లక్నో జట్టుతోనే కెఎల్ రాహుల్ రిటైన్ లిస్టులో బిగ్ ట్విస్ట్
ఐపీఎల్ మెగా వేలం దగ్గర పడే కొద్దీ సమీకరణాలు మారిపోతున్నాయి. ఇటీవలే బీసీసీఐ రిటెన్షన్ రూల్స్ ను ఖరారు చేయగా.. ఫ్రాంచైజీలు తమ తమ రిటైన్ జాబితాపై దాదాపు క్లారిటీ తెచ్చుకున్నాయి. ఒకరిద్దరి విషయంలో తప్ప మిగిలిన వారిపై ఫ్రాంచైజీల కసరత్తు పూర్తయినట్టే కనిపిస్తోంది.
ఐపీఎల్ మెగా వేలం దగ్గర పడే కొద్దీ సమీకరణాలు మారిపోతున్నాయి. ఇటీవలే బీసీసీఐ రిటెన్షన్ రూల్స్ ను ఖరారు చేయగా.. ఫ్రాంచైజీలు తమ తమ రిటైన్ జాబితాపై దాదాపు క్లారిటీ తెచ్చుకున్నాయి. ఒకరిద్దరి విషయంలో తప్ప మిగిలిన వారిపై ఫ్రాంచైజీల కసరత్తు పూర్తయినట్టే కనిపిస్తోంది. అనూహ్యంగా లక్నో సూపర్ జెయింట్స్ కెఎల్ రాహుల్ ను రిటైన్ చేసుకుంటున్నట్టు సమాచారం. నిజానికి కేఎల్ రాహుల్ ఆ జట్టును వీడిపోవడం ఖాయమని అందరూ భావించారు. గత సీజన్ లో సన్ రైజర్స్ తో మ్యాచ్ లో ఘోరపరాజయం చవిచూడటంతో లక్నో ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గోయెంకా ఆవేశాన్ని ఆపుకోలేకపోయాడు. జట్టు సారథి కేఎల్ రాహుల్‌పై బహిరంగంగానే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా అప్పట్లో వైరల్ గా మారింది.. కెప్టెన్‌తో అమర్యాదగా ప్రవర్తించడమేంటని లక్నో ఫ్రాంచైజీపై నెట్టింట విమర్శలు కూడా వచ్చాయి. ఈ ఘటన తర్వాతే రాహుల్ ఆ జట్టును వీడాలని నిర్ణయం తీసుకున్నట్టు కూడా ప్రచారం జరిగింది.
అయితే ఇప్పుడు అనూహ్యంగా ఆ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. లక్నో ఫ్రాంచైజీ రిటైన్ జాబితాలో మొదటి ప్రాధాన్యత రాహుల్ కేనని సమాచారం. 18 కోట్లకు అతన్ని రిటైన్ చేసుకుని సారథిగానే కొనసాగించాలని ఫ్రాంచైజీ నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో రాహుల్ వేలంలోకి వస్తే తీసుకోవాలనుకున్న పలు ఫ్రాంచైజీలకు ఇది షాకింగ్ న్యూస్ గానే చెప్పాలి. మరోవైపు లక్నో రిటైన్ జాబితాలో రెండో ప్రాధాన్యత నికోలస్ పూరన్ కు ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. గత కొంతకాలంగా టీ ట్వంటీ ఫార్మాట్ లో పూరన్ దుమ్మురేపుతున్నాడు. ఇటీవల కరేబియన్ ప్రీమియర్ లీగ్ లోనూ పరుగుల వరద పారించాడు. దీంతో ఎట్టిపరిస్థితుల్లోనూ అతన్ని లక్నో వదులుకోదు.
అలాగే పేస్ బౌలర్ మయాంక్ యాదవ్ కు 11 కోట్లు ఇచ్చి రిటైన్ చేసుకోబోతోంది. నిజానికి అన్ క్యాప్డ్ కేటగిరీలో ఉన్న మయాంక్ ఇటీవలే బంగ్లాతో టీ ట్వంటీ సిరీస్ తో అరంగేట్రం చేయడంతో క్యాప్డ్ కేటగిరీలోకి వచ్చేశాడు. దీంతో మరో ఏడు కోట్లు ఎక్కువ ఇవ్వక తప్పడం లేదు.
లక్నో మిగిలిన జాబితాను చూస్తే అన్ క్యాప్డ్ కేటగిరీలో ఆయూష్ బదౌనీ, మోనిస్ ఖాన్ ఉండే అవకాశముంది. వీరిద్దరికీ నాలుగు కోట్ల చొప్పున చెల్లించి లక్నో తమతో పాటే కొనసాగించుకోనుంది. ఇక రైట్ టూ మ్యాచ్ ఆప్షన్ ద్వారా ఏడుగురు ప్లేయర్స్ లో లక్నో ఎవరిని తీసుకుంటుందో చూడాలి. స్టోయినిస్, రవి బిష్ణోయ్ , నవీనుల్ హక్, డికాక్ , కృనాల్ పాండ్యా వంటి ప్లేయర్స్ లో ఆర్టీఎం కార్డును లక్నో ఎవరికి ఉపయోగిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. స్టోయినిస్ లేదా నవీనుల్ హక్ ఇద్దరిలో ఒకరిని రైట్ టూ మ్యాచ్ ద్వారా తీసుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఇక బౌలింగ్ కాంబినేషన్ లోనూ లక్నో ఈ సారి కూడా యువక్రికెటర్ల వైపే మొగ్గుచూపే అవకాశముంది. గత సీజన్ లో లక్నో 14 మ్యాచ్ లలో ఏడు విజయాలతో ఏడో స్థానంలో నిలిచింది.