సిక్సర్ల వీరుడికి ఢిల్లీ బంపరాఫర్ కోచ్ గా రావాలంటూ చర్చలు
ఐపీఎల్ వేలం వస్తుందంటే ఆటగాళ్ళపైనే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఏ ప్లేయర్ ఎక్కువ ధర పలుకుతాడు… ఎవరిని టీమ్ లోకి తీసుకోవాలి.. కెప్టెన్ గా ఎవరికి బాధ్యతలు ఇస్తారనేదానిపైనే ఎక్కువ చర్చ జరుగుతుంది. అయితే ఈ సారి దీనికి భిన్నంగా తమ టీమ్ కోచ్ ల కోసం కూడా ఫ్రాంచైజీలు వేటను మొదలుపెట్టాయి. ఒకరిద్దరి కోచ్ ల కోసం కొన్ని ఫ్రాంచైజీల మధ్య గట్టిపోటీనే నడుస్తోంది. తాజాగా టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కు కోచ్ గా గట్టి డిమాండ్ నెలకొంది. ఈ సిక్సర్ల వీరుడి కోసం ఫ్రాంచైజీలు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నాయి.
మిగిలిన టీమ్స్ కంటే ముందు గుజరాత్ టైటాన్స్ యువీతో సంప్రదింపులు చేసింది. ఆశిష్ నెహ్రా స్థానంలో యువరాజ్ కోచ్‌గా బాధ్యతలు కూడా అప్పగించడం ఖాయమన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే యువరాజ్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ కూడా కర్చీఫ్ వేసింది. తమ ఫ్రాంచైజీ కోచ్ గా యువీకి భారీ ఆఫర్ ప్రకటించి చర్చలు జరుపుతోంది. ఢిల్లీ ఆఫర్ పై యువీ కూడా సానుకూలంగా ఉన్నట్టు సమాచారం. అన్నీ కుదిరితే కోచ్ గా యువరాజ్ ఢిల్లీ జట్టుతోనే తన జర్నీని మొదలుపెట్టే అవకాశముంది. మెగా వేలానికి ముందే అన్ని ఫ్రాంచైజీలు తమ సపోర్టింగ్ స్టాఫ్ లోనూ భారీగా మార్పులు చేస్తున్నాయి. ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ ను కోచ్ గా తప్పించిన ఢిల్లీ యువీ కోసం ప్రయత్నిస్తోంది.
అలాగే జట్టులోనూ పలు మార్పులు చేసేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ సిద్ధమైంది. తమ టైటిల్ కలను నెరవేర్చుకునే క్రమంలో కీలక నిర్ణయాలు తీసుకోబోతోన్నట్టు తెలుస్తోంది.