Dwayne Bravo: శరణం భజే భజే 39 బంతుల్లో 76 పరుగులు
వెస్టిండీస్ విధ్వంసకర ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా.. బౌలింగ్ కోచ్‌గా ఐపీఎల్‌లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినా.. నాలుగు పదుల వయసుకు చేరినా.. తన ఆట ఏ మాత్రం మారలేదని చాటి చెబుతున్నాడు.

అగ్రరాజ్యం అమెరికా వేదికగా జరుగుతున్న మినీ ఐపీఎల్ అలియాస్ మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో డ్వేన్ బ్రావో దుమ్మురేపుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ కు చెందిన టెక్సాస్ సూపర్ కింగ్స్ టీమ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న డ్వేన్ బ్రావో.. తాజాగా వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టుతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 39 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 76 పరుగులతో అజేయంగా నిలిచాడు. అయితే ఈ మ్యాచ్‌లో అతను ఓ భారీ సిక్సర్ కొట్టాడు. మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలోనే భారీ సిక్సర్‌గా నిలిచిపోయింది. ఈ సిక్స్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
వాషింగ్టన్ ఫ్రీడమ్ టీమ్ పేసర్, సౌతాఫ్రికా స్టార్ అన్రిచ్ నోర్జ్ వేసిన షార్ట్ పిచ్ బాల్‌ను బ్రావో తనదైన పుల్ షాట్‌తో భారీ సిక్సర్‌గా మలిచాడు. బ్రావో ధాటికి బంతి 106 మీటర్ల దూరంలో మైదానం బయటపడింది. టీఎస్‌కే ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ రెండో బంతిని నోర్జ్ బౌన్సర్‌గా వేయగా.. బ్రావో పుల్ షాట్‌తో లాంగాన్ దిశగా సిక్సర్ బాదాడు. ఈ భారీ సిక్సర్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ‘బ్రావో భారీ సిక్సర్ పోలా అదిరిపోలా’అని కామెంట్ చేస్తున్నారు. వయసు కేవలం సంఖ్య మాత్రమేనని బ్రావో నిరూపిస్తున్నాడని కొనియాడుతున్నారు. దురదృష్టవశాత్తు బ్రావో టీమ్ ఈ మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మరో బ్యాటర్ నుంచి సరైన సహకారం లభించకపోవడంతో ఓటమికి తల వంచింది.