీసం ఆరు వారాలు ఆటకు దూరం కానున్నట్టు సమాచారం. అదే జరిగితే ఐపీఎల్ లో కొన్ని మ్యాచ్ ల నుంచి దూరమవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం సంజూ శాంసన్ బెంగళూరు నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళుతున్నాడు. అక్కడ ఎన్సీఎ మెడికల్ టీమ్ ఆధ్వర్యంలో చికిత్స తీసుకుని ఫిట్ నెస్ సాధించాల్సి ఉంటుంది. గాయం తీవ్రతను బట్టి చూస్తే ఆరు వారాల తర్వాత ఫిట్ నెస్ టెస్ట్ పాసయితే ఐపీఎల్ ఆడే అవకాశముంటుంది. ఒకవేళ ఐపీఎల్ 18వ సీజన్ కు సంజూ దూరమైతే మాత్రం రాజస్థాన్ రాయల్స్ కు బిగ్ షాక్ గానే చెప్పాలి. ఎందుకంటే సంజూ ఆ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించడంతో పాటు వికెట్ కీపింగ్ బ్యాటర్ గా కీలకంగా ఉన్నాడు. గత సీజన్ లో అద్భుతంగా రాణించిన సంజూ శాంసన్ పైనే రాజస్థాన్ ఆశలు పెట్టుకుంది.
ఇప్పుడు ఈ కేరళ వికెట్ కీపర్ గాయంతో దూరమైతే కెప్టెన్సీ రీప్లేస్ మెంట్ వెతుక్కోవాల్సి ఉంటుంది. ఆ జట్టు ఇంగ్లాండ్ కెప్టెన్ బట్లర్ ఉండడంతో అది పెద్ద సమస్య కాకపోవచ్చు. కానీ ఐపీఎల్ ప్రారంభానికి ఇంకా 6 వారాల కంటే ఎక్కువ సమయమే ఉండడంతో సంజూ కోలుకుంటాడని రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ వర్గాలు ఆశాభావంతో ఉన్నాయి. సంజూ శాంసన్ గత ఐపీఎల్ సీజన్ లో 15 మ్యాచ్ లు ఆడి 531 పరుగులు చేశాడు. రాజస్థాన్ రాయల్స్ ను అద్భుతంగా నడిపిస్తున్న సంజూ సారథ్యంలోనే ఆ జట్టు 2022లో రన్నరప్ గా నిలిచింది.