రోహిత్ కు బీసీసీఐ బిగ్ షాక్ రిటైర్మెంట్ పై తేల్చమన్న బోర్డు
భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు బీసీసీఐ షాకిచ్చింది. రిటైర్మెంట్ పై ఏదోఒకటి తేల్చేయాలంటూ ఆదేశించింది. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఫ్యూచర్ ప్లాన్ ఏంటో చెప్పాలంటూ స్పష్టం చేసింది.
భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు బీసీసీఐ షాకిచ్చింది. రిటైర్మెంట్ పై ఏదోఒకటి తేల్చేయాలంటూ ఆదేశించింది. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఫ్యూచర్ ప్లాన్ ఏంటో చెప్పాలంటూ స్పష్టం చేసింది. ఒకవిధంగా బోర్డు నుంచి రోహిత్ కు ఇది ఊహించని పరిణామంగానే చెప్పాలి. జట్టు కెప్టెన్ గా ఎన్నో విజయాల్లో కీలకపాత్ర పోషించిన హిట్ మ్యాన్ గత కొంతకాలంగా పేలవ ఫామ్ తో సతమతమవుతున్నాడు. దాదాపు ఏడాదిన్నర నుంచి రోహిత్ ఒక్క భారీ ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. ఏ ఫార్మాట్ లోనూ అతని మెరుపులు కనిపించడం లేదు. వరుస వైఫల్యాలకు తోడు ఇటీవల టెస్టుల్లో జట్టు ఓటములు కూడా అతనిపై ఒత్తిడి పెంచాయి. ముఖ్యంగా స్వదేశంలో న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ లో వైట్ వాష్ పరాభవం రోహిత్ కు పెద్ద షాక్ అనే చెప్పాలి. అంతకుముందే లంక చేతిలో చిత్తుగా ఓడి భారత పర్యటనకు వచ్చిన కివీస్ రోహిత్ సేనను ఓడిస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. అది కూడా 3-0తో సిరీస్ చేజారుతుందని కూడా ఊహించలేదు.
దీని తర్వాత ఆస్ట్రేలియా టూర్ లోనూ ఇదే పరిస్థితి. బుమ్రా సారథ్యంలో తొలి టెస్ట్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ జట్టు పగ్గాలు అందుకున్నాడు. అక్కడ నుంచి మళ్ళీ ఓటములే ఎదురయ్యాయి. ఫలితంగా ఐదు టెస్టుల సిరీస్ ను భారత్ 1-3తో చేజార్చుకుంది. దాదాపు పదేళ్ళ తర్వాత ఆసీస్ జట్టు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలిచింది. నిజానికి ఈ టూర్ మధ్యలోనే రోహిత్ టెస్ట్ ఫార్మాట్ కు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నాడు. దాదాపుగా ప్రకటన చేసేందుకు సిద్ధపడిన వేళ సన్నిహితుల ఒత్తిడితో మళ్ళీ వెనక్కి తగ్గాడు. అటు వ్యక్తిగత వైఫల్యాలతో తుది జట్టు నుంచి తనంతట తానుగానే తప్పుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఆ తర్వాత ఫామ్ కోసం రంజీ మ్యాచ్ ఆడినా ఫలితం లేకపోయింది.
ఈ నేపథ్యంలో బీసీసీఐ రోహిత్ కు అల్టిమేటమ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఫ్యూచర్ ప్లాన్స్ పై క్లారిటీ ఇవ్వాలని ఆదేశించింది. నిజానికి గత సెలక్షన్ కమిటీ మీటింగ్ లో రోహిత్ శర్మతో సెలక్టర్లు, బోర్డు సభ్యులు చర్చలు జరిపారు. అప్పుడు అతడు ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత తన భవిష్యత్ ప్రణాళికలను ఎంటనేది చెప్పడానికి కాస్త సమయం కావాలని అడగడం, దానికి బీసీసీఐ ఒకే చెప్పడం చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం బీసీసీఐ వచ్చే డబ్ల్యూటీసీ సైకిల్ తో పాటు వన్డే వరల్డ్ కప్ కోసం మేనేజ్‌మెంట్ కొన్ని ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. దీని కోసం ప్రతి ఒక్కరితో చర్చలు జరిపి, వారి అభిప్రాయలను తెలుసుకుని.. ఈ ప్రక్రియను సుజావుగా సాగేలా చూడాలనేదే బోర్డు ఉద్దేశ్యమని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు.
కాగా రోహిత్ శర్మ గతేడాది టీ20 వరల్డ్ కప్ తర్వాత పొట్టి ఫార్మాట్‌కు రోహిత్ గుడ్ బై చెప్పేశాడు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్ ఇలాంటి సంచలన నిర్ణయమే తీసుకుంటాడని తెలుస్తోంది. ఒకవేళ అంతర్జాతీయ క్రికెట్‌కు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటిస్తే.. అతడి స్థానంలో రెండు ఫార్మాట్లకు సారథులను నియమించాలి. టెస్టులకు బుమ్రా, పంత్, యశస్వి జైస్వాల్ పేర్లను పరిశీలిస్తుండగా… వన్డేలకు గిల్, పంత్ పేరును పరిశీలిస్తున్నారని సమాచారం. మొత్తం మీద ఛాంపియన్స్ ట్రోఫీతో హిట్ మ్యాన్ ఫ్యూచర్ తేలిపోనుంది.